
చంపేశారు!
♦ దివ్య మృతిపై అనుమానాలు
♦ సాగు...తోన్న రైల్వే పోలీసుల విచారణ
♦ హత్యేనంటున్న మృతురాలి తల్లిదండ్రులు
♦ చివరగా తండ్రికి ఫోన్.. అదే రోజు రాత్రి మృతి
♦ బాధ్యులను గుర్తించాలని ప్రజాసంఘాలు, విద్యార్థుల డిమాండ్
♦ వెల్లువెత్తుతున్న నిరసనలు
జహీరాబాద్/కోహీర్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని దివ్య కేసు ఇంకా మిస్టరీ వీడలేదు. ఆమె మరణించి వారం రోజులైనా కేసులో పురోగతి కన్పించడం లేదు. దివ్యది ముమ్మాటికి హత్యేనని కుటుంబసభ్యులు గట్టిగా వాదిస్తున్నారు. కేసు విచారణను వేగవంతం చేసి గుట్టురట్టు చేసి బాధ్యులను శిక్షించాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కోహీర్ మండలం మద్రి గ్రామానికి చెందిన నడిమొదొడ్డి రత్నయ్య, ప్రేమలత దంపతుల కుమార్తె దివ్య (18) జహీరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. గత నెల 30న ఉదయం కళాశాలకు వెళ్లింది. అదే రోజు రాత్రి 8.05 గంటల ప్రాంతంలో దివ్య జహీరాబాద్ నుంచి తన తండ్రికి ఫోన్ చేసింది. స్నేహితురాలి ఇంటి వద్ద పుట్టిన రోజు వేడుక ఉందని, తాను అక్కడికి వెళ్తున్నట్టు చెప్పింది. రాత్రి అక్కడే ఉండి ఉదయం కళాశాలకు వెళ్లి వస్తానని చెప్పింది. 15 నిమిషాల తర్వాత మరోమారు తండ్రికి ఫోన్ చేసి.. తాను రాత్రి జహీరాబాద్‌లో ఉండి ఉదయమే ఇంటికి వస్తానని తెలిపింది. ఆ రెండు మార్లు కూడా ఇతరుల ఫోన్ నుంచి మాట్లాడింది. ఉదయం ఇంటికి వస్తానని చెప్పిన దివ్య ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మర్నాడు ఉదయం అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై విగత జీవిగా పడి ఉంది.
వీడని చిక్కుముడి..
కళాశాలకు వెళ్లిన దివ్య రైల్వే పట్టాలపై శవమై పడి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన రైల్వే పట్టాలపై జరగడంతో వికారాబాద్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తోటి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. తుది నివేదిక రావాల్సి ఉంది. ఈ కేసును స్థానిక సివిల్ పోలీసులకు బదలాయిస్తామని రైల్వే పోలీసులు ఇదివరకే ప్రకటించినా ఇంకా అప్పగించలేదు.
నమ్మించి వంచించారా?
తెలిసిన వారే దివ్యను నమ్మించి వంచిం చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివ్య చివరిసారిగా జూన్ 30న రాత్రి 8.20 గంటల ప్రాంతంలో జహీరాబాద్‌లోని కుమార్ హోటల్ సమీపంలో దారిన వెళ్లే వ్యక్తి వద్ద ఫోన్ తీసుకుని తండ్రితో మాట్లాడింది. తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన సమయంలో దివ్య ఒంటరిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో దివ్య జహీరాబాద్ నుంచి మద్రికి ఒంటరిగా వచ్చే అవకాశం లేదు. రాత్రి వేళ బస్సు సౌకర్యం లేదు. ఆటోలు సైతం తిరగవు.
హుగ్గెల్లి-గురుజువాడ రహదారిపై పగటి పూటనే జనసంచారం అంతంతగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి వేళ దివ్య ఒంటరిగా వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. బహుశా దివ్యకు తెలిసిన వారు ఎవరైనా రాత్రి పూట తారస పడి గ్రామానికి వెళ్దామని చెప్పి తీసుకువెళ్లి దురాఘతానికి పాల్పడి ఉండి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివ్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే శవాన్ని రైలు పట్టాలపై పడేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటూ వారు కన్నీరు మున్నీరవుతున్నారు.
దివ్య చదువులో సరస్వతి...
దివ్య మెరిట్ స్టుడెంట్. ఈ ఏడాది జరిగిన పదోతరగతి పరీక్షల్లో గురుజువాడ పాఠశాల టాపర్‌గా నిలిచింది. ఎంపీ బీబీ పాటిల్ చేతుల మీదుగా సన్మానం పొందింది. ఉపాధ్యాయులు సైతం అభినందించారు. పాఠశాల తరఫున కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఓ విద్యావేత్త దివ్యకు నగదు పురస్కారాన్ని సైతం ప్రకటించారు.
ప్రజా సంఘాల ఆందోళనలు..
దివ్య మరణంపై విచారణ నత్తనడకన సాగుతోండడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రజా సంఘాలు, విద్యార్థి, మహిళా సంఘాలు ఉద్యమ బాటపట్టాయి. ఇదివరకే ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు జహీరాబాద్‌లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. మహిళా సంఘాల వారు సైతం ర్యాలీ నిర్వహించి తహసీల్దార్, మున్సిపల్ చైర్‌పర్సన్, పోలీసులకు వినతిపత్రాలను సమర్పించారు. బుధవారం కోహీర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.