ఇంజనీరింగ్ కళాశాలలకు తనిఖీ గండం
⇒ జిల్లాకు రానున్న ప్రొఫెసర్ల బృందం
⇒ సుప్రీంకోర్టు ఆదేశాలతో పర్యటన
⇒ ప్రభుత్వానికి ఇవ్వనున్న నివేదిక
⇒ కళాశాల యాజమాన్యాల గుండెల్లో గుబులు
ఖమ్మం : ఇంజనీరింగ్ కళాశాలలకు తనిఖీల గండం పొంచి ఉంది. ప్రభుత్వ నిబంధనలను యాజమాన్యాలు పాటిస్తున్నాయా... లేదా అనే అంశాలను పరిశీలించేందుకు జిల్లాకు పరిశీలన బృందాలు రానున్నాయి. ప్రభుత్వానికి ఇవి సమర్పించే నివేదికల ఆధారంగానే విద్యార్థుల ఫీజు రీయింబర్‌సమెంట్, ఎఫిలియేషన్ తదితర అంశాలు వర్తిస్తాయి. తనిఖీ బృందాలు ఎప్పుడు వస్తాయో.. ఏం పరిశీలిస్తాయో.. ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు అందిస్తాయో అని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కొన్ని భయంతో వణికి పోతున్నాయి.
ప్రొఫెసర్లతో కమిటీ
సుప్రీంకోర్డు ఆదేశాల ప్రకారం ఇంజనీరింగ్ కళాశాలను తనిఖీ చేసేందుకు రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్లతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్ ఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం, బిట్స్‌పిలానీ, వరంగల్ ఎన్‌ఐటీ, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాల యం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రొఫెసర్లతో బృందాన్ని నియమించింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనల మేర కు వసతులు, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, ఉద్యోగుల నియామకం, వారి వేతనాలు, కళాశాల గ్రౌండ్, భవనాలు, విద్యార్థుల సంఖ్య, టాయిలెట్స్ తదితర సౌకర్యాలతోపాటు కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకూ విద్యార్థుల ఉత్తీర్ణత అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది.
త్వరలో జిల్లాకు...
ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసతులు, ఇతర సౌకర్యాలు లేవనే నెపంతో ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 174 కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. ఈ జాబితాలో జిల్లాలోని 14 కళాశాలలు ఉన్నాయి. తమ కళాశాలలకు అన్ని వసతులు, అన్ని అర్హతలు ఉన్నాయని, కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. హైకోర్టు, ఆతర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లడంతో రెండో విడత కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కళాశాలల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో బుధవారం నుంచి రాష్ట్రంలోని తనిఖీలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 31 వరకు రాష్ర్టంలోని అన్ని కళాశాలలు నివేదిక ఇవ్వా ల్సి ఉంది. ఇందుకోసం రెండు రోజు లుగా రాష్ట్ర రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలో పర్యటించిన బృందం కొద్దిరోజుల్లో జిల్లాకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇందు కోసం కళాశాలల యాజమాన్యాలు తనిఖీ అధికారులకు చూపించేందుకు అన్ని రకాల రికార్డులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నాయి.
అదేవిధంగా రెండో విడతగా తనిఖీల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌కు అనుమతి లభిం చిన 9 కళాశాల్లో కూడా ఈ తనిఖీలు ఉంటాయని రాష్ట్ర సాంకేతిక విద్యామండలి అధికారులు ప్రకటించడంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు అలర్‌ట అయ్యాయి. అయితే తనిఖీల వివరాలు గోప్యంగా ఉంచడం, కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిన కళాశాలలను ఎంపిక చేస్తామని ప్రకటించడంతో ఎప్పుడు ఏ కళాశాలకు తనిఖీ బృందం వస్తుందో తెలియక అన్ని కళాశాలల యాజమాన్యాలూ అప్రమత్తంగా ఉంటున్నాయి.