రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవంలో గవర్నర్ తమిళిసై. చిత్రంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఏపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తదితరులు
సాక్షి, హైదరాబాద్: మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు జరిపించుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతల్లో తలమునకలై ఉండాల్సి రావడంతో మహి ళలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యోగా, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గవర్నర్ తమిళిసై బుధవారం రాజ్‌భవన్‌లో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఏపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు వంటింటినుంచి బయటకొచ్చి వివిధ రంగాల్లో బాగా కష్టపడుతున్నారని, అలా చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి తాను తమిళిసై లాగా రాలేదని, తెలుగుసైలా వచ్చానని చెప్పి అందర్నీ నవ్వించారు. వివిధ రంగాల్లో రాణించిన 21 మంది మహిళలను ఈ కార్యక్రమంలో గవర్నర్ ఘనంగా సత్కరించి పురస్కారాలు అందజేశారు.
పురస్కార విజేతలు వీరే
పీవీ సింధు (క్రీడలు), డాక్టర్ జ్యోతి గౌడ్ (పరిశోధనలు), సంగారెడ్డి జిల్లా హుమ్నపూర్ వాసి బేగారి లక్ష్మమ్మ (వ్యవసాయంపై సినిమా రూపకల్పన), సిద్దిపేట జిల్లావాసి గొట్టే కనకవ్వ (జానపద గాయని), డాక్టర్ ఎస్‌వీ కామేశ్వరి(వైద్యురాలు), జగిత్యాల జిల్లా లంబాడిపల్లి వాసి మిల్కూరి గంగవ్వ (యూట్యూబ్‌స్టార్), జగిత్యాల జిల్లావాసి గుడేటి సరిత (క్రీడలు), ఆదిలాబాద్ జిల్లావాసి ఆత్రం సుశీల బాయి (సామాజిక చైతన్యం), రంగారెడ్డి జిల్లా వాసి తారాబాయి (స్వయం ఉపాధి), యోగిని అరుణా దేవి (యోగా గురు), రంగారెడ్డి జిల్లా వాసి మల్లారి (సాంప్రదాయ జాపపద కళాకారిణి), కొత్తగూడెం జిల్లావాసి రాజేశ్వరి (వైద్య సేవలు), నిఖత్ జరీన్ (క్రీడలు), దేవరకొండ వనజ(స్వచ్ఛంద సేవ), బూర రాజేశ్వరి(అక్షరాస్యత), తరుణి సంస్థ (మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడం), సురేఖారెడ్డి (సమాజ సేవ), మహమ్మద్ సుమ (స్వచ్ఛంద సేవ), వనమాల రమ్యశ్రీ (క్రీడలు), సూరి జ్యోతి (స్వచ్ఛంద సేవలు) గవర్నర్ నుంచి పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment