పేదల గొంతు తడ పండి
► వేసవి ముగిసేవరకు
► ట్యాంకర్లతో నీటిసరఫరా చేయాలి
► పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
► మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ,
► ఎమ్మెల్యేల డిమాండ్
మహబూబ్‌నగర్ క్రైం : మండే ఎండల్లో తాగునీటికోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, వారి గొంతు తడపడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మానిటరింగ్ కమిటీ సమావేశ అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య అన్నారు. సోమవారం స్థానిక జెడ్పీహాల్‌లో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ సమావేశం ఎంపీ నంది ఎల్లయ్య అధ్యక్షతన జరిగింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం, డ్వామా, హౌసింగ్, పంచాయతీ రాజ్, డీఆర్‌డీఏ, జెడ్పీ, గిరిజన సంక్షేమ శాఖ, మాడా విభాగాలపై వేర్వేరుగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేసే గ్రామీణాభివృద్ధి పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
వేసవి ముగిసేవరకు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం మినరల్ వాటర్ సరఫరా చేయాలన్నారు. లీజుకు తీసుకున్న బోర్లు, ట్రాన్స్‌పోర్ట్ బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదని, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాలను సందర్శించడం లేదన్నారు. తాగునీటి పథకాలను పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని సమావేశంలో ఎంపీ నంది ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఇంచార్జ్ కలెక్టర్ రాంకిషన్, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, హౌసింగ్ పీడీ రమణారావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యమే.. : జెడ్పీచైర్మన్
గట్టు మన్నపురం తాగునీటి పథకం ప్రారంభం చేసి ఏళ్లు గడుస్తున్నా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరడంలేదు. గతంలో వరుసగా 10 సార్లు గెలిచిన నేతలు గద్వాలకు ఏం చేయలేకపోయారు. తాగునీటి పథకంలో నాసిరకం పైపులు వేసి ప్రజాధనం వృథా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
ప్రత్యేక నిధులు కావాలి : డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే
నాగర్‌దొడ్డి పథకాలకు సకాలంలో నిధులు అందక ఇబ్బందులొస్తున్నాయి. ప్రత్యేక నిధులు వస్తేగాని సమస్యలు తీరవు. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా గ్రామాల్లో తాగునీరు సరఫరా చేయాలి. ప్రతి మనిషికి వంద లీటర్ల చొప్పున నీటి సరఫరా చేయాలి.
కౌకుంట్లను పూర్తిచేయండి వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
తాగునీరు సమస్య లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కౌకుంట్ల తాగునీటి పథకం పనులు త్వరగా పూర్తిచేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి.
ఒక్క సమస్యా పరిష్కారం కాలే.. సంపత్‌కుమార్, అలంపూర్ ఎమ్మెల్యే
గతంలో జరిగిన సమావేశంలో నీటి సమస్యపై చాలాసార్లు చర్చించాం. అయినా ఏ ఒక్క సమస్యను కూడా అధికారులు పరిష్కరించలేదు. ప్ర భుత్వం నుంచి వస్తున్న కోట్ల రూపాయలు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదు. మీ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోతున్నారు. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారుల బాధ్యత ఎంతో ఉంది.
ప్రణాళికతో ముందుకెళ్లాలి : కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
ఎన్నడూలేని విధంగా ఈ సారి ఎండల ప్ర భావం ఉంది. ఈ కారణంతోనూ నీటికి అనేక స మస్యలు వస్తున్నాయి. అధికారులు సమస్యను అధిగమించడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలి. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా ప్రజలకు సరిపోవడంలేదు. వాటి సంఖ్యను పెంచాలి. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఎన్‌సీడీపీ పథకం కింద విడుదల చేసిన రూ.66 కోట్లను వినియోగించుకోవాలి.
డీకే అరుణగీ బండారి భాస్కర్
సమావేశంలో బండారి భాస్కర్ మాట్లాడుతున్న సమయంలో గట్టు మన్నపురం ప ను ల్లో అవినీతి జరిగిందని ఆరోపించగా గ ద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కలుగచేసుకున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన విషయాలు తె లుసుకొని మాట్లాడాలని, నోటికేదొస్తే అది మాట్లాడితే సరిపోదని తప్పుపట్టారు. ప్ర స్తుతం మీ ప్రభుత్వం ఉంది మీకు నచ్చిన ప నులు గద్వాలకు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. అందుకు జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్ బదులిస్తూ గద్వాలకు గత పదేళ్ల నుంచి వరుసగా గెలిచి ఏం చేశారని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటల యు ద్ధం చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యే లు కలుగజేసుకొని వారిని సముదాయించారు.