
మరోసారి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచిన టీ.ప్రభుత్వం
హైదరాబాద్: మరోసారి తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పెట్రోల్ పై ఉన్న 31 శాతం వ్యాట్ ను 35. 25 కు పెంచగా, డీజిల్ పై 22.25 శాతం నుంచి 27 శాతానికి పెంచింది.
ఈ మేరకు గురువారం కేసీఆర్ ప్రభుత్వం ఓ ప్రకటనలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా తగ్గినా.. ఆ రాయితీ వినియోగదారుడికి అందని ద్రాక్షగానే మిగిలిపోనుంది. ఆదాయ మార్గాల అన్వేషణలో ఉన్న సర్కారుకు పెట్రో ధరలపై విధించే పన్ను అయాచిత వరంగా కలిసొచ్చింది. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకునే పేరుతో వ్యాట్ గతనెల్లో కూడా బాది మరీ ప్రజల నడ్డి విరిచింది. అంతర్జాతీయ చమురు ధరలు తీవ్రస్థాయిలో పడిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రో ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. వరుసుగా రెండో సారి వ్యాట్ ను పెంచడం వినియోగదారుల్లోఆందోళన కల్గిస్తోంది.