
‘చెయ్యి’చ్చిన ‘దేశం’
* చంద్రబాబు మాటను ఖాతరు చేయని తమ్ముళ్లు
* జిల్లా నాయకత్వం సూచనల మేరకు గులాబీకి మద్దతు
* టీడీపీ నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డ కాంగ్రెస్
* ‘దేశం’ మద్దతుతో జెడ్పీని వశం చేసుకున్న టీఆర్‌ఎస్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ ‘చెయ్యి’చ్చింది. రంగారెడ్డి జిల్లా పరిషత్ పీఠం టీఆర్‌ఎస్ ఖాతాలో పడేందుకు సంపూర్ణ సహకారం అందించింది. కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇరుపార్టీలు కలిసికట్టుగా సాగాలంటూ అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. కానీ జిల్లా పార్టీ అధినేత ఆదేశాన్ని పట్టించుకోకుండా ఆత్మప్రభోదానుసారం వ్యవహరించాలంటూ సభ్యులకు సూచించింది. దీంతో గులాబీ శిబిరంతో కుదిరిన అంతర్గత ఒప్పంద ం నేపథ్యంలో తమ్ముళ్లు కాంగ్రెస్‌కు మొండిచేయి చూపారు. వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్‌కు, రంగారెడ్డిలో టీడీపీకి జిల్లా పరిషత్‌ను వదిలేలా ఇరుపార్టీల మధ్య పరస్పర అవగాహన కుదిరింది.
ఈ క్రమంలో కారుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్‌తో జతకట్టడం తప్పనిసరని చంద్రబాబు తేల్చిచెప్పారు. అయితే, తొలుత పగ్గాలెవరు చేపట్టాలనే అంశంపై ఇరుపార్టీల్లో పేచీ నెలకొంది. దీంతో మెట్టుదిగిన కాంగ్రెస్ తొలుత జెడ్పీ కుర్చీని టీడీపీకి వదిలేయడానికి ముందుకొచ్చింది. అప్పటికే టీఆర్‌ఎస్‌తో బేరం కుదుర్చుకున్న తెలుగు తమ్ముళ్లు ఈ ఫార్ములాపై నోరు మెదపలేదు. ఇద్దరు జెడ్పీటీసీలు అప్పటికే టీఆర్‌ఎస్ గూటికి చేర డం, మరికొందరు కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారంతో వారితో దోస్తీకి విముఖత చూపింది. చైర్మన్ బరిలో నిలిచినా.. తమకు సంపూర్ణ సహకారం అందించకపోవచ్చనే అపనమ్మకాన్ని వెలిబుచ్చారు.
ఈ పరిణామాలతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం నేరుగా చంద్రబాబుతోనే సంప్రదింపులు జరిపింది. టీడీపీ జిల్లా నాయకత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిందేనని ఖరాకండిగా చెప్పారు. అప్పటికే టీఆర్‌ఎస్‌తో రాయబేరాలు కుదుర్చుకున్న పార్టీ నేతలు.. తమ సభ్యులను కూడా వారి శిబిరానికే తరలించారు. జిల్లా పరిషత్ ఎన్నికకు సైతం కలిసే వచ్చిన టీడీపీ జెడ్పీటీసీలు, ఒకే గదిలో కూర్చొని మంత్రి మహేందర్‌రెడ్డి సూచనల మేరకు నడుచుకున్నారు. టీడీపీ చెయ్యిచ్చిందనే విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ చేష్టలుడిగి చూస్తుండడం మినహా ఏమీ చేయలేకపోయింది.
‘దేశం’లో అసంతృప్తి జ్వాలలు
టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని జిల్లా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సరూర్‌నగర్ జెడ్పీటీసీ జిల్లెల నరేందర్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్‌తో పదవీకాలాన్ని పంచుకోవాలని చంద్రబాబు స్పష్టంచేస్తే జిల్లా నాయకులు కొందరు టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని తమపై ఒత్తిడి చేశారని వాపోయారు. త్వరలోనే కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.
ఫలించిన మహేందర్ వ్యూహం!
రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి జిల్లా రాజకీయాల్లో మరోసారి తనపట్టు నిలబెట్టుకున్నారు. జెడ్పీ పీఠాన్ని దకి ్కంచుకోవడానికి సరిపడా సంఖ్యాబలం లేనప్పటికీ, తన వ్యూహరచనతో ప్రత్యర్థుల శిబిరాలను కొల్లగొట్టారు. అత్యధిక సీట్లున్న కాంగ్రెస్‌లో చీలిక తేవడం ద్వారా బలాబ లాలను సమం చేసిన ఆయన.. పాత మిత్రులైన ‘దేశం’ నేతలను తనవైపు తిప్పుకోగలిగారు. పాతపార్టీలో వైరివర్గంగా వ్యవహరించిన నాయకుల స్నేహ హస్తంతో జెడ్పీని వశం చేసుకున్నారు.
యాదవరెడ్డి ఓటు టీఆర్‌ఎస్‌కే..!
ఎమ్మెల్సీ, నవాబ్‌పేట జెడ్పీటీసీ యాదవరెడ్డి కారెక్కారు. శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ఆయన తాజాగా జరిగిన జెడ్పీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కే అండగా నిలిచారు. కాంగ్రెస్ తరుఫున గెలిచిన ఆయన వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చున్నా, ఓటు మాత్రం గులాబీకి వేశారు. దీంతో ఆయన ఇక కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల టీఆర్‌ఎస్ కండువా క ప్పుకున్న రాజేంద్రనగర్ జెడ్పీటీసీ ముంగి జ్యోతి కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేశారు.