రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్‌లో చల్లటి వాతావరణం ఉంటుంది.
హైదరాబాద్, హన్మకొండల్లో అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్‌లో చల్లటి వాతావరణం ఉంటుంది. కానీ ఇటీవల ఎండల తీవ్రత పెరిగింది. గత 24 గంటల్లో హైదరాబాద్‌లో 36 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది 5 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ ఇన్‌చార్జి డెరైక్టర్ సీతారాం ‘సాక్షి’కి చెప్పారు. హన్మకొండలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, హకీంపేట, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజుల వరకు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని సీతారాం వెల్లడించారు. అక్టోబర్ నెలలో సాధారణంగా కొద్దిపాటి వర్షాలు కురుస్తాయి. కొన్ని సందర్భాల్లో తుపాన్లు వస్తాయి. గత నెల 24 తర్వాత వర్షాలు తగ్గడంతో ఎండలు మండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సాధారణంకంటే ఏకంగా 5 డిగ్రీల సెంటీగ్రేడ్ అదనంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి ప్రధాన కారణం కాలుష్యం పెరగడం, పచ్చదనం లేకపోవడం, పట్టణీకరణ పెరగడంవల్లేనన్నారు. గత నాలుగేళ్లలో హైదరాబాద్‌లో ఇంత అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారన్నారు.