
నిలకడగా సీఐ, హోంగార్డు ఆరోగ్యం
హైదరాబాద్ : కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ మొగులయ్య, హోంగార్డు కిశోర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్ భాస్కర్రావు తెలిపారు. సీఐ శరీరంలో ఉన్న రెండు బుల్లెట్లను ఆపరేషన్ చేసి తొలగిస్తామని ఆయన గురువారమిక్కడ చెప్పారు. సీఐ శరీరంలో బుల్లెట్లు దూసుకు పోవటంతో లివర్, కిడ్నీ ఎంతవరకూ దెబ్బతిన్నాయనే విషయం ఇంకా తెలియదన్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ విషయం తెలుస్తుందన్నారు. ఇక హోంగార్డు కిశోర్ బాడీలో ఉన్న బుల్లెట్లు బయటకు వచ్చేశాయని డాక్టర్ భాస్కర్రావు తెలిపారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు.
కాగా నల్లగొండ జిల్లాలో అర్థరాత్రి దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తనిఖీలు చేస్తున్నపోలీసులపైనే కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డ్ మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ మొగులయ్యతోపాటు మరో హోంగార్డు కిశోర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని మొదట సూర్యాపేటలోని మెట్రో ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.