మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం, సభకు హాజరైన బీఎల్‌ఎఫ్ కార్యకర్తలు
వనపర్తి అర్బన్: కేసీఆర్ సారథ్యంలోని మాయకూటమి, కాంగ్రెస్ మహాకూటమి, బీజేపీ మతోన్మాద కూటములకు చెక్ పెట్టేందుకే ప్రజా కూటమైన బీఎల్‌ఎఫ్ ఆవిర్భవించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. వనపర్తిలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల జీవన విధానం మార్చే విధంగా ఎజెండా ఉండే వాటికి ప్రజల మద్దతు ఉండాలని.. ఆ విధంగా బీఎల్‌ఎఫ్ విధానాలు రూపుదిద్దుకున్నాయని చెప్పారు.
తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతదని చెప్పిన కేసీఆర్ నాలుగున్నరేళ్ల సమయం సరిపోలేదా..? అని ప్రశ్నించారు. ఏ ఒక్క హామీ నెరవేర్చని కేసీఆర్ ఓ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ కోసం రైతుల కోసం భూములు లాక్కున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లతో రూ.వందల కోట్లు కమీషన్లు తిని 2013 చట్టం ప్రకారం రైతులకు పరిహారం ఇవ్వకుండ వారి నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. ఇల్లు ఇవ్వని కేసీఆర్, మాట తప్పిన కేసీఆర్ ఓట్లు ఎందుకు అడుగుతున్నావని నిలదీశారు. ఆయన పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు.
ఇంటికో ఉద్యోగం ఏమైంది
తెలంగాణ వస్తే.. ఇక్కడున్న ఆంధ్రోళ్లు పోతే ఏర్పడే 2.5 లక్షల ఖాళీలలో తెలంగాణ బిడ్డలకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి చివరికి ఊరికొకటి ఐనా ఇచ్చావా అని వీరభద్రం ప్రశ్నించారు. ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ఎవరు అడ్డుపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చేవాడు కాదు.. ఊ డగొట్టే వాడని, ఇప్పటికి ఇచ్చిన 23 వేల ఉద్యోగాలలో ప్రజలకు అవసరమైన వైద్య పోస్టులు గాని, ఉపాధ్యాయ పోస్టులు గాని, వ్యవసాయాధికారి పోస్టులు గానీ భర్తీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ పీడ విరిగితేనే తెలంగాణవాదుల బతుకులు బాగుపడవన్నారు. అలాగే కాంగ్రెస్, టీడీపీలు అత్యధిక కాలం పాలించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. మహాకూటమిలోని సీపీఐ ఎర్రజెండాను తాకట్టు పెట్టేకంటే ప్రజా కూటమికి మద్దతు తెలపాలని సూచించారు. అమరుల ఆకాంక్ష కోసమే పనిచేస్తామం టున్న కోదండరాం వారితో ఎలా కలిశారని ఎద్దేవా చేశారు.
ప్రజలు ఆమోదిస్తే..
ప్రజలు ఆమోదించి అవకాశం కల్పించి బీఎల్‌ఎఫ్‌కు అధికారం కట్టబెడితే బీసీని ముఖ్యమంత్రి, మహిళను ఉప ముఖ్యమంత్రి చేస్తామని అందుకు బీఎల్‌ఎఫ్‌కు పట్టం కట్టాలని కోరారు. బీఎల్‌ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్, వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణయ్య, బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. కార్యక్ర మంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బా ర్, నాయకులు ఆంజనేయులు, ఎం.ఆంజనేయులు, రాజు, గోపాలకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment