సాక్షి, మంచిర్యాల : ‘అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా సుప్రీంకోర్టు జడ్జీలతో కూడిన కమిటీ ఈ నెల 29 నుంచి 31 వరకు జిల్లాలో పర్యటించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు.. తాగునీటి వసతులను పరిశీలించనుంది. పరిశుభ్రంగా ఉంచండి.. టాయిలెట్లు వెంటనే వినియోగంలో తీసుకురండి.
నీటి వసతి లేకుంటే నీటి సదుపాయం ఏర్పాటు చేయండి. మరుగుదొడ్లలో ఓ బకెట్, మగ్గు ఉంచండి. ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌ను బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయించండి. తాగునీటి వసతి లేని చోట కనీసం ఓ కుండలో నీరు అందుబాటులో ఉంచండి. దీన్ని అత్యంత ప్రాధాన్యంశంగా గుర్తించండి. అలసత్వం వద్దు.’ - ఇదీ డీఈవో నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందిన సెల్ మెసేజ్ సారాంశం.
సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పనపై సుప్రీం కోర్టు జడ్జీలు ఈ నెల 29 నుంచి 31 వరకు జిల్లాలో పర్యటించనున్నారు. వీరి పర్యటన ఖరారు కావడంతో జిల్లా విద్యాశాఖ హల్‘సెల్’ చేస్తోంది. పాఠశాలల్లో మరుగుదొడ్లు.. తాగునీటి సదుపాయాలు కల్పించాలని సుప్రీం కోర్టు ఎన్నోమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా పాలకులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు. తాజాగా.. క్షేత్రస్థాయిలో వసతులపై ఆరా తీసేందుకు ఏకంగా సుప్రీం కోర్టే రంగంలోకి దిగింది. ముగ్గురు జడ్జీలతో కూడిన కమిటీ జిల్లాల్లో పర్యటించి.. గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఏ మేరకు అమలయ్యాయో తెలుసుకోనుంది.
సుప్రీం కోర్టు జడ్జీలతోపాటు జిల్లా, స్థానిక జడ్జీలు, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులూ ఈ తనిఖీల్లో పాల్గొననున్నారు. అయితే.. బృంద సభ్యులు ఏ ప్రాంతంలోని ఏ పాఠశాలలను తనిఖీ చేస్తారో తెలియకపోవడంతో అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వసతుల కల్పనలో సుప్రీం జడ్జీలు సంతృప్తి చెందుతారా..? అసంతృప్తి వ్యక్తం చేస్తే.. ఎలాంటి చర్యలు ఉంటాయోననే ఆందోళన ఉద్యోగవర్గాలకు పట్టుకుంది. మరుగుదొడ్లు.. తాగునీటి వసతి లేనిచోట వెంటనే సదుపాయాలు సమకూర్చుకోవాలని ఇప్పటికే మండల విద్యాధికారులూ తమ పరిధిలోని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ విషయమై మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందిస్తూ.. తమ పాఠశాలలో టాయిలెట్ల కొరత ఉందని.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని.. గతంలో ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు వెంటనే వసతులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్నా.. తనిఖీ బృందాలు గుర్తించలేవా..? అని ప్రశ్నిస్తున్నారు.
నాలుగేళ్ల క్రితమే...!
‘పాఠశాలల్లో కనీస వసతుల్లాంటి టాయిలెట్లు కూడా లేకపోతే తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడం మానేస్తారు. ప్రతి స్కూళ్లో కనీస వసతులు తప్పనిసరి. 31, డిసెంబర్ 2011లోగా ప్రతి సర్కారు బడిలో టాయిలెట్లు నిర్మించండి.. ఈ ఏడాది నవంబర్ ఆఖరులోగా బాలికల కోసం తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయండి.’ ఇదీ అక్టోబర్ 18, 2010లో సుప్రీం కోర్టు అప్పటి న్యాయమూర్తి జైన్ జారీ చేసిన ఆదేశాలు. ఈ ఆదేశాలు జారీ అయి నాలుగేళ్లు గడుస్తున్నా జిల్లాలో శాశ్వత మరుగుదొడ్ల మాటేమో గానీ.. తాత్కాలిక టాయిలెట్లు కూడా లేవు. సర్కారు బళ్లలో వసతులు కరువవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం.. కేంద్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా.. ఆశించిన ప్రయోజనం కానరావడం లేదు. జిల్లాలో ఉన్న 3 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సుమారు 3 లక్షల మంది చదువుతున్నారు. 7,769 టాయిలెట్లు అవసరముండగా.. 3,534 మాత్రమే ఉన్నాయి. సగానికి పైగా స్కూళ్లలో విద్యార్థులు బహిర్భూమికి ఇప్పటికీ బయటకు వెళ్తుంటే.. ఇల్లు దగ్గరున్న వాళ్లు తమ ఇళ్లకు పోతున్నారు. కొన్ని చోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలే జరగకపోగా.. చాలా పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లు నీరులేక నిరుపయోగంగా ఉన్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు జంకుతున్నారు.
తనిఖీ బృందాలొస్తున్నాయ్!
Published Fri, Dec 19 2014 1:36 AM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM
Advertisement
Advertisement