జిల్లా కేంద్రంలోని ఐఎంఎల్ డిపోలో హమాలీల నియామకం కోసం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై విచారణ మొదలైంది.
కరీంనగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని ఐఎంఎల్ డిపోలో హమాలీల నియామకం కోసం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై విచారణ మొదలైంది. వసూళ్ల వ్యవహారంపై ‘హమాలీ సొమ్ము హాంఫట్’ శీర్షికన ‘సాక్షి'లో శనివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆదివారం హమాలీలను కలిశాయి. హమాలీల నియామకానికి డబ్బులు ఎవరు వసూలు చేశారు? అందులో ఎవరికెంత ముట్టజెప్పారనే అంశంపై వివరాలు సేకరించాయి.
ఈ సందర్భంగా కొందరు హమాలీలు తమకు తెలిసిన అన్ని విషయాలను ఇంటెలిజెన్స్ వర్గాల ముందుంచినట్లు తెలిసింది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం, ఐఎంఎల్ డిపోలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ రాశారు.
ఈ లేఖపై స్పందించిన ఎక్సైజ్ కమిషనర్ శనివారం సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర ఎక్సైజ్ విజిలెన్స్ అధికారులు జిల్లాకు చేరుకున్నారని సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ జరిగి కమిషనర్‌కు వీరు సమగ్ర నివేదిక అందించనున్నట్లు తెలిసింది.
పనిచేయని సూత్రధారి ఫోన్
హమాలీలుగా 26 మందిని డిపోలో చేర్పించడానికి వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కీలకమైన సూత్రధారి ఫోన్ రెండు రోజుల నుంచి పనిచేయడం లేదని తెలిసింది. దీంతో డబ్బులు ఇచ్చిన పలువురు హమాలీలు అందోళనలో పడిపోయారు. శనివారం ఉదయం నుంచి సదరు సూత్రధారి కోసం ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభ్యం కాకపోవడంతో వారు తలలు పట్టుకుంటున్నారు.
సదరు సూత్రధారి గతంలో పలు చోట్ల ఇలాంటి దందాలు నడిపించాడని తెలిసిన ఎక్సైజ్ అధికారులు అతడు పనిచేసిన చోట జరిగిన దందాలపై దృష్టి సారించారని సమాచారం. ఈ దందాలో డిపోకు చెందిన ఇద్దరు అధికారుల పాత్రపై కూడా విచారణ వేగవంతం చేశారు.
సదరు అధికారులపై కొంతకాలంగా ఆరోపణలొస్తున్నాయని, మద్యం దుకాణదారుల నుంచి మామూళ్ల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేయడం, ఇవ్వని వారిని ఇబ్బందులు పెట్డడంతో సిద్ధహస్తులని పలువురు మద్యం వ్యాపారులు పేర్కొంటున్నారు.
విచారణ కోరిన మాట వాస్తవమే : జేసీ
ఐఎంఎల్ డిపోలో జరుగుతున్న పరిణామాలు, హమాలీల నుంచి డబ్బులు వసూలు తదితర అంశాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ నదీం అహ్మద్‌కు లేఖ రాసిన మాట వాస్తవమేనని జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఎక్సైజ్ కమిషనర్ నుంచి వచ్చే అదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు.
భయాందోళనలో హమాలీలు
హమాలీల నియామకం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారిన విషయం వెలుగులోకి రావడం... దీనిపై విచారణ మొదలు కావడంతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న హమాలీల్లో ఆందోళన మొదలైంది. ఈ వ్యవహారంలో ప్రమేయం లేనప్పటికీ రాజకీయ నాయకులు, కొందరు అధికారులవల్ల తాము ఇబ్బందుల్లో పడాల్సి వస్తోందని హమాలీలు వాపోతున్నారు.
హమాలీలకు న్యాయం చేయండి : సీఐటీయూ
ఈ వ్యవహారంపై అధికారులు జోక్యం చేసుకుని విచారణ జరిపి హమాలీలకు న్యాయం చేయాలని ఏపీబీసీఎల్ ఐఎంఎల్ హమాలీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాగం సురేందర్ శనివారం ఒక ప్రకటనలో అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై పత్రికల్లో వస్తున్న కథనాల నేపథ్యంలో హమాలీ కుటుంబాలు భయందోళనలో ఉన్నాయని అవేదన వ్యక్తం చేశారు.
హమాలీల్లో ఎవరికైనా దెబ్బలు తగిలినా, ప్రమాదాలు జరిగినా వారి స్థానంలో కుటుంబసభ్యులకు పనిచేసే అవకాశం తమ సంఘం తరఫున కల్పిస్తామన్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అధికారుల ఆదేశాల మేరకు కైకిలి కింద ఇతరులను పనిలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
బ్రేకేజీ పేరిట దందా!
కరీంనగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని మద్యం డిపో తరచూ ఆదినుంచి వివాదాలకు కేంద్రంగా మారిందనే విమర్శలున్నాయి. తాజాగా హమాలీల నుంచి కోట్లాది రూపాయలు దండుకుని వారిని చేర్చుకునే ప్రయత్నం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా డిపోపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.
దీంతో కొన్నేళ్లుగా ఇక్కడ జరుగుతున్న దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని సమాచారం. అన్‌లోడింగ్ సమయంలో స్టాక్ బ్రేకేజీ పేరిట మరో దందా సాగిస్తున్నారని తెలిసింది.
జిల్లాలోని వైన్స్‌లు, బార్లకు ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా అవుతుంది. స్టాక్ కోసం డిపోకు వెళ్తే మామూళ్లు ఇవ్వనిదే పని జరగడం లేదనే ఆరోపణలున్నాయి. మామూళ్లకు నిరాకరిస్తే సవాలక్ష కారణాలు చూపుతూ రాత్రి వరకు డిపో వద్దే ఉంచుకోవడం... లేదా మరునాడు రావాలని చెప్తుంటారని పలువురు పేర్కొంటున్నారు.
పగిలిన సీసాలు, ఇన్‌వాయిస్ నంబర్లకు బదులు ఇతర నంబర్లున్న మద్యం పెట్టెలు ఇస్తున్నారని వాపోతున్నారు. లారీలో వచ్చిన మద్యాన్ని దింపేప్పుడు మద్యం సీసాలు పగిలిపోకున్నా బ్రేకేజీ పేరిట ప్రతీ లారీకి 6 నుంచి 8 పెట్టెలు పక్కన పెడుతున్నారని, దీనికి ఒప్పుకుంటేనే లారీలను గోదాంలోకి రానిస్తున్నారని, లేకుంటే వారాల తరబడి బయటే వేచి ఉండేలా చేస్తున్నారని లారీల వారు, మద్యం కంపెనీలవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిస్టిలరీ నుంచి డిపోకు వస్తున్న వాటిలో ఒకటి, రెండు బాటిళ్లు పగిలితే 10 నుంచి 12 పెట్టెల వరకు సీసాలు పగిలినట్లు లెక్కలు రాస్తున్నట్లు సమాచారం. దీనిపై నిఘా లేకపోవడంతో అక్రమాలకు అంతే లేకుండా పోయిందని, ఇలా వందలాది పెట్టెలు ఇతర వైన్స్‌లకు బయట విక్రయిస్తున్నారని తెలిసింది. లారీలోని మద్యం దింపేందుకు ఒక్కో లారీకి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తారని తెలిసింది.
ఎక్కువగా అమ్ముడుపోని మద్యం అమ్మేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులతో మిలాఖత్ అయి రెగ్యులర్ బ్రాండ్లు అందుబాటులో ఉంచడం లేదని ఆయా రకం మద్యం స్టాక్ లేదని చూపుతూ ఒప్పందం చేసుకున్న మద్యాన్ని వైన్స్‌లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు.