ఇంద్రవెల్లి (ఆదిలాబాద్ జిల్లా) : ఇంద్రవెల్లి మండలంలోని బుర్సన్‌పటార్ గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణి ఉషాతారు(25) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తమ కూతురిని అత్తింటివారు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అల్లుడు బాలేరావ్ రాహుల్ వివాహేతర సంబంధమే కారణమని తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బుర్సన్‌పటాల్ గ్రామానికి చెందిన బాలేరావ్ గోవింద్‌రావ్, నర్మద దంపతుల కుమారుడు బాలేరావ్ రాహుల్‌కు జైనూర్ మండలం కొండిభగూడ గ్రామానికి చెందిన బోడ్కే పాండురంగ్, జయబాయి దంపతుల కూతురు ఉషాతారుకి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇదే గ్రామంలోని ఓ యువతితో రాహుల్ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్యను వేధించేవాడు.
ఉషాతారు ఏడు నెలల గర్భిణి కావడంతో 15 రోజుల క్రితం ఆమె తండ్రి వచ్చి కొండిభగూడకు తీసుకెళ్లాడు. నాలుగు రోజుల క్రితం ఉషాతారు తిరిగి బుర్సన్‌పటార్ గ్రామానికి రాగా భర్త, అత్తామామలు గొడవపడి చిత్రహింసలకు గురిచేశారు. గురువారం రాత్రి కూడా ఉషాతారుతో భర్త గొడవ పడ్డాడు. దీంతో అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఇంట్లో దూలానికి తాడుతో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. శుక్రవారం విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు బుర్సన్‌పటార్ గ్రామానికి చేరుకున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె భర్త, అత్తామామలు, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువతి కలిసి కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఉషాతారు తల్లిదండ్రులు ఆరోపించారు.
హత్య చేయకపోతే రాహుల్ ఎందుకు పారిపోయూడని, వెంటనే అతడిని అరెస్టు చేయూలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్ డీఎస్పీ మల్లారెడ్డి, ఉట్నూర్ ఇన్‌చార్జి సీఐ రవికుమార్, ఎస్సైలు రాణాప్రతాప్, మంగిలాల్, ఏఎస్సై జీవన్‌రావు గ్రామానికి చేరుకుని ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె భర్త రాహుల్, అత్త నర్మద, మామ గోవింద్‌రావు, యువతి యమునబాయిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో గర్భిణీ మృతి
Published Fri, May 27 2016 7:16 PM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM
Advertisement
Advertisement