తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తాము ఒక గేటు తెరిచామని చెప్పిన తీరు సరైనదేనా? కాదా? అన్నదానిపై చర్చించడం కొంచెం కష్టమే అని చెప్పాలి. గత ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇదే గేమ్ ఆడి అప్రతిష్టపాలయ్యారు. ఆ అనుభవం ఉన్నప్పటికీ రేవంత్ ఎందుకు ఇదే విధానంలోకి వెళ్లాలని భావిస్తున్నారు?. ‘టిట్ ఫర్ టాట్’ అనుకోవాలా? తన ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఫిరాయింపులే మార్గమని ఆయన భావిస్తున్నారా?.
శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు బొటాబొటి మెజార్టీనే వచ్చింది. అయినా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ను బలహీనపర్చడానికి రేవంత్ ఈ వ్యూహం ఎంచుకున్నట్లుగా ఉంది. ఇక తన మార్కు రాజకీయం చూస్తారని దబాయించి మరీ చెబుతున్నారు. అధికారంలో ఉంటే ఎంత జబర్దస్త్‌గా మాట్లాడవచ్చో రేవంత్ రుజువు చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున అటూ-ఇటూ నేతలు మారుతూనే ఉంటారు. ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరడం, స్వయంగా రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పడం కచ్చితంగా అభ్యంతరకరం అని చెప్పాలి. కేసీఆర్ గతంలో తమకు చేసిన అవమానానికి ప్రతీకారంగా ఇలా చేస్తున్నానని సీఎం చెప్పవచ్చు. అంతేకాక తన ప్రభుత్వాన్ని పడగొడతానంటున్నారు కనుక తానే ఎడ్వాన్స్ అవుతున్నానని అనవచ్చు. ఇక్కడ విశేషం ఏమిటంటే బీఆర్‌ఎస్ నుంచి ఎంత మంది దొరికితే అంతమందిని తమ పార్టీలలో కలుపుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. దీనిని ఎదుర్కోవడం బీఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు పెద్ద సవాలే.
ఇప్పటికే పాతిక మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్‌కు టచ్‌లోకి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. బహుశా గతంలో కేసీఆర్ చేసినట్లుగానే బీఆర్‌ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నట్లు ప్రకటిస్తారేమో చూడాలి. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించడంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఇది గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అనుసరించినట్లే కాంగ్రెస్ స్పీకర్ ప్రసాదకుమార్ కూడా వ్యవహరించారు. పోచారం మాదిరే ప్రసాద్ కూడా బీఆర్‌ఎస్ ఫిర్యాదును తీసుకోవడానికి ఇష్టపడలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారిన తర్వాత, అందరు కలిసి విలీనం అయినట్లు లేఖ ఇస్తే దానికి పోచారం ఆమోదముద్ర వేశారు. సరిగ్గా అదే స్ట్రాటజీని ఈ స్పీకర్ కూడా ఫాలో అవుతుండవచ్చు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 39 మంది గెలవగా, ఒకరు మరణించడంతో వారి సంఖ్య 38కి చేరింది. ఇప్పటికే పదిహేను మందికి పైగా రేవంత్‌ను కలిశారు. వారంతా అబివృద్ది పనుల కోసమే కలిశామని చెబుతున్నా, వారిలో ఎందరు పార్టీలో ఉంటారన్నది అనుమానమే. ఎందుకంటే అధికార రాజకీయాలకు అలవాటుపడిన ఈ రోజుల్లో పవర్ లేకుండా ఎమ్మెల్యేలు ఉండడం కష్టమే. ప్రతిపక్షంలో ఉంటే ఏ పనులు అవ్వవనే భయం ఏర్పడుతోంది. పైగా ఏవైనా కేసులు వస్తే పోలీసుల అండ కావాలంటే అధికారపార్టీ అవసరం అన్న భావన నెలకొంది. ఇది మంచిదా? కాదా? అంటే ఎవరూ మంచిదని చెప్పరు. కానీ, వర్తమాన రాజకీయాల్లో ప్రత్యేకించి చిన్న రాష్ట్రాలలో ఈ సమస్య బాగా ఎక్కువగా ఉందని చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇందుకు అతీతంగా లేదు.
ఇతర పార్టీల ఎంపీలను ఆకట్టుకోవడానికి బీజేపీ కూడా వ్యూహాలు అమలు చేస్తోంది. ఉదాహరణకు 2019లో ఏపీలో టీడీపీ ఓటమి తర్వాత నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అవుతున్నట్లు లేఖ ఇవ్వడం, ఆనాటి ఉప రాష్ట్రపతి దానిని ఆమోదించడం జరిగిపోయాయి. అలాగే ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. దీనిని ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ సమర్ధంగా ఎదుర్కుని జనంలోకి వెళ్లారు. దాంతో ఆయనకు విలువ పెరిగింది. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలాంటి ఫిరాయింపుల జోలికి వెళ్లలేదు. చంద్రబాబుతో తేడా వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చినా వారికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పలేదు. తెలంగాణలో పరిస్థితి అలా లేదు. తొలుత రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు డైరెక్షన్ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేయడానికి ఏభై లక్షలతో వెళ్లి పట్టుబడ్డారు. దాంతో ఆయన అరెస్టు కావల్సి వచ్చింది.
అప్పట్లో ఇదంతా కుట్ర అని రేవంత్ వాదించారు. ఆ తర్వాత కేసీఆర్ ఇదేదో ప్రమాదంగా ఉందని భావించి అప్పట్లో టీడీపీలో ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మందిని తనవైపు లాగేశారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురిని తన పార్టీలోకి తీసుకు వచ్చారు. అయినా 2018లో ఆయనకు పెద్ద ఇబ్బంది రాలేదు. 88 సీట్లతో మంచి విజయం సాధించారు. ఈ గెలుపు తర్వాత కూడా కేసీఆర్ తన విధానం మార్చుకోలేదు. మళ్లీ కాంగ్రెస్ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇదంతా అనైతికమని తెలిసినా తనకు ఎదురు లేదన్న అహంభావంతో కేసీఆర్ ముందుకు వెళ్లారు.
2014లో టీడీపీకి పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉంటే, పన్నెండు మంది టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కాకపోతే చంద్రబాబుకు చెప్పే కాంగ్రెస్‌లో చేరడం విశేషం. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంపై రేవంత్ పోరాటం కూడా చేశారు. కోర్టుకు కూడా వెళ్లారు. కానీ, ఫలితం దక్కలేదు. ఆ అనుభవాలన్నీ ఉన్నప్పటికీ, రేవంత్ అదే గేమ్ మొదలు పెడుతున్నారు. ఆయన గేట్లు తెరిస్తే కొందరు ఎమ్మెల్యేలు చేరితే చేరవచ్చు. కానీ, ఇప్పటికే ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కాంగ్రెస్ పక్షాన పోటీచేసి ఓడిపోయిన నేతలు దీనిపై గుర్రుగా ఉంటారు.
దానం నాగేందర్‌తో పదవికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటే అభ్యంతరం ఉండనవసరం లేదు. అలాకాకుండా పార్టీ కండువా కప్పడం సరికాదు. దానంకు పార్టీ మారడం కొత్తకాదు. 1994 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 2004లో అసిఫ్ నగర్ నుంచి టీడీపీ పక్షాన పోటీచేసి గెలిచారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వెంటనే మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. కానీ, వైఎఎస్సార్ అప్పుడు పదవికి రాజీనామా చేయించారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. అదివేరే విషయం.
తదుపరి 2009లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. అప్పట్లో టీఆర్ఎస్ పైన ఒంటికాలిమీద లేచేవారు. తన ఇంటివద్దకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయనకు పెద్ద గొడవ కూడా అయింది. చిత్రం ఏమిటంటే 2018 ఎన్నికల నాటికి ఆయన టీఆర్ఎస్ గూటికి చేరుకోగలిగారు. 2023లో కూడా బీఆర్‌ఎస్( టిఆర్‌ఎస్ పేరు మారింది) పక్షాన గెలిచారు. కానీ, అధికారం రాకపోవడంతో వెంటనే పార్టీ ఫిరాయించేశారు. ఇంతకాలం కాంగ్రెస్ స్థానిక నేతలు ఆయనపై భూకబ్జా ఆరోపణలు చేస్తుండేవారు. దానంను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కొందరు కాంగ్రెస్ వాదులు ధర్నా కూడా చేశారు. అయినా రేవంత్ వీటిని పట్టించుకోకుండా దానంను చేర్చుకున్నారు.
హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో రేవంత్ ఈ ఆపరేషన్ ఆకర్ష్ దానంతో మొదలు పెట్టారని అనుకోవాలి. పార్లమెంటు ఎన్నికలలో గతంలో తాను ప్రాతినిద్యం వహించిన మల్కాజిగిరితో సహా ఎక్కువ సీట్లు గెలవడం ముఖ్యం. అందుకు ఆయన ఈ గేమ్ మొదలు పెట్టారని అనుకోవచ్చు. దానికి ఆయన కేసీఆర్ పైన, బీజేపీ నేతలపైన సాకులు చెబుతుండవచ్చు. వాటిని జనం ఎవరూ నమ్మరు.
మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, బీజేపీ శాసనసభ పక్ష నేత మహేష్ రెడ్డిల మధ్య ప్రకటనల యుద్దం. ఉత్తుత్తి పోరాటమే అని వేరే చెప్పనవసరం లేదు. బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు బీఆర్‌ఎస్‌ను వీడడం ఎలా ఉందంటే జూలియస్ సీజర్ నాటకంలో యూ టూ బ్రూటస్ అన్న డైలాగు ఒకటి ఉంది. అది ‘కేకే’కి బాగా వర్తించవచ్చు. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం ఉన్నా, ఆయనకు టీఆర్‌ఎస్‌లోకి వచ్చాకే, కేసీఆర్ అండ లభించాకే ఒక గౌరవం, గుర్తింపు వచ్చాయి. దానిని వదలుకుని హైదరాబాద్ మేయర్‌గా ఉన్న తన కూతురు రాజకీయం కోసం పార్టీ మారారు. ప్రత్యక్ష ఎన్నికలలో ఎన్నడూ గెలవని కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా మూడుసార్లు రావడానికి కేసీఆర్ కారకుడు. అయినా రాజకీయలలో కృతజ్ఞతకు తావులేదని కేకే రుజువు చేశారు.
ఇలాంటి వాళ్లను కేసీఆర్ పక్కన పెట్టుకుని రాజకీయం చేశారు తప్ప పార్టీ నిర్మాణానికి గట్టి పునాది వేసుకోలేకపోయారు. మరో ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయన కుమార్తెకు వరంగల్ నుంచి ఎంపీగా పోటీకి బీఆర్‌ఎస్ టిక్కెట్ వచ్చినా, వద్దనుకుని కాంగ్రెస్‌లోకి వెళుతున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా కడియం అప్పుడప్పుడు చంద్రబాబుతో కూడా బెదిరింపు రాజకీయమే చేశారని ప్రచారం ఉంది. కొంతకాలం ఆగినా, తదుపరి టీఆర్ఎస్‌కు వెళ్లిపోయారు. అక్కడ పదవులుపొందినా, తనకు కొంతకాలం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా, తదుపరి మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో ఉండవచ్చు. తన కుమార్తెకు కాంగ్రెస్ టిక్కెట్ రావాలంటే తాను కూడా పార్టీ మారాలి. ఈ నేపద్యంలో నైతిక విలువల గురించి మాట్లాడుకోవడం గొంగట్లో వెంట్రుకలు ఏరుకున్నట్లే ఉంటుంది.
రేవంత్ ఇలా బీఆర్‌ఎస్ నేతలను ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్‌లో తన సొంత గ్రూపును బలపరచుకోవడం కూడా ఒక లక్ష్యం అనుకోవచ్చు. స్థూలంగా చూసినప్పుడు ఫిరాయింపులకు రాజముద్ర వేసిన కేసీఆర్ చివరికి ప్రజల చేతిలో ఓడిపోక తప్పలేదు. అలాగే ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బాగుపడిందీ లేదు. ఆయన కూడా ప్రభుత్వాన్ని కోల్పోయారు. ఈ అనుభవాలు ఉన్నా రేవంత్ తన రాజకీయం తనది అంటున్నారు. బహుశా ఆయన ఉద్దేశం ఈ ఐదేళ్లు సేఫ్‌గా ఉండాలని అనుకోవచ్చు. ఈలోగా బీఆర్‌ఎస్ బాగా బలహీనపడితే అది తనకు అడ్వాంటేజ్‌గా మారుతుందని భావిస్తుండవచ్చు.
బీజేపీ కూడా ఇలాంటి ఫిరాయింపు రాజకీయాలను ఆయా రాష్ట్రాలలో అమలు చేసింది. కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి, వారితో రాజీనామా చేయించి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని తన చేతిలో తెచ్చుకుని ఉప ఎన్నికలలో వారిని గెలిపించుకుంది. అయినా కర్నాటకలో సాధారణ ఎన్నికలలో ఓటమి తప్పలేదు. మధ్యప్రదేశ్‌లో మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బ తగలలేదు. మళ్లీ గెలవగలిగింది.
ఉమ్మడి ఏపీలో పార్టీ ఫిరాయింపులు చాలానే జరిగాయి. 1978లో కాంగ్రెస్-ఐకి 180 సీట్లు వచ్చి అధికారం సాధించింది. కాంగ్రెస్-ఆర్కు 30, జనతా పార్టీకి అరవై సీట్లు వస్తే ఈ రెండు పార్టీలకు చెందిన సుమారు ఎనభై ఐదు మంది అధికార కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. అప్పట్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం లేదు. ఆ తర్వాత కాలంలో ఈ చట్టం వచ్చినా ఫిరాయింపులు ఏమీ ఆగలేదు. దేశ వ్యాప్తంగా ఈ సమస్య పోవడం లేదు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీల చీలిక ఒక ఉదాహరణ అవుతుంది. మరో సంగతి చెప్పాలి. విభజిత ఏపీలో పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు తప్ప అంతా 2019 ఎన్నికలలో ఓడిపోయారు. ప్రజలు ఈ రకమైన తీర్పు ఇస్తారన్న భయం ఉంటే పార్టీలు మారేవారు సంకోచిస్తారు. అధికార పక్షం కూడా కాస్త ఆలోచన చేస్తుంది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయడానికి నానా పాట్లు పడుతోంది. ఈ నేపధ్యంలో ఎప్పుడు ఏ గండం వస్తుందో అన్న సందేహం కాంగ్రెస్‌లో ఉండవచ్చు. అందుకే ముందస్తుగా రేవంత్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకోవచ్చు. వీటిని గట్టిగా బీఆర్‌ఎస్ ఎదిరించే పరిస్థితి లేదు. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అన్న సమాధానం వారికి వస్తుంది. అంతకుముందు పార్టీ మారివారిని ఉరివేయాలని కాంగ్రెస్ నేతలు అన్నా, ఇప్పుడు అవన్ని మర్చిపోతారు. ఎందుకంటే ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వారు ప్రజాస్వామ్యానికి ఉరి వేస్తున్నారు కనుక.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment