సాక్షి, కరీంనగర్: టీచర్ల సర్దుబాటు ప్రక్రియ వ్యవహారం జిల్లాలో గందరగోళంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్దుబాటు జరిగిన టీచర్లంతా తమకు అన్యాయం జరిగిందంటూ డీఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కొంత మంది అర్జీలు సమర్పిస్తున్నారు. మరికొంత మంది చోటామోటా నాయకులతో సర్దుబాటును రద్దు చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాల నుంచి విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు 114 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారనే నెపంతో ఆయా పాఠశాలలకు సర్దుబాటు చేసిన ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
సర్దుబాటులో జరిగిన టీచర్ల వ్యవహరంపై మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. చిగురుమామిడి మండలంలో ప్రాథమిక పాఠశాల సుందరగిరి నుంచి ఒక టీచర్‌ను బొల్లోనిపల్లి ప్రాథమిక పాఠశాలకు డిప్యూటేషన్ పెట్టారు. తిరిగి అదే సుందరగిరి ప్రాథమిక పాఠశాలకు లాలయ్యపల్లె ప్రాథమిక పాఠశాల నుంచి టీచర్‌ను డిప్యూటేషన్ పెట్టారు. నిబంధనలు పాటించారా, ఏమైనా కొత్త నిబంధనలు వచ్చాయా అంటే అదేమిలేదు. విద్యార్థులు తక్కువ ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే విద్యార్థులు ఎక్కువ ఉండి ఉపాధ్యాయులు తక్కువ ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలి. పై సర్దుబాటు విషయంలో మండల విద్యాధికారి నిబంధనలు పాటించకుండా పై అధికారులకు తప్పుడుగా పంపించడం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కూడా చూసీచూడనట్లుగా ఉత్తర్వులు జారీ చేయడం ఇంకా ఈ ఉత్తర్వులను కలెక్టర్ ఆమోదం పొందడం విడ్డూరంగా ఉంది. అధికారులు ఇలాంటి తప్పిదాలను వెంటనే సరి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
టీచర్స్ సర్దుబాటు జాబితా పరిశీలిస్తే చాలా పొరపాట్లు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. గంగాధర మండలంలో ప్రాథమికోన్నత పాఠశాల కొండన్నపల్లి నుంచి ఒక టీచరు అవసరం లేకున్నా కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగాధరకు ఉపనియుక్తం చేశారు. మండలంలో చాలా ప్రాథమిక పాఠశాలలకు ఎస్‌జీటీలు అవసరం ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేయడమేమిటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రామడుగు మండలంలో ప్రాథమిక పాఠశాల చిప్పకుర్తి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామడుగుకు ఎస్‌జీటీ టీచరును డిప్యూటేషన్ చేశారు. ఉన్నత పాఠశాల రామడుగులో అన్ని పోస్టులు ఉన్నాయి. కేవలం హెడ్‌మాస్టర్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉన్నది. మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్న స్థానంలో ఒక టీచర్‌ను అదనంగా ఇచ్చినట్లయితే జిల్లా అంతటా కూడా హెడ్మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నచోట ఒక టీచర్‌ను సర్దుబాటులో ఎందుకు ఇవ్వలేదు.
టీచర్ల సర్దుబాటు విషయంలో మండల విద్యాధికారులు జిల్లా విద్యాధికారికి సరైన వివరాలు అందించలేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎక్కువగా ఉన్న పోస్టులను గుర్తించక సర్దుబాటు వివరాలు పంపారు. రామడుగు మండలం తిర్మలాపూర్ నుంచి ఒక స్కూల్ అసిస్టెంట్‌ను జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ హైస్కూల్‌లో సర్దుబాటు చేశారు. అదే మండలంలోని తిర్మలాపూర్ హైస్కూల్ నుంచి ఒక ఉపాధ్యాయుడిని చిగురుమామిడి మండలం రామంచకు సర్దుబాటు చేయడంపై కూడా అనుమానాలు తావిస్తున్నాయి.
మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో 400 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. అక్కడే పనిచేసే తెలుగు పండిట్ ఉపాధ్యాయుడిని మానకొండూర్ మండల కేంద్రంలోని హైస్కూల్‌లో ముగ్గురు తెలుగు పండిట్లు ఉన్నా మరో తెలుగు పండిట్‌ను సర్దుబాటు చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు నివ్వెరపోతున్నారు. ఒక హైస్కూల్‌లో రెండు మీడియంలో నడుస్తున్నప్పటికీ అక్కడ ఒకే సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లు ముగ్గురు, నలుగురు ఉన్న సందర్భంలో వారిని సర్దుబాటు చేయడాన్ని అధికారులు విస్మరించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ గందరగోళంగా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment