సరదా కోసం వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని రిజర్వాయర్‌లో పడి మృతిచెందిన సంఘటన జనగామ మండలంలోని చీటకోడూరు గ్రామం వద్ద గురువారం జరిగింది.
చీటకోడూరు రిజర్వాయర్ కాల్వలోకి దిగిన విద్యార్థిని మృతి
వడ్లకొండ, మరిగడి గ్రామాల్లో విషాద ఛాయలు
జనగామ రూరల్ : సరదా కోసం వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని రిజర్వాయర్‌లో పడి మృతిచెందిన సంఘటన జనగామ మండలంలోని చీటకోడూరు గ్రామం వద్ద గురువారం జరిగింది. వడ్లకొండ గ్రామానికి చెందిన చిలుక సంధ్య(18) జనగామలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతోంది. ఈమె శామీర్‌పేట గ్రామానికి చెందిన తన స్నేహితురాలు సృజన కుటుంబంతో కలుపుగోలుగా ఉండేది. ఈ క్రమంలో సృజన తల్లి ఏస్తేరు, సోదరుడు సిరోలు జనగామలో బ్యాంక్ పనులు చూసుకుని వడ్లకొండలోని సంధ్య ఇంటికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు మాట్లాడక సరదాగా చీటకోడూరు రిజర్వాయర్ వద్దకు వెళ్లాలని నిశ్చయించుకుని బైక్‌పై వెళ్లారు. డిగ్రీ పరీక్షలు దగ్గరపడ్డాయి చదువుకోవచ్చనే ఉద్దేశంతో సంధ్య పుస్తకాలు కూడా వెంట తీసుకెళ్లింది. చీటకోడూరు రిజర్వాయర్‌కు వచ్చే నీటి కాల్వ వద్ద కూర్చొని మాట్లాడుతుండగా కొద్దిసేపటికి సంధ్య కాల్వ లోతును గమనించకుండానే దిగింది. కాల్వలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా సంధ్య అందులో మునిగిపోయింది. దీంతో ఆమెను రక్షించేందుకు ఏస్తేరు ప్రయత్నించగా ఆమె కూడా కాల్వలోకి కూరుకుపోయింది. ఇది గమనించిన సిరోలు తన తల్లి ఏస్తేరును బయటకు లాగాడు. సంధ్యను బయటకు తీసేందుకు అతడితోపాటు అక్కడే ఉన్న మరికొందరు కాల్వలోకి దూకినప్పటికీ ఫలితం లేకుండా పోరుుంది.
అప్పటికే సంధ్య గల్లంతైంది. సమాచారం తెలుసుకున్న సంధ్య బంధువులు, వడ్లకొండ, చీటకోడూరు గ్రామాల సర్పంచ్‌లు ఎల్లబోయిన ఎల్లమ్మ, కొమురయ్య, కొర్నెపాక లక్ష్మి, ఉపేందర్ అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో సంధ్య మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని చూసిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నాడు తల్లిదండ్రులు.. నేడు కూతురు మృతి
మరిగడి గ్రామానికి చెందిన చిలుక మల్లయ్య, కమలమ్మ దంపతులకు కూతుర్లు రేణుక, సంధ్య ఉన్నారు.పదేళ్ల క్రితం అనారోగ్యంతో కొమురయ్య, కొన్నేళ్ల క్రితం తల్లి కమలమ్మ మృతిచెందింది. దీంతో వడ్లకొండ గ్రామంలోని మేనమామ అయిన గుండె రత్నం ఇంట్లో ఉంటూ సంధ్య చదువు కొనసాగిస్తుంది. నాడు తల్లిదండ్రులు, నేడు కూతురు మృతితో వడ్లకొండలో, మరిగడి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.