
సాక్షి, హైదరాబాద్/ పుల్కల్: ‘అగజూర్రి సారూ...! మందల ఉన్న బట్ట గొర్రె.. అగ్గొగ్గో ఆ.. కొదమ, దానెమ్మటే ఉన్న బొల్లిగొర్రె.. ఈ సుక్క పిల్ల.. అన్నీ మీరిచ్చిన గొర్లే. మంచిగ కాసుకుంటన్నం. అమ్ముకున్నమని సెప్పింది ఎవరు సారూ..?’ అని గొర్రెల కాపర్లు మం దలో ఉన్న గొర్రెలను అధికారులకు చూపెడుతున్నారు. అవి తామిచ్చిన గొర్రెలు కావని తెలిసినా అధికారులు.. ‘అవి మేం ఇచ్చిన గొర్రెలే’ అని సంతృప్తిని నటిస్తున్నారు.
‘అటూ ఇటూ ఇదే గొర్రె, ఎవరు బకరా’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో గత మూడ్రోజులుగా లబ్ధిదారుల గొర్రెలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా గొర్రెల రీసైక్లింగ్ ఎక్కువగా ఉన్న సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో విచారణ చేస్తున్నారు.
ఈ విచారణలో అధికారులు తమను కాపాడుకోవడం కోసం గొర్రెలను అమ్ముకున్న లబ్ధిదారులను దాచిపెడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలంలో మంగళవారం ఒకవైపు అధికారులు తనిఖీలు చేస్తుండగానే.. అదే మండలంలోని బస్వాపురం నుంచి సబ్సిడీ గొర్రెలను ఆటోల్లో తరలిస్తున్న దృశ్యాలు ‘సాక్షి’కి కనిపించాయి.
అద్దెకు గొర్రెల మందలు
అధికారులు తనిఖీలు ముమ్మరం చేయటంతో లబ్ధిదారులు గొర్రెలను అద్దెకు తెచ్చి అధికారులకు చూపెడుతున్నారు. అధికారులు కూడా 21 గొర్రెలున్నాయా? లేవా? అని లెక్క చూసుకొని విచారణ మమ అనిపిస్తున్నారు. అధికార బృందాలు పుల్కల్ మండలానికి క్యూ కట్టారు. అధికారులు ముందే సమాచారం ఇస్తుండటంతో.. లబ్ధిదారులు తమ బంధువులకు చెందిన గొర్రెల మందలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. అధికారులకు వాటినే చూపిస్తున్నారు.
ట్యాగులు లేకపోవడంతో..
సబ్సిడీ గొర్రెలను సులువుగా గుర్తించేందుకు ప్రభుత్వం గొర్రెల చెవులకు ట్యాగులు వేస్తోంది. ట్యాగుకు నంబర్ ఉంటుంది. దీని ఆధారంగా అది ఎవరి గొర్రె అనేది గుర్తించవచ్చు. కానీ కాపర్లు ఈ ట్యాగులను తొలగిస్తున్నారు. దీనిపై అధికారులు కూడా అభ్యంతరం చెప్పటం లేదు. ఈ ట్యాగులు లేక క్రయవిక్రయాలు సులువవుతున్నాయి.
85 మందిపై కేసులు పెట్టాం: డీడీ రంగయ్య
‘ఎవరు బకరా’ కథనానికి స్పందన
నిజాంసాగర్(జుక్కల్): గొర్రెల రీసైక్లింగ్‌పై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ‘ఎవరు బకరా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’ దినపత్రిక మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగం గా రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య డిప్యూటీ డైరెక్టర్, టాస్క్‌ఫోర్స్ అధికారి రంగయ్య మంగళవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ హసన్‌పల్లిలో విచారణ చేపట్టారు.
గ్రామంలో మేకల యూనిట్లు పొందిన 16 మందితో మాట్లాడారు. సబ్సి డీ గొర్రెలను విక్రయించడంతో పాటు బినామీల పేరిట గొర్రెలను తీసుకుంటున్న వారిపైనా చర్యలు తీసుకుంటూ కేసులు పెడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 85 మందిపైన కేసులు నమోదు చేశామన్నారు. సబ్సిడీపై పొందిన గొర్రెలను విక్రయించవద్దని లబ్ధిదారులకు సూచించారు. గొర్రెలు అనారోగ్యం బారిన పడి మృతిచెందితే బీమా పరిహారం అందుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment