అడిగినంత ‘ఉపాధి’!
ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో పని కావాలని కోరిన అన్ని కుటుంబాలకు పరిమితి లేని విధంగా పనులను కల్పించవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జూపల్లి అధ్యక్షతన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయంలో ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
కౌన్సిల్‌లో చర్చించిన పలు అంశాలను జూపల్లి విలేకరులకు వివరించారు. ఉపాధిహామీ పనుల్లో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలి పేలా అందరి భాగస్వామ్యంతో ముందుకు పోవాలని కౌన్సిల్ తొలి సమావేశం నిర్ణయించిందని తెలిపారు. జాబ్‌కార్డు కలిగిన 54 లక్షల కుటుంబాల్లో కనీసం 60 శాతం మందికి ఈ ఏడాది మార్చి 31లోగా 100 రోజుల పని కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. జిల్లా స్థాయిలోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉపాధి పనుల్లో వేగం పెంచాలని, నిధులకు కొరత లేదని పేర్కొన్నారు.
నర్సరీల్లో 100 రోజుల నిబంధన సడలింపు
ఉపాధి హామీ పథకం కింద నర్సరీల్లో 100 రోజులు మాత్రమే పనిచేసే నిబంధనను సడలిస్తున్నట్లు జూపల్లి పేర్కొన్నారు. దివ్యాంగులైన కూలీలకు 150 రోజుల పనిదినాలు కల్పించాలని నిర్ణయించామని వెల్లడించారు. 100 రోజుల వేతనానికి అయ్యే సొమ్మును కేంద్రం చెల్లించనుండగా, మిగిలిన 50 రోజుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఈ ఏడాదికి మంజూరైన 10 కోట్ల పనిదినాలకు అదనంగా మరో 6 కోట్ల పని దినాలు కావాలని కోరగా, కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. లక్ష్యానికి మించి పనిచేసిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. సమావేశంలో గిరిజన సంక్షేమం, నీటిపారుదల శాఖల కార్య దర్శులు సోమేశ్ కుమార్, వికాస్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ వరంగల్, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్లు పద్మ, తుల ఉమ పాల్గొన్నారు.