
సాక్షి, హైదరాబాద్:బుర్జ్ దుబాయ్ మాదిరిగా మన నగరంలోనూ ఓ బుర్జ్ రూపుదిద్దుకుంటోంది. అదే టీ–హబ్ 2వ దశ భవనం. ఇది అంకుర పరిశ్రమల స్వర్గధామంగా నిలవనుంది. ఈ భవంతి మార్చి 2020 నాటికి పూర్తి కానుంది. దేశంలో అతిపెద్ద స్టార్టప్‌ల ల్యాబ్(ఇంక్యుబేటర్) ఇదేనని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వెయ్యి స్టార్టప్ కంపెనీలకు ఇది ఆలవాలం కానుంది. 4 వేల మంది సాంకేతికనిపుణులు తమ సృజనకు పదును పెట్టే వేదికగా ఈ భవనాన్ని హైదరాబాద్ సమీపంలోని రాయదుర్గంలో సుమారు మూడెకరాల విస్తీర్ణంలో ఐటీ శాఖ నిర్మిస్తోంది.
బుర్జ్ దుబాయ్ నిర్మాణశైలిలో..
దుబాయ్‌లోని బుర్జ్ దుబాయ్ నిర్మాణశైలిని పోలినరీతిలో ఈ అధునాతన భవంతి నిర్మాణం సాగుతోంది. బుర్జ్ దుబాయ్ నిర్మాణపనుల్లో పాలుపంచుకున్న తిరుచ్చి(కేరళ)కి చెందిన ఎవర్ శాండీ కంపెనీ ప్రతినిధులే టీహబ్ రెండోదశ భవన నిర్మాణంలోనూ పాల్గొంటుండటం విశేషం. బయటి నుంచి చూసేవారికి ప్రధాన కేంద్రం నుంచి 4 పిల్లర్లు, రెండు స్టీలు దూలాలతో వేలాడే భవంతిలా కనిపించనుంది. 9 అంతస్తుల్లో 60 మీటర్ల ఎత్తు, 90 మీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు. రెండు లక్షల చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం, మరో మూడు లక్షల అడుగుల పార్కింగ్ సదుపాయంతో సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టారు. ఆరునెలలుగా పనులు వేగంగా జరుగుతున్నాయి.
అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభ
6,500 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటు పునాది నిర్మాణాన్ని 26 గంటల సమయంలో పూర్తి చేయడం ఇంజనీరింగ్ రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. ఈ భవన నిర్మాణంలో చేపట్టిన వినూత్న విధానాలు, ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలు, ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనవి. దీనిని 3డి భవనంగా భావిస్తున్నారు. ఈ భవంతి భూకంపాలు, వరదలకు సైతం చెక్కుచెదరని విధంగా నిర్మిస్తున్నారు. గురుత్వాకర్షణ బలాలను సైతం ఈ భవంతి తట్టుకుంటుంది.అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతస్తుకో ప్రత్యేకత
గ్రౌండ్ ఫ్లోర్: వీక్షకులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంటుంది.చక్కటి ఆహ్లాదకరమైన ఆకుపచ్చని గోడలు, ప్రకృతి రమణీయ హరిత దృశ్యాలు, ప్రవేశ ద్వారం, ఆరుబయట పచ్చికబయలు, పలు సౌకర్యాలు
మొదటి అంతస్తు: విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టే నిర్మాణశైలి, ఇంక్యుబేషన్ కేంద్రం దీని ప్రత్యేకత. భవనంలో జరిగే మొత్తం రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది.
రెండోఅంతస్తు: అద్భుతమైన 3డి చిత్రాలతో ఆలోచనలను ఆవిష్కరింపజేసే ప్రయోగస్థలాన్ని తలపిస్తుంది. సమావేశ మందిరాలు, చర్చా ప్రాంగణాలు ఉంటాయి.
3, 4వ అంతస్తులు: అంకుర పరిశ్రమలు, ఐటీ, బీపీవో, కేపీవో, సేవారంగానికి చెందిన వివిధ కార్యాలయాలు, సమావేశాల నిర్వహణకు అవసరమైన హంగులు.. ఆకుపచ్చని మొక్కలు. హరితతోరణంలా ఉంటుంది.
5వ అంతస్తు: అటవీప్రాంతాన్ని తలపించేలా ఉంటుంది. చిన్న, చిన్న కాలిబాటలు.. నీటి సెలయేర్లు.. అభిప్రాయాలు, ఆలోచనలు పరస్పరం పంచుకునేందుకు అనువైన వాతావరణం. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవనుందీ అంతస్తు.
6, 7, 8, 9వ అంతస్తులు: వివిధ రకాల కార్యాలయాలు, అంకుర పరిశ్రమలు. ఉద్యోగులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచేందుకు అవసరమైన వసతులు. ఇన్‌డోర్‌గేమ్స్, జిమ్‌లు, క్యాంటీన్‌లు, ఫుడ్ కోర్టులు, కెఫెటేరియాలు కొలువుదీరుతాయి.
Comments
Please login to add a commentAdd a comment