రాములోరి పెళ్లికి తలంబ్రాలు సిద్ధం
శ్రీరామనవమి పర్వదినాన తెలంగాణా రాష్ట్రంలోని భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణంలో దేవతామూర్తులపై పోసే తలంబ్రాల తయారు చేసే అవకాశం చీరాల వాసులకే దక్కింది.
చీరాల: శ్రీరామనవమి పర్వదినాన తెలంగాణా రాష్ట్రంలోని భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణంలో దేవతామూర్తులపై పోసే తలంబ్రాల తయారు చేసే అవకాశం చీరాల వాసులకే దక్కింది. చీరాల వాసులు ఈ అవకాశాన్ని దక్కించుకోవడం వరుసగా ఇది మూడోసారి. శ్రీ రఘురామ భక్త సేవా సమితి 2011లో 11 మందితో చీరాలలో ఏర్పాటైంది. ప్రస్తుతం 700 మంది ఇందులో భాగస్వాములు అయ్యారు. గోటితో వడ్లు వొలిచి వాటిని తలంబ్రాలుగా తయారు చేసే కార్యక్రమం క్షీరపురి వాసులకు దక్కడం ఎదురుచూడని అదృష్టం. విజయదశమి నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 22వ తేదీ వరకు జరుగుతుందని నిర్వాహకుడు పొత్తూరి బాలకేశవులు తెలిపారు.
స్థానిక సంతబజారులోని శివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చీరాల నుండి తీసుకెళ్లే 144 కేజీల తలంబ్రాలను స్వామివార్లకు వినియోగిస్తారు. అలానే ఆరు వేల కేజీల తలంబ్రాలను దేవస్థానం ఏర్పాటు చేసి వాటిని భక్తులకు అందిస్తారు. 122కేజీల పసుపు, 60 కేజీల గులాం, 51 కేజీల కుంకుమను ఇప్పటికే భద్రాచలం దేవస్థానానికి పంపినట్లు తెలిపారు. వరుసగా మూడు సంవత్సరాలుగా ఈ అవకాశం దక్కడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.