
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తీవ్ర తప్పిదాలకు పాల్పడి పదుల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. గురువారం ఉదయం పది న్నర గంటలకు లక్డీకాపూల్‌లోని జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన ఫలితాల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడమేగాక.. తల్లిదండ్రుల కడుపుకోతకు కారకులైన వారిని గుర్తించి తక్షణమే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేంత ధ్యాసను.. ఫలితాల పట్ల చూపిస్తే 20 మందికిపైగా విద్యార్థుల ప్రాణాలు నిలచేవని పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్యం, విద్యాశాఖ తప్పిదాన్ని ఎండకట్టేందుకు ధర్నాకు కాంగ్రెస్ నేతలు, శ్రేణలు అధిక సంఖ్యలో హాజరుకావాని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment