కేసీఆర్ హామీలపై పోరాడాలి
టీటీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా అంతకుముందు టీఆర్‌ఎస్ నేతగా కేసీఆర్ ఇచ్చిన హామీలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని టీటీడీపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ నిర్వహించిన భూమికను ఆధారాలు, వివరాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న 27 జిల్లాలకు అవసరమైన నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర నాయకులను ఆదేశించారు. ఇకపై పార్టీ కార్యాలయాల్లోనే సమావేశాలు పెట్టుకుందామన్నారు.
శనివారం లేక్‌వ్యూ అతిథిగృహంలో చంద్రబాబుతో టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎంపీ గరికపాటి రామ్మోహనరావు, ఇ.పెద్దిరెడ్డి, నామా నాగేశ్వరరావు సమావేశమయ్యారు. తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేసేలా, వాటిలో గెలిచేలా వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు చెప్పారు. ఇటీవల సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలను గురించి చంద్రబాబుకు పార్టీ నాయకులు తెలియజేశారు. ఉప ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలకు పార్టీ ఎందుకు పోటీచేయలేదని వారిని ఆయన ప్రశ్నించారు. మోత్కుపలి నర్సింహులు గవర్నర్ అవుతున్నారంటే బలహీనవర్గాల అభ్యున్నతికి టీడీపీ తీసుకుంటున్న చొరవ, ప్రోత్సాహమే కారణమన్నారు.