
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా మంత్రివర్గ విస్తరణ లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వసంత పంచమిని పురస్కరించుకుని ఆదివారం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశావహులు, ఇతర ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం భావించారు. అయితే శనివారం రాత్రి వరకు దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో వసంత పంచమి నాడు సైతం మంత్రివర్గ విస్తరణ ఉండబోదని దాదాపు తేలిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనే చర్చ మళ్లీ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా ఉండే ఆరు సంఖ్య వచ్చే 15న గానీ, 24న గానీ విస్తరణ ఉంటుందని తాజాగా టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి మాత్రం విస్తరణ తేదీపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది స్పష్టత రాకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యేల్లో ఆందోళన పెరుగుతోంది. పదవి వస్తుందా? రాదా? అనే విషయం ఎలా ఉన్నా విస్తరణ త్వరగా జరిగితే స్పష్టత వచ్చి ప్రశాంతంగా ఉంటామని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు లేకున్నా ఎప్పుడు ఉంటుందనే విషయంపై స్పష్టత ఇస్తే బాగుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి.
పెళ్లిళ్లకు వెళ్లాలా..: వసంత పంచమి శుభముహూర్తం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్నాయి. ప్రతి ఎమ్మెల్యేకు తమ నియోజకవర్గంలో సగటున 50కిపైగా వివాహ ఆహ్వానాలు అందాయి. ముఖ్య కార్యకర్తలు, బంధువుల నుంచి వచ్చిన పెళ్లిళ్లకు హాజరు కావాలన్నా ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగితేగానీ పూర్తి కాని పరిస్థితి ఉంది. వసంత పంచమి సందర్భంగా విస్తరణ ఉంటుందనే సమాచారం నేపథ్యంలో సీనియర్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. నియోజకవర్గాలకు వెళ్లాలా? సీఎం కార్యాలయం నుంచి పిలువు వస్తుందా? ఆనే ఆలోచనలతోనే శనివారం అంతా గడిపారు. ‘మంత్రివర్గంలో మీకు చోటు ఖాయమేనా సార్’అంటూ నియోజక వర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు, సన్నిహితుల నుంచి రోజంతా ఫోన్లు రావడంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారు. బయటి వారికి చెప్పే సమాధానం ఎలా ఉన్నా విస్తరణ ఇప్పుడు ఉంటుందా? ఉంటే మంత్రిగా అవకాశం వస్తుందా అనే ఆలోచనలతో సీనియర్ ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో రోజురోజుకీ టెన్షన్ పెరిగిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment