
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మొదలైంది. మూడేళ్ల తర్వాత బదిలీలు చేపట్టడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. బదిలీలను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించడంపై ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా విద్యా శాఖ మాత్రం ఆన్‌లైన్‌వైపే మొగ్గు చూపింది. ఈ మేరకు జీవో ఎంఎస్ 16 జారీ చేసింది. బదిలీకి 2018 మే 31ని కటాఫ్ తేదీగా నిర్ణయించింది.
ఉపాధ్యాయులు http:// transfers. cdse. telangana. gov. in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి బదిలీకి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి. ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీకి అర్హులు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న జీహెచ్‌ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. పదవీ విరమణకు రెండేళ్లలోపు సమయం ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది.
బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న 50 ఏళ్ల లోపు పురుష ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. బాలికోన్నత పాఠశాలలో పనిచేయడానికి మహిళా ఉపాధ్యాయులు లభ్యమవకపోతే 50 ఏళ్లకు పైబడిన పురుష ఉపాధ్యాయులకు బదిలీకి అవకాశమిస్తారు. ఎన్‌సీసీ అధికారులుగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్ణీత సర్వీసు ఓ పాఠశాలలో పూర్తయితే మరో ఎన్‌సీసీ పాఠశాలకు బదిలీ చేయాలి.
బదిలీకి అర్హత పాయింట్లు ఇలా..
నాలుగో కేటగిరీ పాఠశాలలో పనిచేసే టీచర్‌కు (12 శాతం ఇంటి అద్దె పొందుతూ ఎలాంటి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు) ఏటా 5 పాయింట్లు (ప్రతి నెల సర్వీసుకు 0.416 పాయింట్లు) ఇస్తారు. మూడో కేటగిరి పాఠశాల టీచర్‌కు (12 శాతం అద్దె పొందుతూ రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలు) ఏటా 3 పాయింట్లు (నెలకు 0.25 పాయింట్లు) ఇస్తారు. రెండో కేటగిరి పాఠశాల టీచర్‌కు (14.5 శాతం ఇంటి అద్దె పొందే పట్టణాలు, శివారు గ్రామాలు) ఏటా 2 పాయింట్లు, మొదటి కేటగిరీ పాఠశాలల్లో (20% ఆపైన హెచ్‌ఆర్‌ఏ పొందే పట్టణాలు, శివారు గ్రామాలు) పనిచేసే టీచర్‌కు ఏటా ఒక పాయింట్ ఇస్తారు.
నాలుగో కేటగిరీ ప్రాంతాలను జిల్లా కలెక్టర్లు ప్రకటిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆన్ డ్యూటీ సౌకర్యం ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు, గుర్తింపు పొందిన సంఘాల రాష్ట్ర, ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుకు 10 పాయింట్లు ఇస్తారు. అవివాహిత మహిళలు, భార్యా భర్తల్లో ఒకరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే 10 పాయింట్లు కేటాయిస్తారు. ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లకు, ఇతర టీచర్లు ఎనిమిదేళ్లకు ఒకసారే ఈ పాయింట్లు వాడుకోవాలి. పదో తరగతిలో 100 శాతం ఫలితాలకు 2.5 పాయింట్లు, 95 శాతం పైబడితే 2 పాయింట్లు, 90 నుండి 94 శాతం వరకు ఒక పాయింట్ ఇస్తారు.
ప్రాధాన్యత కేటగిరీలు
వికలాంగులు (70 శాతం పైబడిన), వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, ఉద్యోగి లేదా జీవిత భాగస్వామి కేన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, బోన్ టీబీ, కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి రోగాల పీడితులుంటే ప్రాధాన్యత కేటగిరీ కింద పరిగణిస్తారు. అలాగే మానసిక వైకల్యం, బ్లడ్ కేన్సర్, గుండెకు రంధ్రం, జువైనల్ డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడే పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు ప్రాధాన్యత కేటగిరీలోకి వస్తారు.
బదిలీల నిర్వహణకు కమిటీలు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీలకు జోనల్ స్థాయిలో డైరెక్టరేట్ నుంచి నియమించిన సీనియర్ అధికారి చైర్మన్‌గా, ఆర్జేడీ మెంబర్ కన్వీనర్‌గా, సంబంధిత డీఈఓ సభ్యులుగా కమిటీ ఉంటుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల జీహెచ్‌ఎంలకు సంబంధించి జెడ్పీ చైర్‌పర్సన్ చైర్మన్‌గా, కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, జేసీ, జెడ్పీ సీఈఓ సభ్యులుగా ఏర్పడిన కమిటీ బదిలీలు నిర్వహిస్తుంది.
జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరకు కలెక్టర్ చైర్మన్‌గా, జేసీ, సీఈవో సభ్యులుగా, డీఈవో కన్వీనర్‌గా కమిటీ బదిలీలు నిర్వహిస్తుంది. ఒకసారి బదిలీ అయిన తర్వాత మార్చడానికి వీళ్లేదు. తప్పనిసరి బదిలీలో ఉండి బదిలీకి దరఖాస్తు చేయని, వెబ్ ఆప్షన్ ఇచ్చుకోని ఉపాధ్యాయులను మిగిలిపోయిన ఖాళీల్లో బదిలీ చేస్తారు. బదిలీ ఉత్తర్వులన్నీ నోటీసు బోర్డుపై, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
బదిలీ అయిన ఉపాధ్యాయులు కొత్త పాఠశాలలో మరుసటి రోజే చేరాలి. బదిలీలపై అభ్యంతరాలు, ఫిర్యాదులను అప్పీలేట్ అధికారికి 10 నుంచి 15 రోజులల్లోగా సమర్పించాలి. వారు రికార్డులు పరిశీలించి ఉత్తర్వులిస్తారు. బదిలీలకు తప్పుడు సమాచారం సమర్పించిన, నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులు, అధికారులపై సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.
టీచర్ల ప్రాధాన్యత పాయింట్లలో కోత
ఉపాధ్యాయ బదిలీ మార్గదర్శకాల్లో గతంతో పోల్చితే స్వల్ప మార్పులు జరిగాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన టీచర్లకు బదిలీల సమయంలో ప్రోత్సాహకంగా ప్రాధాన్యత పాయింట్లు ఇచ్చేవారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను ఉపాధ్యాయులకు వివరించేందుకు నియమించిన రాష్ట్ర, జిల్లా రిసోర్స్ పర్సన్లకూ ప్రత్యేక పాయింట్లు ఇచ్చేవారు. తాజా మార్గదర్శకాల్లో ఈ పాయింట్లకు ప్రభుత్వం కోత పెట్టింది.
అలాగే ఒకేచోట 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన భార్య, భర్తలు తప్పనిసరి బదిలీ అవనున్నారు. అయితే ఇందులో స్పౌజ్ పాయింట్లు వాడుకునే అంశంపై స్పష్టత లేదు. సాధారణంగా స్పౌజ్ ప్రాధాన్యత పాయింట్లు ఇస్తే భార్య పనిచేసే చోటుకు భర్త, భర్త పనిచేసే చోటుకు భార్య వెళ్లడం సహజం. ఈ సమయంలో ఒకరు స్పౌజ్ పాయింట్లు వాడుకునే అవకాశం ఉంటుంది. తాజా ఉత్తర్వుల్లో దీనిపై స్పష్టత లోపించింది. ఇలాంటి అంశాలపై క్షేత్ర స్థాయిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వం టీచర్ల బదిలీల మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో గురువారం విద్యాశాఖ బదిలీల షెడ్యూల్ ప్రకటించింది. బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులు గురువారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం తేదీలవారీగా చేపట్టే కార్యక్రమాలను విద్యాశాఖ షెడ్యూల్‌లో ప్రకటించింది.
ఆన్‌లైన్‌లో బదిలీలపై అవగాహన కల్పిస్తూనే అభ్యంతరాల స్వీకరణకూ సమయం ఇచ్చింది. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేలా కసరత్తు చేసింది. దరఖాస్తుల స్వీకరణ, సీనియారిటీ జాబితా, ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లు, అభ్యంతరాలు, వెబ్ ఆప్షన్లు, బదిలీ ఉత్తర్వులన్నీ ఆన్‌లైన్ పద్ధతిలోనే జరగనున్నాయి. ఈ నెల 26వ తేదీతో బదిలీల ప్రక్రియ ముగియనుంది.
ఇదీ షెడ్యూల్...
Comments
Please login to add a commentAdd a comment