దండిగా రుణం! | Target of crop loans | Sakshi
Sakshi News home page

దండిగా రుణం!

Published Sat, Sep 12 2015 11:48 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

దండిగా రుణం! - Sakshi

దండిగా రుణం!

అన్నదాతకు శుభవార్త. యేటా రైతులకిచ్చే పంటరుణ లక్ష్యంలో తాజాగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అడిగిన ప్రతి రైతుకు రుణమివ్వాలనే ఉద్దేశంతో నాబార్డ్ కొత్తగా భారీ మొత్తాన్ని రుణ రూపంలో ఇచ్చేందుకు ఉపక్రమించింది. గతంలో ఎన్నడూ లేనంతగా.. 2015- 16 వార్షిక సంవత్సరంలో జిల్లా రైతాంగానికి ఏకంగా రూ.2,185.16 కోట్ల రుణాలు ఇవ్వనుంది. వాస్తవానికి వార్షిక సంవత్సరం ప్రారంభంలో ఈ ఏడాది రుణలక్ష్యం రూ.730 కోట్లుగా జిల్లా యంత్రాంగం ఖరారుచేయగా.. తాజాగా నాబార్డ్ రూ.1,455.16 కోట్లను రుణ లక్ష్యానికి జోడిస్తూ.. వార్షిక రుణ ప్రణాళికను తిరిగి రూపొందించింది.
- పంటరుణాల టార్గెట్ రూ.2,185.16 కోట్లు
- వార్షిక రుణ ప్రణాళికను సవరించిన యంత్రాంగం
- రూ.1,455.16 కోట్ల లక్ష్యాన్ని జోడించిన నాబార్డ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా :
పంట రుణ లక్ష్యాన్ని సవరించడంతో బ్యాంకుల టార్గెట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. రూ.2,185.16 కోట్ల రుణాలివ్వాల్సి ఉండడంతో రైతుల సంఖ్య, బ్యాంకుల పరిమితిని గణిస్తూ బ్యాంకుల వారీగా లక్ష్యాల్ని నిర్దేశించాయి. ఇందులో అధికంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు రూ.530.79 కోట్ల రుణాలివ్వాల్సిందిగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆతర్వాతి స్థానంలో జిల్లా కేంద్ర సహకారబ్యాంకు (హెచ్‌డీసీసీబీ)కి రూ. 509.77కోట్లు, ఆంధ్రాబ్యాంకు లక్ష్యం రూ. 479.07కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ) రూ. 408.21 కోట్లు, కెనరా బ్యాంకు లక్ష్యం రూ.106.95 కోట్లుగా నిర్దేశించింది. ఇతర బ్యాంకులు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
 
ఖరీఫ్‌కు అందని ‘సవరణ’ ఫలం
తాజాగా సవరించిన రుణలక్ష్యం తాలుకు ఫలాలు ఖరీఫ్ సీజన్‌లో రైతాంగానికి పెద్దగా ప్రయోజనం చేకూరేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సాగు చివరిదశకు చేరింది. మరోవైపు వార్షిక సంవత్సరం రెండో త్రైమాసికం కూడా ఈనెలాఖరుతో ముగియనుంది. ఈక్రమంలో సెప్టెంబర్ రెండో పక్షంలో రుణ వితరణ స్తబ్దుగా సాగుతుంది. దీంతో రుణాల పంపిణీ నెమ్మదించనుంది. ఈ క్రమంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రూ. 1,380.24 కోట్ల మేర ఇవ్వాల్సి ఉండగా.. పావువంతు కూడా పురోగతి లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement