సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్ పదవిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో బలనిరూపణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఉత్కంఠ నెలకొంది. డీసీసీబీ చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డిపై.. వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి వర్గీయులు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం విధితమే. ఈ మేరకు 11 మంది డెరైక్టర్లు సంతకాలు చేసిన నోటీసును జూలై 17న జిల్లా సహకార అధికారి(డీసీవో) సూర్యచంద్రరావుకు అందజేశారు.
ప్రాథమిక విచారణ చేపట్టిన డీసీవో బలనిరూపణ కోసం ఈనెల 7న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డీసీసీబీ డెరైక్టర్లందరికి నోటీసులు అందజేశారు. ఈ సమావేశానికి కేవలం రెండు రోజులే సమయం ఉండటంతో ఇరువర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. దామోదర్‌రెడ్డిని గద్దెదించేందుకు అవసరమైన మెజారిటీ డెరైక్టర్ల మద్దతును కూడగట్టేందుకు చంద్రశేఖర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. అవిశ్వాస తీర్మాణానికి అనుకూలంగా 14 మంది డెరైక్టర్లు మద్దతు ఉందని చంద్ర శేఖర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ జిల్లా అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారితోపాటు, మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డిల మద్దతుతో ఆయన ‘అవిశ్వాసం’పై ముందడుగేసినట్లు సమాచారం. తన పదవిని కాపాడుకునేందుకు చైర్మన్ దామోదర్‌రెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టును ఆశ్రయించే యోచనలో దామోదర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇరువర్గాల నేతలు నెలరోజులుగా డెరైక్టర్లతో పోటాపోటీగా క్యాంపులు నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక సమావేశం రోజు గురువారం డెరైక్టర్లను నేరుగా డీసీసీబీకి తీసుకువచ్చేందుకు చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దామోదర్‌రెడ్డి వర్గం డెరైక్టర్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశాలున్నాయి. చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గితే వెంటనే నూతన చైర్మన్‌ను ఎన్నుకునేందుకు మరోమారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు
అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నిర్వహిస్తున్న డీసీసీబీ ప్రత్యేక సమావేశానికి జిల్లా సహకార శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నిక జరిగే రోజు డీసీసీబీ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ విధించే అవకాశాలున్నాయి. ఈ ఎన్నిక నిర్వహణ విషయమై డీసీవో సూర్యచంద్రరావు ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నిక విషయంలో ప్రభుత్వం నుంచి సహకార శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు అందినట్లు సమాచారం.
డీసీసీబీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ
Published Tue, Aug 5 2014 2:05 AM | Last Updated on Wed, Oct 17 2018 6:22 PM
Advertisement
Advertisement