inspection teams
-
ఎవరిదో దత్తత అదృష్టం
సాక్షి, జనగామ: ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో సమస్త గ్రామాలు..సకల జనులు ఒక ఉద్యమంలాగా స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. తమ ఇంటి నుంచే కాకుండా గ్రామస్తులకు ఉపయోగపడే పనుల్లో పాలు పంచుకున్నారు. ప్రజాప్రతినిధులు.. ప్రత్యేక అధికారులు.. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామంలో ఉండే ప్రతిఒక్కరూ తమకు తాముగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి యజ్ఞంలో పా ల్గొని స్ఫూర్తి నింపారు. ఏ పల్లెకు ఆ పల్లె పనులు చేపట్టి భేష్ అనిపించుకున్నారు. కానీ జిల్లాలో దత్తత అదృష్టం ఏ గ్రామం తలుపు తట్టనుందో. ప్రభుత్వ దత్తత అవకాశం ఏ గ్రామానికి దక్కుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ప్రభుత్వం గ్రామాల్లో మార్పు తీసుకురావడం కోసం 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ పనులను చేపడుతోంది. 30 రోజుల ప్రత్యేక పనులను సక్రమంగా నిర్వహించే గ్రామాలను ప్రభుత్వం దత్తత తీసుకుంటుంది. నిధులను ఇచ్చి అభివృద్ధి చేస్తుంది’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సెప్టెంబర్ నాలుగో తేదీన జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాప్రతినిధులు, అధికారుల అవగాహన సదస్సులో స్పష్టంచేశారు. పనులు ముగింపు దశకు చేరుకోవడంతో ప్రభుత్వ దత్తతకు ఎంపికయ్యే ఏ గ్రామ పంచాయతీ అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనిఖీ అధికారుల టీం ఇదే.. జిల్లాలో కొనసాగుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ పనులను పరిశీలించడానికి 12 మంది అధికారులతో కూడిన తనిఖీ టీంను నియమించారు. ఒక్కొక్క మండలానికి జిల్లా స్థాయి అధికారిని ఒక్కరి చొప్పున నియమించారు. జనగామ మండలానికి విశ్వ ప్రసాద్ (కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్), బచ్చన్నపేట మండలానికి టీవీఆర్ మూర్తి (కలెక్టరేట్ సూపరింటెండెంట్), లింగాలఘనపురం మండలానికి మన్సూరీ(కలెక్టరేట్ సూపరింటెండెంట్), దేవరుప్పుల మండలానికి వీరస్వామి (కలెక్టరేట్ సూపరింటెండెంట్), తరిగొప్పుల మండలానికి రవికిరణ్ (డిప్యూటీ తహసీల్దార్), రఘునాథపల్లి మండలానికి అబ్దుల్ (డీఏఓ ఆర్డీఓ కార్యాలయం), స్టేషన్ ఘన్పూర్ మండలానికి సలీమ్ (తహసీల్దార్), చిల్పూర్ మండలానికి శంకర్ (డిప్యూటీ తహసీల్దార్), పాలకుర్తి మండలానికి వంశీ (కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్), జఫర్‌గఢ్ మండలానికి షకీర్ (ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్), కొడకండ్ల మండలానికి రాజు (ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్)లను నియమించారు. ఈ టీం అధికారులు ఇప్పటి వరకు గ్రామాల్లో జరిగిన 30 రోజుల పనుల వివరాలను సేకరిస్తారు. నేరుగా గ్రామానికి వెళ్లి గ్రామస్తులతోనే మాట్లాడి పనుల అమలుపై ఆరా తీస్తారు. జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని సందర్శించి పనుల, ఆయా పంచాయతీల్లో తయారు చేసిన నివేదికలను పరిశీలిస్తారు. మరో 4 రోజులే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ పనులు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నాయి. సెప్టెంబర్ ఆరో తేదీన ప్రారంభమైన పనులు ఈ నెల ఆరో తేదీతో ముగియనున్నాయి. జిల్లాలోని 12 మండలాల్లోని 281 గ్రామ పంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, శ్రమదానాలు, కరెంటు స్తంభాల ఏర్పాటు, దోమల నివారణ చర్యలు, శిధిలావస్థకు చేరిన భవనాల కూల్చివేత, నిరుపయోగంగా ఉన్న బావులు, బోరు బావుల పూడ్చివేత వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటడంతో పాటుగా శ్రమదానాలు నిర్వహిస్తున్నారు. స్పెషలాఫీసర్లు గ్రామాల్లో పల్లె నిద్ర సైతం చేశారు. ప్రత్యేక పనులు ముగింపు దశకు చేరడంతో మిగిలిపోయిన పనులు పూర్తిస్థాయిలో చేపట్టడానికి అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. -
ఐటీఐల్లో తనిఖీ బృందాలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో ప్రమాణాల పరిస్థితిని పరిశీలించేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉపక్రమించింది. ప్రైవేటు ఐటీఐల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రమాణాల పరిశీలనకు ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. పరిశీలన అనంతరం తనిఖీ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా వాటి గుర్తింపును కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 291 ఐటీఐలున్నా యి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఐటీఐలకు ప్రాధాన్యతనిస్తోంది. ప్రతి ఐటీఐలోనూ పూర్తిస్థాయి ప్రమాణాలుండేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తనిఖీలకు ఉపక్రమించింది. త్రిసభ్య కమిటీలు ఏర్పాటు ఐటీఐల తనిఖీలకు ఆ శాఖ జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు, జిల్లా ఉపా ధి కల్పనాధికారితో పాటు ప్రభుత్వ ఐటీఐ నుంచి సీనియర్ ఫ్యాకల్టీతో ఏర్పా టు చేసిన త్రిసభ్య కమిటీ జిల్లా పరిధిలో ఉన్న ప్రైవేటు ఐటీఐల్లో మౌళిక వసతులు, మిషనరీ, బోధనా సిబ్బంది తదితర అంశాలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలిస్తారు. ప్రత్యేక ఫార్మాట్‌తో కూడిన ప్రొఫార్మా ఆ శాఖ తయారు చేసి బృందాలకు అందించింది. తనిఖీ అనంతరం వీరు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కమిటీ నివేదికలు... పారిశ్రామిక శిక్షణ సంస్థల అనుమతిలో కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని డీజీఈటీ(డైరెక్టర్ జనరల్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్)కి కీలక పాత్ర ఉంటుంది. అనుమతులు, రెన్యువల్ తదితరాలన్నీ వీటి పరిధిలోనే ఉంటాయి. ఐటీఐల తనిఖీలు చేపట్టే త్రిసభ్య కమిటీలు సమర్పించే నివేదికలను కేంద్ర కార్మిక శాఖకు సమర్పించనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ చెబుతోంది. దీంతో కమిటీ తనిఖీలపై ప్రైవేటు ఐటీఐలు ఆందోళన చెందుతున్నాయి. -
తనిఖీ బృందాలొస్తున్నాయ్!
సాక్షి, మంచిర్యాల : ‘అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా సుప్రీంకోర్టు జడ్జీలతో కూడిన కమిటీ ఈ నెల 29 నుంచి 31 వరకు జిల్లాలో పర్యటించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు.. తాగునీటి వసతులను పరిశీలించనుంది. పరిశుభ్రంగా ఉంచండి.. టాయిలెట్లు వెంటనే వినియోగంలో తీసుకురండి. నీటి వసతి లేకుంటే నీటి సదుపాయం ఏర్పాటు చేయండి. మరుగుదొడ్లలో ఓ బకెట్, మగ్గు ఉంచండి. ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌ను బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయించండి. తాగునీటి వసతి లేని చోట కనీసం ఓ కుండలో నీరు అందుబాటులో ఉంచండి. దీన్ని అత్యంత ప్రాధాన్యంశంగా గుర్తించండి. అలసత్వం వద్దు.’ - ఇదీ డీఈవో నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందిన సెల్ మెసేజ్ సారాంశం. సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పనపై సుప్రీం కోర్టు జడ్జీలు ఈ నెల 29 నుంచి 31 వరకు జిల్లాలో పర్యటించనున్నారు. వీరి పర్యటన ఖరారు కావడంతో జిల్లా విద్యాశాఖ హల్‘సెల్’ చేస్తోంది. పాఠశాలల్లో మరుగుదొడ్లు.. తాగునీటి సదుపాయాలు కల్పించాలని సుప్రీం కోర్టు ఎన్నోమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా పాలకులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు. తాజాగా.. క్షేత్రస్థాయిలో వసతులపై ఆరా తీసేందుకు ఏకంగా సుప్రీం కోర్టే రంగంలోకి దిగింది. ముగ్గురు జడ్జీలతో కూడిన కమిటీ జిల్లాల్లో పర్యటించి.. గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఏ మేరకు అమలయ్యాయో తెలుసుకోనుంది. సుప్రీం కోర్టు జడ్జీలతోపాటు జిల్లా, స్థానిక జడ్జీలు, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులూ ఈ తనిఖీల్లో పాల్గొననున్నారు. అయితే.. బృంద సభ్యులు ఏ ప్రాంతంలోని ఏ పాఠశాలలను తనిఖీ చేస్తారో తెలియకపోవడంతో అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వసతుల కల్పనలో సుప్రీం జడ్జీలు సంతృప్తి చెందుతారా..? అసంతృప్తి వ్యక్తం చేస్తే.. ఎలాంటి చర్యలు ఉంటాయోననే ఆందోళన ఉద్యోగవర్గాలకు పట్టుకుంది. మరుగుదొడ్లు.. తాగునీటి వసతి లేనిచోట వెంటనే సదుపాయాలు సమకూర్చుకోవాలని ఇప్పటికే మండల విద్యాధికారులూ తమ పరిధిలోని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందిస్తూ.. తమ పాఠశాలలో టాయిలెట్ల కొరత ఉందని.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని.. గతంలో ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు వెంటనే వసతులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్నా.. తనిఖీ బృందాలు గుర్తించలేవా..? అని ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే...! ‘పాఠశాలల్లో కనీస వసతుల్లాంటి టాయిలెట్లు కూడా లేకపోతే తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడం మానేస్తారు. ప్రతి స్కూళ్లో కనీస వసతులు తప్పనిసరి. 31, డిసెంబర్ 2011లోగా ప్రతి సర్కారు బడిలో టాయిలెట్లు నిర్మించండి.. ఈ ఏడాది నవంబర్ ఆఖరులోగా బాలికల కోసం తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయండి.’ ఇదీ అక్టోబర్ 18, 2010లో సుప్రీం కోర్టు అప్పటి న్యాయమూర్తి జైన్ జారీ చేసిన ఆదేశాలు. ఈ ఆదేశాలు జారీ అయి నాలుగేళ్లు గడుస్తున్నా జిల్లాలో శాశ్వత మరుగుదొడ్ల మాటేమో గానీ.. తాత్కాలిక టాయిలెట్లు కూడా లేవు. సర్కారు బళ్లలో వసతులు కరువవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం.. కేంద్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా.. ఆశించిన ప్రయోజనం కానరావడం లేదు. జిల్లాలో ఉన్న 3 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సుమారు 3 లక్షల మంది చదువుతున్నారు. 7,769 టాయిలెట్లు అవసరముండగా.. 3,534 మాత్రమే ఉన్నాయి. సగానికి పైగా స్కూళ్లలో విద్యార్థులు బహిర్భూమికి ఇప్పటికీ బయటకు వెళ్తుంటే.. ఇల్లు దగ్గరున్న వాళ్లు తమ ఇళ్లకు పోతున్నారు. కొన్ని చోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలే జరగకపోగా.. చాలా పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లు నీరులేక నిరుపయోగంగా ఉన్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు జంకుతున్నారు. -
ఇంజనీరింగ్ కళాశాలలకు తనిఖీ గండం
⇒ జిల్లాకు రానున్న ప్రొఫెసర్ల బృందం ⇒ సుప్రీంకోర్టు ఆదేశాలతో పర్యటన ⇒ ప్రభుత్వానికి ఇవ్వనున్న నివేదిక ⇒ కళాశాల యాజమాన్యాల గుండెల్లో గుబులు ఖమ్మం : ఇంజనీరింగ్ కళాశాలలకు తనిఖీల గండం పొంచి ఉంది. ప్రభుత్వ నిబంధనలను యాజమాన్యాలు పాటిస్తున్నాయా... లేదా అనే అంశాలను పరిశీలించేందుకు జిల్లాకు పరిశీలన బృందాలు రానున్నాయి. ప్రభుత్వానికి ఇవి సమర్పించే నివేదికల ఆధారంగానే విద్యార్థుల ఫీజు రీయింబర్సమెంట్, ఎఫిలియేషన్ తదితర అంశాలు వర్తిస్తాయి. తనిఖీ బృందాలు ఎప్పుడు వస్తాయో.. ఏం పరిశీలిస్తాయో.. ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు అందిస్తాయో అని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కొన్ని భయంతో వణికి పోతున్నాయి. ప్రొఫెసర్లతో కమిటీ సుప్రీంకోర్డు ఆదేశాల ప్రకారం ఇంజనీరింగ్ కళాశాలను తనిఖీ చేసేందుకు రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్లతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్ ఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం, బిట్స్‌పిలానీ, వరంగల్ ఎన్ఐటీ, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాల యం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రొఫెసర్లతో బృందాన్ని నియమించింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనల మేర కు వసతులు, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, ఉద్యోగుల నియామకం, వారి వేతనాలు, కళాశాల గ్రౌండ్, భవనాలు, విద్యార్థుల సంఖ్య, టాయిలెట్స్ తదితర సౌకర్యాలతోపాటు కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకూ విద్యార్థుల ఉత్తీర్ణత అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. త్వరలో జిల్లాకు... ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసతులు, ఇతర సౌకర్యాలు లేవనే నెపంతో ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 174 కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. ఈ జాబితాలో జిల్లాలోని 14 కళాశాలలు ఉన్నాయి. తమ కళాశాలలకు అన్ని వసతులు, అన్ని అర్హతలు ఉన్నాయని, కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. హైకోర్టు, ఆతర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లడంతో రెండో విడత కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కళాశాలల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో బుధవారం నుంచి రాష్ట్రంలోని తనిఖీలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 31 వరకు రాష్ర్టంలోని అన్ని కళాశాలలు నివేదిక ఇవ్వా ల్సి ఉంది. ఇందుకోసం రెండు రోజు లుగా రాష్ట్ర రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలో పర్యటించిన బృందం కొద్దిరోజుల్లో జిల్లాకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇందు కోసం కళాశాలల యాజమాన్యాలు తనిఖీ అధికారులకు చూపించేందుకు అన్ని రకాల రికార్డులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నాయి. అదేవిధంగా రెండో విడతగా తనిఖీల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌కు అనుమతి లభిం చిన 9 కళాశాల్లో కూడా ఈ తనిఖీలు ఉంటాయని రాష్ట్ర సాంకేతిక విద్యామండలి అధికారులు ప్రకటించడంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు అలర్ట అయ్యాయి. అయితే తనిఖీల వివరాలు గోప్యంగా ఉంచడం, కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిన కళాశాలలను ఎంపిక చేస్తామని ప్రకటించడంతో ఎప్పుడు ఏ కళాశాలకు తనిఖీ బృందం వస్తుందో తెలియక అన్ని కళాశాలల యాజమాన్యాలూ అప్రమత్తంగా ఉంటున్నాయి. -
‘ఉపాధి’ పీవోలుగా ఎంపీడీవోలు
18 నెలల తరువాత మళ్లీ అధికారం ఒకటి నుంచి పర్యవేక్షణ బాధ్యత యలమంచిలి : ఉపాధిహామీ పథకం బాధ్యతలను ప్రభుత్వం 18 నెలల తర్వాత మళ్లీ ఎంపీడీవోలకు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. 2007 జూన్ 19న ఎంపీడీవోలను ఉపాధి హామీ పథకం అధికారి (పీవో)లుగా నియమిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీవో 276 జారీ అయింది. క్షేత్రస్థాయి పనుల్లో రూ.కోట్లు దుర్వినియోగం అయ్యాయంటూ సామాజిక తనిఖీ బృందాలు తేల్చాయి. ఇందులో పీవోల హోదాలో ఎంపీడీవో పాత్ర కూడా కీలకమేనన్న ఆరోపణలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. వారిని బాధ్యులను చేస్తూ రికవరీ పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీవోలు ఆందోళన చేపట్టారు. ఉపాధి పీవోలుగా తాము పనిచేయలేమంటూ తెగేసి చెప్పారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ సిగ్నేచర్ కీ (డీఎస్కే) వెనక్కి ఇచ్చారు. దీంతో అదనపు పీవోలకు ఇన్చార్జ్ పీవోలుగా ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగిస్తూ 2013 మార్చి ఒకటిన గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ (సీఆర్డీ) ఉత్తర్వు 472ను జారీ చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఏపీవోలే పీవోల బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నారు. తాజాగా మళ్లీ ఎంపీడీవోలకే పీవోల బాధ్యతలనిస్తూ జీవో 139 జారీ అయింది. అక్టోబర్ ఒకటి నుంచి ఎంపీడీవోలు ఈ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకానికి అదే పథకంలో పనిచేసే ఏపీవోలే అన్నీ తామై పనిచేశారు. కొత్తప్రభుత్వం ఉపాధి పనుల మరింత వేగవంతానికి ఎంపీడీవోలనే పీవోలుగా ఉంచాలని భావించింది. నెల రోజుల క్రితం యలమంచిలి వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు సైతం ఎంపీడీవోలకు ఉపాధి పనుల బాధ్యత అప్పగించనున్నట్టు వెల్లడించారు. పనులు వేగవంతం... : ఉపాధి పనుల వేగవంతానికి ఎక్కడెక్కడ ఏఏ పనులు చేపట్టాలి, చేపట్టేవి ఉపయోగకరమైనవా, కాదా, జాబ్‌కార్డుల నమోదు, గ్రామ పంచాయతీ పరిధిలో చేసిన పనులకు బిల్లులు ఆలస్యం కాకుండా చూడటం, దరఖాస్తుదారులందరికీ పనులు కల్పించడంతో పాటు డిజిటల్ కీతో కూడిన సాఫ్ట్‌వేర్‌లో వివరాలన్నింటిని నమోదు చేయాల్సి ఉంటుంది. చేసిన పనులకు, తీసిన కొలతలకు సరిపడా తయారు చేసిన ఎంబుక్‌లో సంతకాలు చేస్తేనే ఇక నుంచి కూలీలకు చెల్లింపులు జరుగుతాయి. తాజా ఉత్తర్వు ప్రకారం ఉపాధి హామీ పథకంలో ఎంపీడీవోతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ విస్తరణాధికారి (ఈవోపీఆర్డీ), ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను కూడా భాగస్వాములు కానున్నారు.