సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఢిల్లీ స్థాయిలో స్క్రీనింగ్ కమిటీల చేతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. డీసీసీతో పాటు పీసీసీ, ఎంపీ, మాజీ మంత్రి వేర్వేరుగా అధిష్టానానికి రకరకాల కోణాల్లో తాము సూచించే అభ్యర్థుల పేర్లను సిఫారసు చేశారు. వేర్వేరుగా జాబితాలు అందించారు. ఈ జాబితాలో ఉన్న పేర్లు ఖరారవుతాయని ఎదురుచూస్తున్న పార్టీ నేతలకు అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. జాబితాలను పక్కనపెట్టి సొంతంగా నియోజకవర్గాల వారీగా సమర్థులైన అభ్యర్థులను గాలించే పని పెట్టుకుంది.
ఒంటరిగా పోటీకి దిగితే టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు అభ్యర్థుల ఎంపికలో తప్పనిసరిగా సామాజిక న్యాయం పాటించాలని భావిస్తోంది. మొత్తం 13 నియోజకవర్గాల్లో మూడు ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్‌లున్నాయి. మిగతా పది నియోజకవర్గాల్లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం కల్పించే దిశగా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో ఒక సీటును మైనారిటీకి, ఒకటి మహిళ, ఒకటి పద్మశాలిలకు, మిగిలిన వాటిలో ఆయా నియోజకవర్గాల్లో ఆధిపత్యం ఉన్న కులాలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో కొత్త పేర్లు పరిశీలనలోకి వస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, రామగుండం నుంచి జేఏసీ నాయకుడు పిట్టల రవీందర్ పేర్లు తెరపైకి వచ్చాయి. హుజూరాబాద్‌లో ఇప్పటివరకు ఉన్న నేతలను కాదని, కౌశిక్‌రెడ్డి పేరు వినపడుతుండడంతో రేసులో ఉన్న మిగతా నేతలందరూ ఒక్కటయ్యారు.
తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా సరే కాని కొత్త వ్యక్తికి ఇవ్వొద్దంటూ కృష్ణ మోహన్‌రావు, తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్, పరిపాటి రవీందర్‌రెడ్డి, కేతిరి సుదర్శన్‌రెడ్డి బహిరంగంగా ప్రకటన చేశారు.అధిష్టానం ఎంచుకున్న కొత్త కసరత్తు విధానంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. టీఆర్‌ఎస్‌లో పెద్దపల్లి ఎంపీ స్థానంపై కిరికిరి కొనసాగుతోంది. వివేక్ కాంగ్రెస్‌లో చేరడంతో అక్కడ అభ్యర్థిని ఎంచుకోవటం టీఆర్‌ఎస్‌కి సవాల్‌గా మారింది. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను పెద్దపల్లి నుంచి బరిలోకి దింపేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. లేనిపక్షంలో రసమయి బాలకిషన్‌ను అక్కడ పోటీకి దింపితే ఎలా ఉంటుందనే లాభ నష్టాలను ఆ పార్టీ బేరీజు వేసుకుంటోంది.
హుస్నాబాద్ సీటు మాకంటే మాకు.. అని పట్టుబట్టడంతో.. కాంగ్రెస్, సీపీఐల పొత్తు ఎటూ తేలడం లేదు. ఎడతెగకుండా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ పార్టీకి పొత్తులో వదిలిపెట్టినా మరో పార్టీ ఖచ్చితంగా పోటీకి దిగే అవకాశముంది.
బీజేపీ, టీడీపీల పొత్తు చర్చలు దీర్ఘకాలికంగా కొనసాగుతూనే ఉన్నాయి. వారం రోజులుగా ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న చర్చలు సర్దుబాటు స్థాయికి చేరుకోలేదు. ఆ రెండు పార్టీలకు పెద్దపల్లి స్థానం ఇరకాటంగా మారింది.
శుక్రవారం టీఆర్‌ఎస్ తొలి జాబితాను విడుదల చేయనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చొప్పదండి, వేములవాడ, ధర్మపురి, మానకొండూరు మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది.
వీడని ఉత్కంఠ
Published Fri, Apr 4 2014 4:13 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement