పేలుళ్లు 2 గంటలే! | Supreme Court Restrict Timings On This Diwali | Sakshi
Sakshi News home page

పేలుళ్లు 2 గంటలే!

Published Tue, Nov 6 2018 11:18 AM | Last Updated on Tue, Nov 6 2018 11:19 AM

Supreme Court Restrict Timings On This Diwali - Sakshi

కోల్‌సిటీ(రామగుండం): చిచ్చుబుడ్డి.. లక్ష్మీబాంబులు.. రాకెట్లు.. భూచక్రాలు.. పెద్దశబ్ధంతో పేలే బాణాసంచా కాల్చాలని ఊహించుకుటున్నారా? ఆగండి ఆగండి.. మీ ఊహలు తలకిందులయ్యేలా సుప్రీంకోర్టు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో దీపావళి పండుగకు ఈసారి టపాసుల మోత తగ్గనుంది. పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. దీపావళి రోజున కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చేందుకు సుప్రీం అనుమతిచ్చింది.

 పర్యావరణ హితమైన టపాసులు మాత్రమే కాల్చాలని సూచించింది. ఈ నిబంధనలను ఎవరూ అతిక్రమించినా చట్టపరమైన కేసులు నమోదు చేయాలని పోలీసుశాఖను కోరింది. దీంతో ఈ దీపావళి రోజున టపాసుల మోతతోపాటు విక్రయాలూ తగ్గనున్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు ప్రభావంతో గత ఏడాది టపాసుల ధరలు పెరుగగా...ఈఏడాది శివకాశి ప్రాంతంలో భారీ వర్షాల ప్రభావం మరింత చూపింది. గతేడాదితో పోలిస్తే 10 నుంచి 20 శాతానికిపైగా ధరలు ధరలు పెరిగాయి.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు...
దీపావళి పండుగనాడు కేవలం రెండు గంటలపాటు మాత్రమే బాణాసంచా కాల్చేందుకు సుప్రీం ఆంక్షలు విధించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల  వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా... కోర్టు ధిక్కారంగా పరిగణించి శిక్ష, జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. స్థానికంగా ఉండే పోలీసు అధికారులు నిబంధనలను అమలు చేయడంలో ముఖ్యభూమిక పోషించాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు రామగుండం పోలీసు శాఖకు మాత్రం సుప్రీం జారీ చేసిన ఉత్తర్వుల కాపీ అందలేని అధికారులు వెల్లడిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణకే కఠిన నిబంధనలు...
కలుషితమౌతున్న పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సుప్రీం కోర్టు బాణాసంచా కాల్చడంపై కఠిన నిబంధనలు విధించింది. దీపావళి రోజున సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున టపాసులు కాల్చడం ద్వారా పర్యావరణంకు ముప్పు వాటిళ్లుతుంది. దీనికి తోడు శబ్ధకాలుష్యం కూడా వ్యాపిస్తోంది. కాల్చే సందర్భాలలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిన్నంటినీ దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది.

42 దుకాణాలకు దరఖాస్తులు...
జిల్లా పరిధిలో దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులను విక్రయించేందుకు జిల్లా వ్యాప్తంగా 42 మంది వ్యాపారులు తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లోని పెద్దపల్లి డీసీపీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటితోపాటు పెద్దపల్లిలో రెండు, గోదావరిఖనిలో రెండు పర్మినెంట్‌ హోల్‌సెల్‌ దుకాణాలు ఉన్నాయి.

అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్‌ శాఖల నుంచి టపాసులను విక్రయించేందుకు అనుమతులు పొందాల్సి ఉంటుంది. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా టపాసులు విక్రయించరాదు. ప్రజలకు ఇబ్బదులు తల్తెకుండా, ప్రమాదాలు చోటు చేసుకోకుండా, ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా ఉండే రీతిలో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

తగ్గనున్న టపాసుల మోత...
సుప్రీం కోర్టు జారీ చేసిన నిబంధనలతో టపాసుల మోత తగ్గనుంది. జిల్లా వ్యాప్తంగా దీపావళికి రూ.కోట్లలో బాణాసంచ విక్రయాలు జరుగుతుంటాయి. సుప్రీం ఆంక్షలతో బాణాసంచా విక్రయాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని వ్యాపారులు ఆందోళనలకు గురవుతున్నారు. టపాసుల కొనుగోలుపై సుప్రీం కోర్టు ఆంక్షల ప్రభావం పడనుంది. దీంతో ఆశించినస్థాయిలో బాణాసంచా విక్రయాలు జరుగకపోవచ్చని, చాలా మంది వ్యాపారస్తులు దుకాణాల ఏర్పాటుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement