వడలెత్తిస్తోంది | Sunstroke deaths | Sakshi
Sakshi News home page

వడలెత్తిస్తోంది

Published Wed, May 27 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

వడలెత్తిస్తోంది

వడలెత్తిస్తోంది

 జిల్లా వ్యాప్తంగా 23మంది మృతి
 
 సూర్యుని ప్రతాపానికి జనం తట్టుకోలేకపోతున్నారు.. భగభగ మండే ఎండలకు తాళలేక పండుటాకులు తనువు చాలిస్తున్నారు. వారం రోజులుగా వడదెబ్బతో జిల్లాలో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు విడిచారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 23మంది మృతిచెందారు.
 
 కథలాపూర్: మండలంలోని బొమ్మెన గ్రామానికి చెందిన తునికి ఎర్రన్న(65) వడదెబ్బతో మంగళవారం మృతిచెందాడు. ఎర్రన్న సోమవారం మామిడికాయలు తెంపేందుకు వెళ్లి రాత్రికి ఇంటికి చేరుకుని స్పృహ తప్పి పడిపోయాడు. అర్ధరాత్రి తర్వాత మృతిచెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.కాగా, మృతుడి భార్య రెండేళ్ల క్రితం మృతిచెందింది. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
 గోపాల్‌రావుపేట(రామడుగు): మండలంలోని గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన చల్లా స్వప్న (22) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. స్వప్న మామిడితోటలో మామిడి కాయలను ఎరడానికి వెళ్లి వారం క్రితం తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.

 బోయినపల్లి: మండలంలోని మర్లపేట గ్రామానికి చెందిన భీంరెడ్డి లక్ష్మి (70) మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందింది. బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చిన ఆమె స్పృహతప్పి పడిపోయి మృతి చెందింది.
 ఇల్లంతకుంట : మండలంలోని గాలిపల్లిలో గుండేటి మల్లయ్య(75) వడదెబ్బకు గురై మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడికి భార్య భూదవ్వ, ముగ్గురు కూతుర్లున్నారు.

 సిరిసిల్ల: పట్టణంలో వడదెబ్బతో మంగళవారం ఇద్దరు మృతి చెందారు. స్థానిక ఏకలవ్యనగర్‌కు చెందిన సుంచు సాయిలు(75) సోమవారం ఎండకు బయటకు వెళ్లి రాగా మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. మృతుడికి ఐదుగురు కొడుకులు, భార్య కమలమ్మ ఉన్నారు. భావనారుషినగర్‌కు చెందిన దండు లచ్చవ్వ(55)కూడా వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
 రుద్రంగి(చందుర్తి) : చందుర్తి మండలం రుద్రంగి గ్రామానికి చెందిన్న అన్నవేని లింగం(50) అనే హమాలీ కార్మికుడు మంగళవారం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు.  ఉదయం 11గంటల ప్రాంతంలో ఎండవేడిమి తాళలేక ఒక్కసారిగా కింద పడి పోయాడు. వెంటనే అతడిని కోరుట్ల ప్రైవేట్ అస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య మల్లవ్వ, కుమారుడు మహేశ్, కూతురు రేణుకలు ఉన్నారు.

 జగిత్యాల జోన్ : జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన సుందరగరి శ్రీనివాస్(45) వడదెబ్బతో మంగళవారం మృతి చెందాడు. శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. రెండు రోజులుగా ఎండలో స్థలాలు పరిశీలిస్తుండటంతో మంగళవారం అపసార్మక స్థితిలోకి చేరి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

 కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం గుంటూరుపల్లిలో వడదెబ్బతో తోళ్లవ్యాపారి ఎండీ బాషుమియా(65) అలియాస్ దొరబాషు మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఉదయం వ్యాపార నిమిత్తం సైకిల్‌పై సమీప గ్రామాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన నీళ్లు తాగిన బాషుమియా వెంటనే కిందపడి మృతి చెందాడు.

 జూలపల్లి : మండలంలోని కాచాపూర్ గ్రామంలో జూపాక రాజమ్మ (62) అనే వృద్ధురాలు సోమవారం రాత్రి వడదెబ్బకు గురై మృతి చెందింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. ఆరు రోజుల క్రితం కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామానికి కూతురు వద్దకు వెళ్లిన రాజమ్మ మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. ఈక్రమంలోనే ఎండవేడిమి తాళలేక వాంతులు, విరేచనాలయ్యాయి. పెద్దపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

 ముస్తాబాద్ : ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన ఆరేటి రాజయ్య(75) వడదెబ్బతో మృతి చెందాడు. నాలుగురోజులుగా ఎండవేడిమి తాళలేక రాజయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మృతుడికి భార్య శంకరవ్వ, కుమారులు పర్శరాములు, ప్రభుదాస్ ఉన్నారు.

  వల్భాపూర్(వీణవంక) : మండలంలోని వల్భాపూర్ గ్రామానికి చెందిన ఎల్కా సునందదేవి(68)అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. ఎండవేడిమికి తట్టుకోలేక ఒక్కసారిగా ఇంట్లో అస్వస్థకు గురై కుప్పకూలింది. కుటుంబసభ్యులు గమనించి స్థానిక వైద్యులతో చికిత్స అందిస్తుండగానే మృతి చెందింది.

 సారంగాపూర్: మండలంలోని రేచపల్లి గ్రామంలో వడదెబ్బతో రాగుల శంకరమ్మ (50) మృతిచెందింది. శంకరమ్మ వ్యవసాయ పనుల మీద ఉదయం బయటకు వెళ్లి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి తిరిగి చేరుకుంది. వెంటనే స్పృహ కోల్పోయింది. ప్రాథమిక చికిత్స చేసే లోపు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి భర్త లక్ష్మీరాజం, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

 సూరారం(ఎల్కతుర్తి): మండలంలోని సూరారం గ్రామానికి చెందిన వేముల మల్లయ్య (70) ఎండవేడిమి తాళలేక అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స అందిస్తున్న తరుణంలో పరిస్థితి విషమించి మృతిచెందాడు.

 చొప్పదండి: మండల కేంద్రంలోని తొగిరిమామిడి కుంటలో వడగాలులకు తాళలేక ముస్కు బుచ్చమ్మ (85) మృతి చెందింది.
 మానకొండూర్: మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ పారిశుద్ద సిబ్బంది ఆరెపల్లి బాలయ్య (67)వడదెబ్బతో సోమవారం రాత్రి మృతి చెందాడు. రెండు రోజులగా బాలయ్య ఎండవేడిమి తాళలేక  తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

 కొత్తపల్లి (గంభీరావుపేట) : మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన అబ్బతిని అంబవ్వ(65) వడదెబ్బతో మృతి చెందింది. అంబవ్వ వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లి వచ్చి ఇంట్లో కుప్పకూలిపోయింది. ఎండ వేడిమికి తాళలేక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

 సైదాపూర్‌రూరల్ : మండలంలోని గోడిశాల గ్రామానికి చెందిన వల్లపు ఎర్ర కొమురయ్య (67), జాగిరిపల్లి గ్రామానికిచెందిన ఎండీ లాల్‌మహ్మద్ (70) వడదెబ్బతో మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు కొమురయ్యకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె కలరు.
 శుభలేఖలు పంచేందుకు వెళ్లి ఒకరు..
 జమ్మికుంట రూరల్ : ఈ నెల 31న కూతురు వివాహం జరగాల్సి ఉండగా శుభలేఖలు పంచేందుకు వెళ్లి తీవ్ర ఆస్వస్థతకు గురైన పట్టణానికి చెందిన తూము శ్రీనివాస్(48) వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే పట్టణానికి చెందిన వరంగంటి మధునమ్మ(62), మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పల్లపు సమ్మయ్య(37), తనుగుల గ్రామానికి చెందిన ఆషాడపు చంద్రయ్య(70) వడదెబ్బతో మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement