సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారులను గుర్తించేందుకు సర్వేను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన ప్రాజెక్టు (మెప్మా)కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. సర్వే చేయాల్సిన తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో మంగళవారం సమీక్ష జరిగిన నేపథ్యంలో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీధి వ్యాపారుల కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన ‘పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి’పథకంలో లబ్ది దారులను ఎంపిక చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మున్సిపల్ జనాభాలో కనీసం రెండు శాతం మంది వీధి వ్యాపారులను గుర్తించాలి. ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 0.58శాతం మందినే గుర్తించారు.
ఇప్పటి వరకు గుర్తింపునకు నోచుకోని వీధి వ్యాపారులతో పాటు పట్టణ పరిసరాల్లోని వారిని కూడా గుర్తించి ఈ నెల 25వ తేదీలోగా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. వీధి వ్యాపారుల సర్వే కోసం ప్రత్యేక యాప్‌ను ఇప్పటికే రూపొందించారు. వారు లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ సర్వేను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌తో పాటు, మెప్మా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు రోజూవారీగా పర్యవేక్షించాలని ఆదేశించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ కార్పోరేషన్లను మినహాయించి రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో 1.46కోట్ల జనాభా ఉంది. వీరిలో 2,92లక్షల మందిని వీధి వ్యాపారులుగా గుర్తించాల్సి ఉండగా, ఇప్పటి వరకు సుమారు 85వేల మందిని మాత్రమే గుర్తించారు. మరో 2.06లక్షల మందిని వీధి వ్యాపారులుగా గుర్తించేందుకు ప్రస్తుత సర్వేను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment