టీటీడీపీ నేతలు.. గప్‌చుప్
- తాజా పరిణామాలపై ఆందోళన
- ఏపీ మంత్రుల తీరుపై అసంతృప్తి
- అధినేత చంద్రబాబుతో భేటీ
- అంతర్మథనంలో తెలంగాణ టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' వ్యవహారం బయటపడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలకు ఎటూ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గెలుపు అవకాశమే లేని మండలి ఎన్నికల బరిలోకి దిగి బొక్కాబోర్లా పడిన ఆ పార్టీ నేతలు దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సైతం తెలంగాణ టీడీపీని బలోపేతం చేయడంపై కాకుండా.. తన ఇమేజ్‌ను కాపాడుకునేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తుండడం వారికి మింగుడు పడడం లేదు. దీంతో వారు తమ రాజకీయ భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారు. 'ఓటుకు కోట్లు' వ్యవహారం, తాజా రాజకీయ పరిణామాలపై తమ అనుమానాలను నివృత్తి చే సుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు టీటీడీపీ నేతలు కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నా అపాయింట్‌మెంట్ రాలేదు. చివరకు మరోసారి గట్టిగా ప్రయత్నించి సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
తారస్థాయికి అసంతృప్తి..!
బాబుతో పాటు, ఏపీ మంత్రులెవరూ కూడా తెలంగాణ టీడీపీ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరిస్తుండడంపై టీటీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'ఓటుకు కోట్లు' కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు చేస్తున్న పనులు, లేవనెత్తుతున్న అంశాలు తమకు సమస్యగా మారాయన్న అభిప్రాయం వారిలో నాటుకుపోయింది. అసలు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారుచేసే సమయంలోనే తెలంగాణ టీడీపీలోని రెండు వర్గాలు ఎలా గెలుస్తామంటూ వాదులాడుకున్నాయని ప్రచారంలో ఉంది. అలాంటిది గెలవని సీటు కోసం అభ్యర్థిని పెట్టడం, బాబు స్టీఫెన్ సన్‌తో ఫోన్‌లో మాట్లాడి దొరికిపోవడంతో టీ టీడీపీ నేతలు ఇరకాటంలో పడిపోయారు. ఈ పరిణామాలపై నోరు విప్పలేక మౌనం పాటిస్తున్నారు. దీనికితోడు బాబు సెక్షన్-8 వివాదాన్ని లేవనెత్తడంతో దాన్ని సమర్థించాలో, వ్యతిరేకించాలో తెలియక ఆత్మరక్షణలో పడిపోయారు.
ఏమంటే ఏమవుతుందో?
తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనలు, ఇష్టానుసారం మాట్లాడుతున్న తీరు తమకు ఇబ్బందికరంగా మారిందని టీటీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇక్కడ తెలంగాణలో తమ పరిస్థితి, పార్టీ భవిష్యత్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా వారు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు 'ఓటుకు కోట్లు' కేసులో రేవంత్‌ను, బాబును వెనకేసుకొచ్చేందుకు టీటీడీపీ నాయకులు కొంత ప్రయత్నించారు. తమను పార్టీ మారాల్సిందిగా టీఆర్‌ఎస్ నాయకత్వం బెదిరించిందంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు కూడా. కానీ ఈ కేసులో ఎమ్మెల్యేను ఏపీ ప్రభుత్వం రక్షిస్తున్న తీరు, నిందితుడు మత్తయ్యకు ఏపీలో షెల్టర్ ఇవ్వడం వంటి చర్యలతో తామేమీ మాట్లాడలేకపోతున్నామని తెలంగాణ టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ కేసులో పరిణామాలు తమకు చుట్టుకుంటాయేమోనన్న ఆందోళనలోనూ కొంద రు నేతలు ఉన్నారు. ఇలా మొత్తంగా తెలంగాణ టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బాబుతో టీ టీడీపీ నేతల భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ తెలంగాణ నేతలు సోమవారం భేటీ అయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర నేతలు బాబుతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వీరి మధ్య ప్రధానంగా 'ఓటుకు కోట్లు' కేసుతో పాటు ప్రస్తుత పరిణామాలు, వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ లోక్‌సభ స్థానం ఎన్నికపై టీ టీడీపీ నేతలు ఇప్పటికే తమ మిత్రపక్షం బీజేపీ నేతలతో చర్చించిన నేపథ్యంలో.. ఆ చర్చల సారాంశాన్ని సోమవారం బాబుకు వివరించినట్లు సమాచారం. అయితే ఆదివారమే వారు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో సోమవారం కలసి వివిధ అంశాలపై చర్చించారు.