* వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 129 మంది మృతి
* సాధారణంకంటే నాలుగైదు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు
* నిజామాబాద్, రామగుండంలో 47, నల్లగొండలో 46 డిగ్రీలు
* హైదరాబాద్‌లో గరిష్టం 44.3గా నమోదు
* మరింత పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ
* చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సర్కారు ఆదేశం
* ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే 81 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టం అగ్నిగుండంగా మారింది. మండుటెండలకు వందలాది మంది బలవుతున్నారు. ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడగాడ్పులకు వృద్ధులు, చిన్నారులు విలవిల్లాడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం వారే ఉంటున్నారు. వడదెబ్బకు గురువారం ఒక్కరోజే రాష్ర్టవ్యాప్తంగా 129 మంది మృతి చెందారు. కరీంనగర్ జిల్లాలో 30 మంది, ఖమ్మంలో 25 మంది, నల్లగొండలో 20 మంది, వరంగల్ జిల్లాలో 22 మంది, మహబూబ్‌నగర్‌లో 11 మంది, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏడుగురు చొప్పున,హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, నిజామాబాద్‌లో ఒకరు మృత్యువాత పడ్డారు. కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఎండలతో రాష్ర్టం నిప్పుల కొలిమిలా మారింది.
అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువ గా నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా నిజామాబాద్, రామగుండంలో పగటి ఉష్ణోగ్రత 47 డిగ్రీలుగా రికార్డయింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. బుధవారం కొత్తగూడెం లో 49.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానికంగా వార్తలొచ్చినా అధికారులు దాన్ని ఖండించడం తెలిసిందే. నిజామాబాద్‌లో సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికంగా, రామగుండంలో నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలకు చేరింది. శుక్రవారానికి 45 డిగ్రీలకు చేరే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలంతా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకృతి వైపరీత్యాల విభాగం కమిషనర్ బీఆర్ మీనా సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
కొత్తగూడెంలో 50 డిగ్రీలకుపైనే..!
ఖమ్మం జిల్లా కొత్తగూడెం భగభగమంటోంది. సూర్యప్రతాపంతో కార్మిక వాడలు బెంబేలెత్తుతున్నారుు. అధికారికంగా నిర్ధారించకున్నా... మూడు రోజులుగా 49.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. స్థానికులు కాలు బయట పెట్టేందుకే భయపడుతున్నారు. కేటీపీఎస్, నవభారత్, స్పాంజ్ ఐరన్ వంటి పరిశ్రమలున్న పాల్వంచలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సింగరేణి ఓపెన్‌కాస్టుల్లో గురువారం 51 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైనా, సెలవు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్మికులను విధులకు అనుమతించకపోవడం గమనార్హం.
నెమళ్లు, కోడిపిల్లల మృతి
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో ఎండ తీవ్రతకుతోడు నీళ్లు లేకపోవడంతో 13 నెమళ్లు మృత్యువాత పడ్డాయి. అటవీ శాఖ అధికారులు వాటిని గుర్తించి అక్కడే దహనం చేశారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామ పంచాయతీ పరిధిలోని రాగిబావి గ్రామంలోని కోళ్లఫారంలో వడదెబ్బకు గురై గురువారం 6500 కోడిపిల్లలు మృతిచెందాయి. హైదరాబాద్ శివార్లలో కూడా వేలాది కోళ్లు మృత్యువత పడ్డాయి. కరీంనగర్ జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం(ఎఫ్‌సీఐ) ఆవరణలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు లేచారుు. యంత్ర సామగ్రి మొత్తం కాలిపోయింది.
ఏపీ.. నిప్పుల కొలిమి
సాక్షి, హైదరాబాద్, విశాఖపట్నం: మండుతున్న ఎండలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే గురువారం మూడు నుంచి అయిదు డిగ్రీల సెల్సియస్‌కుపైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడలో అత్యధికంగా 46, గుంటూరులో 45.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో పెరిగిన వేడికి వడగాల్పులు తోడవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ బారినపడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 81 మంది మృతిచెందారు.
తిరుమలలో ‘సూర్య’ ప్రతాపం
తిరుమలలోనూ భానుడు ప్ర‘తాపాన్ని’ చూపించాడు. పగలు ఉష్ణోగ్రత సుమారు 36 డిగ్రీలకు పైగా నమోదైంది. ఉదయం 8 నుంచే ఎండ తీవ్రత కనిపించింది. ఉక్కపోత తీవ్రరూపం దాల్చింది. దీంతో మధ్యాహ్నం ఆలయ ప్రాంతం బోసిపోయింది. అలాగే నాలుగు మాడ వీధుల్లో పాదరక్షల నిషేధం ఉండటంతో స్వామివారిని దర్శించుకుని వెలుపలికి వచ్చిన భక్తులు కాళ్లు కాలడంతో పరుగులు తీస్తూ కనిపించారు.
పిట్టల్లా రాలుతున్నారు
Published Fri, May 22 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement