మేలో టీచర్ల బదిలీలు? | Teachers Transfers in May month in Telangana | Sakshi
Sakshi News home page

మేలో టీచర్ల బదిలీలు?

Published Sat, Mar 31 2018 1:04 AM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM

Teachers Transfers in May month in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 1.30 లక్షల మంది టీచర్ల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం అంగీకరిస్తే మే నెలలోనే బదిలీలు చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఏకీకృత సర్వీసు రూల్స్‌పై స్పష్టత రాని నేపథ్యంలో ఏ యాజమాన్య పరిధిలోని టీచర్లను ఆ యాజమాన్య పరిధిలోనే బదిలీలు చేపట్టనుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించి మూడేళ్లు (2015 జూన్‌/జూలై) కావస్తోంది. ఈ నేపథ్యంలో 54 ఉపాధ్యాయ సంఘాలు ‘జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్స్‌ యూనియన్‌ (జేసీటీయూ)’గా ఏకమై బదిలీల డిమాండ్‌ను లేవనెత్తాయి. ఈసారి కచ్చితంగా టీచర్ల బదిలీలు చేపట్టాలని, ఏకీకృత సర్వీసు రూల్స్‌ను పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని కోరాయి. మరోవైపు ఏడాది కింద కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న పండిట్, పీఈటీ అప్‌గ్రెడేషన్‌ విషయంలో.. వారికి పదోన్నతులు కల్పించి బదిలీలు చేయాల్సి ఉంది. ఇక కొత్తగా రానున్న 8,792 మంది ఉపాధ్యాయులకు జూన్‌/జూలై నెలల్లో పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ముందుగానే టీచర్ల బదిలీలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మేరకు మే నెలలో టీచర్ల బదిలీలను చేపట్టేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది.

వేర్వేరుగానే బదిలీలు
ప్రస్తుతం ఏ మేనేజ్‌మెంట్‌ (ప్రభుత్వ, జిల్లా పరిషత్‌) టీచర్లను ఆ మేనేజ్‌మెంట్‌ పరిధిలోనే బదిలీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అన్ని మేనేజ్‌మెంట్ల టీచర్లను కలిపి సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేసే పరిస్థితి లేదు. ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించినా.. దానిని సవాలు చేస్తూ ప్రభుత్వ టీచర్ల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. విచారణలో ఉన్న ఈ కేసుకు ఇప్పట్లో పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఏ మేనేజ్‌మెంట్‌ వారికి ఆ మేనేజ్‌మెంట్‌ పరిధిలోనే బదిలీలు చేపడితే ఇబ్బందులు ఉండవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పదోన్నతుల అంశాన్ని కూడా కోర్టు కేసు పరిష్కారమయ్యాక చూడవచ్చని భావిస్తున్నారు.

పోస్టింగ్‌ల కోసమైనా బదిలీలు చేపట్టాల్సిందే..
రాష్ట్రంలో 8,792 టీచర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించింది. ఫలితాలను ప్రకటించి.. పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. సాధారణంగా విద్యాశాఖలో కొత్తగా టీచర్లుగా చేరే వారికి కేటగిరీ–4 ప్రాంతాల్లో పోస్టింగులు ఇస్తారు. ఈ లెక్కన చూసినా ముందుగా ప్రస్తుతమున్న టీచర్ల బదిలీలు చేపట్టాల్సిందే. లేకపోతే కొత్త వారికి పట్టణ ప్రాంతాల్లో పోస్టింగులు వచ్చి, సీనియర్‌ టీచర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు సీనియర్‌ టీచర్లు అంగీకరించరు. కాబట్టి కొత్తవారికి పోస్టింగులు ఇవ్వడానికి ముందే.. బదిలీలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది.

ఆందోళనకు సిద్ధమైన ఉపాధ్యాయులు
బదిలీలు చేపట్టాలంటూ ఇప్పటికే టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల జాయింట్‌ కౌన్సిల్‌ తమ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ను బహిష్కరిస్తామని కూడా ప్రకటించింది. దీంతో ఒకట్రెండు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలతో భేటీకానున్నట్టు సమాచారం. ఆ సమావేశంలో బదిలీల అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. 

పాత జిల్లాల ప్రకారమే బదిలీలకు మొగ్గు!
టీచర్ల బదిలీని పాత జిల్లాల ప్రకారమే చేపట్టే అవకాశముంది. కొత్త జిల్లాలు ఏర్పాటైనా.. పాత జిల్లాల ప్రకారమే బదిలీలు చేపడతామని ప్రభుత్వం అప్పట్లోనే ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చింది. దీంతో పాత జిల్లాల ప్రకారమే బదిలీలు ఉండే అవకాశముంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ ప్రాంతానికి చెందిన ఒకరు గతంలో భూపాలపల్లి జిల్లాలో టీచర్‌గా నియమితులయ్యారు. కొత్త జిల్లాల ప్రకారం చూస్తే.. ఆ టీచర్‌ ఇటీవల ఏర్పాటైన తన కొత్త జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఒకసారి పాత జిల్లాల ప్రకారం బదిలీలు చేస్తే.. అలాంటి వారందరికీ ఉపశమనం కల్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement