సంక్షేమ అధికారులకు ట్యాబ్లు
జవాబుదారీతనం, కచ్చితమైన పర్యవేక్షణ కోసం ఎస్టీ శాఖ చర్యలు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమరంగానికి సంబంధించి క్షేత్రస్థాయిలో మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఎక్కడైనా స్తబ్దత ఏర్పడినా లేదా పనుల్లో వేగం మందగించినా, సరైన పర్యవేక్షణ లేకపోయినా అటువంటి వాటిని గుర్తించే ప్రక్రియను చేపడుతున్నారు. కిందిస్థాయి వరకు అధికారుల విధుల నిర్వహణలో కచ్చితత్వం, జవాబుదారీతనం, నిబద్ధతలను సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆయా ఉపకరణాలు, పరికరాల (గాడ్జెట్స్)ను ఉపయోగించుకోవడం ద్వారా అధికారుల నుంచి మంచి ఫలితాలను సాధించేందుకు సంక్షేమ శాఖలు నడుం బిగించాయి.
ఇప్పటికే కొన్ని శాఖల్లో ఆయా చర్యలను చేపట్టినా తాజాగా షెడ్యూల్డ్ తెగల సంక్షేమశాఖ పరిధిలోని అధికారులందరికీ త్వరలోనే ట్యాబ్‌లు (ట్యాబ్‌లెట్లు) అందజేయనున్నారు. ఎస్టీ శాఖ పరిధిలోని అధికారులందరికీ మంచి కాన్‌ఫిగరేషన్ ఉన్న ట్యాబ్స్‌ను, ఆయా పనుల పర్యవేక్షణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. తమకు అవసరమైన అన్ని సాంకేతిక అంశాలున్న మంచి ట్యాబ్‌లను సూచించాల్సిందిగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు కూడా ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్రస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు శాఖాపరంగా చేపడుతున్న పనులు, కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ ప్రాతిపదికన చేపడుతున్న పనులు, విద్యాసంస్థల పనితీరు, పథకాల తీరుతెన్నులను ట్యాబ్‌ల ద్వారా పరిశీలించాలని నిర్ణయించారు. తనిఖీలు, పర్యవేక్షణలను గురించి పై అధికారులకు నివేదికలను అందించేందుకు వీటిని ఉపయోగించనున్నారు. విద్యార్థులు, టీచర్లు, వార్డెన్లు, ఇతరుల అటెండెన్స్‌ను బయోమెట్రిక్ పద్ధతిలో పర్యవేక్షించేందుకు, ఎస్టీ హాస్టళ్ల పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేసేందుకు, టీడబ్ల్యూఎస్‌ఐఎస్ విధానంలో మార్పులు తీసుకురావాల్సిందిగా సీజీజీకి సవివర ంగా లే ఖ రాశారు.
స్టడీసర్కిళ్ల విద్యార్థులకూ ట్యాబ్‌లు
ఎస్టీ, బీసీ శాఖల పరిధిలోని స్టడీ సర్కిళ్లలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కూడా ట్యాబ్‌లను సరఫరా చేయాలనే ఆలోచనతో అధికారులున్నారు. ఎస్టీ, బీసీ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిన పక్షంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) నుంచే ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లలో చేరేవారికి ట్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి.