
గ్రామీణ ప్రజలు, రైతాంగానికి అంకితం: బాబు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం సాధించిన విజయాన్ని గ్రామీణ ప్రజలు, రైతాంగానికి అంకితమిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీకి విజయాన్ని అందించిన గ్రామీణ ప్రజలు, రైతాంగానికి, నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీపై వారు చూపిన ఆదరణ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలోని మండల పరిషత్‌లలో 20 శాతం గెలవటం టీడీపీ వెంట అక్కడి ప్రజలు, కార్యకర్తలు ఉన్నారనేందుకు నిదర్శమన్నారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్, తెచ్చామని టీఆర్‌ఎస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాయని విమర్శించారు. తమ పార్టీపై దుష్ర్పచారం చేసి లబ్ధి పొందాలని చూసిన వైఎస్సార్‌సీపీ ఈ ఫలితాలతో ఖంగుతిన్నదన్నారు.