కొన్ని రకాల శారీరక తత్వాలకు అనుగుణంగా ఏడాదంతా చెమట సమస్య ‘హైపర్‌హైడ్రోసిస్’ ఇది కొందరిలోనే కనిపిస్తుంది. అయితే వేసవిలో అందరి సమస్యగా మారుతుంది. మరి దీనిని ఎలా ఎదుర్కోవాలి? ఈ సీజన్‌లో స్వెట్ మేనేజ్‌మెంట్‌పై నగరానికి చెందిన వైద్యులు ఏమంటున్నారంటే.
సాక్షి, సిటీబ్యూరో: మనం వేడి వాతావరణంలో పనిచేయడానికి సిద్ధపడినప్పుడే శరీరపు ఉష్టోగ్రతను తగిన విధంగా నియంత్రించడానికి శరీరం చెమటను ఉత్పత్తి చేస్తుంది. అధిక బరువు తరహాలో అధిక చెమట అని నిర్వచించడానికి కొలమానం లేదు. ఎంత మొత్తమైతే శారీరక ఇబ్బందులకు కారణం అవుతుందో అదే అతి స్వేదంగా ప్రస్తుతానికి పేర్కొంటున్నారు.
మితి మీరితే...సమస్యలే...
అధికంగా చెమట పడితే చర్మం కణాలు పాడయ్యేందుకు చర్మం కింద వాపులకు కారణం కావచ్చు. చెమట కారణంగా నీటి శాతం వేగంగా కోల్పోవడం తద్వారా శరీరపు ఉష్ణోగ్రత పరిమితికి మించి దాటి పోవడం వల్ల వడదెబ్బకు గురవుతాం. విపరీతమైన వేడిలో ఎక్కువ సేపు ఉండడం వల్ల శరీరంలోని నీటిశాతం ఆవిరై అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే తగినంత చల్లదనం ఉన్న ప్రదేశాల్లో ఉంటూ, మంచినీరు, ద్రవపదార్థాలు బాగా తీసుకోవాలి అంటున్నారు..నిజాంపేటలోని అపోలో క్లినిక్‌కు చెందిన డాక్టర్ కల్పన.
స్వేదం...దుర్గంధం..
వాస్తవానికి చెమటకు దుర్గంధం వెదజల్లే గుణం ఉండదు కానీ, అక్కడ బాక్టీరియా పెరుగుతున్న కొద్దీ వాసన కూడా పెరుగుతుంది. పొడి చర్మం మీద బాక్టీరియా వృద్ధి చెందలేదు కాబట్టి ఎప్పుడూ చర్మాన్ని వీలైనంతగా పొడిగా ఉంచుకోవాలి. కొన్ని రకాల కొవ్వు పదార్థాలు, నూనెలు, గాఢమైన వాసన వచ్చే ఉల్లిపాయలు, వెల్లుల్లి ఆహార పదార్థాలు కూడా చెమటలోని దుర్గంధాన్ని పెంచుతాయి. చెమట వెలువరించే వాసనను నిరోధించడానికి డియోడరెంట్స్ ఉపకరిస్తాయి. అయితే వీటి వల్ల చెమట తగ్గదనేది గుర్తుంచుకోవాలి. అల్యుమినియం సాల్ట్స్ కలిగి ఉండే యాంటిపెరిస్పిరెంట్ ఎంచుకోవాలి. వీటిని రాత్రి పూట ఉపయోగించడం మంచిది. ఇవి చెమట కారడాన్ని అదుపు చేస్తాయి. అయితే ఇవి అధికంగా వినియోగిస్తే చర్మంపై ఇరిటేషన్‌కు కారణమవ్వొచ్చు.
కెఫిన్...నాట్ ఫైన్ ...
రోజువారీగా మనం తీసుకునే కాఫీ/టీ పరిమా ణం సైతం మనకు చెమట పెరిగేందుకు కారణమవుతుంది. కేంద్ర నాడీ మండలాన్ని కెఫైన్‌స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది స్వేద గ్రంథుల్ని చురుగ్గా మారుస్తుంది. కాఫీ మీద మరీ మక్కువ ఉంటే కోల్డ్ కాఫీ కొంత మేలు. అలాగే స్‌పైసీ ఫుడ్ వల్ల అంతర్గత వేడి పెరుగుతుంది. ఈ స్‌పైసీ ఫుడ్‌లోని పెప్పర్స్‌లో ఉండే క్యాప్‌సాౖయెసిన్ శరీరం చల్లబడాల్సిన అవసరం ఉందని స్వేద గ్రం ధులకు సమాచారం పంపడంతో చెమట పెరుగుతుంది. అధిక కాల్షియం ఉన్న ఆహారం తీసుకుంటే అవి శరీరపు ఉష్టోగ్రతను నియంత్రించేందుకు అవసరమైన ఎమినో యాసిడ్స్‌ను ఉత్పత్తిచేస్తాయి.
షవర్...హుషార్..
యాంటి బాక్టీరియల్ సోప్‌ను స్నానానికి వినియోగించాలి. రోజూ షవర్ స్నానం మంచిది. పూర్తిగా శరీరం పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. స్ప్రేలు, పౌడర్స్, రోల్ ఆన్స్ రూపాల్లో అందుబాటులో ఉన్న యాంటి పెర్సిపిరెంట్ అప్‌లై చేయాలి. పాలిస్టర్, నైలాన్ వంటి ఫ్యాబ్రిక్స్ వద్దు. లేత రంగు కాటన్, లినెన్, లైట్ వెయిట్ డెనిమ్ వంటి ఫ్యాబ్రిక్స్ వినియోగం మంచివి. చెమటను పీల్చుకునే ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవాలి. ఒకసారి చర్మం చల్లబడి పొడి బారిన తర్వాత కోల్డ్ క్యాలమైన్ లోషన్ అప్‌లై చేయవచ్చు. ప్రిక్లీ హిట్ పౌడర్ కూడా ఉపకరిస్తుంది.
గర్భిణులు జాగ్రత్త...
ఎండాకాలంలో చిన్న బరువు కూడా పెద్దగా అనిపిస్తుంది. రెట్టింపు చెమట పడుతుంది. ఈ సమయంలో గర్భం దాల్చిన మహిళలకు చెమట సమస్య మరింతగా వేధిస్తుంది. ఈ సమయంలో వీరి మెటబాలిజం కూడా ఇద్దరి కోసం పనిచేస్తుంది కాబట్టి అది మరింత స్వేదానికి కారణమవుతుంది. వీరు ఎక్కువ మంచినీరు తాగడం అవసరం. ఎక్కువ ఎండ లేని సమయంలోనే బయటకు వెళ్లాలి. రాత్రి పూట స్వేదం వల్ల నిద్ర సరిగా పట్టని పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి చెమట పట్టని విధంగా రూమ్ టెంపరేచర్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సలాడ్స్, జ్యూస్‌లు బాగా తీసుకోవాలి. బరువు మరీ పెరగకుండా చూసుకోవడం కూడా అవసరమే. బయటకు వెళుతుంటే తప్పకుండా ఒక వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవడం మంచిది. కాఫీ, టీలకు బదులు హెర్బల్ టీ తాగవచ్చు. సోడాలు కూల్‌డ్రింక్స్ వద్దు. –డాక్టర్ రోలికా కేశ్రి, అపోలో క్రెడిల్, కొండాపూర్
Comments
Please login to add a commentAdd a comment