మా ఊళ్లో మా రాజ్యం | Telangana Adivasis Serve Notice On Self Rule | Sakshi
Sakshi News home page

మా ఊళ్లో మా రాజ్యం

Published Fri, Jun 1 2018 1:15 AM | Last Updated on Fri, Jun 1 2018 1:15 AM

Telangana Adivasis Serve Notice On Self Rule - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ఆదిలాబాద్‌ : మావ నాటే.. మావ రాజ్‌ (మా ఊళ్లో మా రాజ్యం) అనే నినాదంతో ఆదివాసీలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి గూడేల్లో స్వయం పాలనను ప్రకటించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో ముందుకు కదులుతున్నారు. స్వయంపాలనలో భాగంగా లంబాడా అధికారులను గూడేల్లోకి రానివ్వబోమని హెచ్చరిస్తున్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషితో ఆదివాసీ పోరాట సమితి అధ్యక్షుడు సోయం బాపురావు ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు సచివాలయంలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆదివాసీ నేతలు స్వయం పాలనకు పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ గత ఏడాది డిసెంబర్‌లో ఆదివాసీలు చేపట్టిన ఉద్యమం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. 

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఉద్యమం సాగింది. గత డిసెంబర్‌ 15న ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఘర్షణల తర్వాత ప్రభుత్వం ఇరు వర్గాలను చర్చలకు ఆహ్వానించింది. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్పీ సింగ్‌తోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాలో పర్యటించి ఆదివాసీలు, లంబాడాలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా జనవరి 4న ఆదివాసీలు ప్రభుత్వానికి మెమొరాండం అందజేశారు. డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జూన్‌ 1 నుంచి స్వయంపాలనకు వెళ్తామని హెచ్చరించారు. డిసెంబర్‌ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఘర్షణలు సద్దుమణిగినప్పటికీ ఆదివాసీలు ఉద్యమాన్ని శాంతియుతంగానే నిర్వహిస్తూ వచ్చారు. తుడుందెబ్బ నాయకులు చెప్పినట్లు శుక్రవారం నుంచి ఆదివాసీ గూడేల్లో స్వయం పాలన ప్రారంభించాల్సి ఉండగా, ఒకరోజు ముందు గురువారం ప్రభుత్వం చర్చలకు పిలిచింది.  

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. 
శైలేంద్రకుమార్‌ జోషితో చర్చల సందర్భంగా సమితి ప్రతినిధులు తమ డిమాండ్లను సీఎస్‌ ముందుంచారు. ఎస్టీ(షెడ్యూల్డ్‌ తెగలు) జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 342 ప్రకారం 9 తెగలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చారని, కానీ 1976 తర్వాత వలస మార్గంలో వచ్చిన లంబాడీలు అక్రమంగా ఎస్టీల్లో చేరారన్నారు. ఎలాంటి కమిషన్‌ వేయకుండా వారిని ఎస్టీ జాబితాలో చేర్చడంతో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. అలాగే ఏజెన్సీ ధ్రువీకరణ పొందిన వేలాది లంబాడా యువత ఆదివాసీల ఉద్యోగాలను తన్నుకుపోయినట్లు స్పష్టంచేశారు. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తేనే న్యాయం జరుగుతుందని సీఎస్‌కు ఏకరువు పెట్టారు. దీనిపై జోషి స్పందిస్తూ.. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించడం తమ పరిధిలో లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరిస్తానని సమితి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అయితే ప్రధాన డిమాండ్‌పై స్పష్టత రాకపోవడంతో చర్చల ప్రసక్తే లేదంటూ సమితి ప్రతినిధులు సీఎస్‌ చాంబర్‌ నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. 

ఇక స్వయం పాలనే: సోయం బాపురావు 
ప్రభుత్వంతో చర్చల అనంతరం బాపురావు మీడియాతో మాట్లాడారు. చర్చలు సఫలీకృతం కానందున తమ కార్యచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వయం పాలనకు పిలుపునిచ్చారు. మా ఊరు– మా రాజ్యం పేరుతో ముందుకెళ్తామన్నారు. రాష్ట్రానికి వలసలుగా వచ్చి ఇక్కడ ఎస్టీ జాబితాలో దొడ్డిదారిన చేరిన లంబాడీలు ఆదివాసీల హక్కులను పూర్తిగా హరించారన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేదాక ఉద్యమం ఆపేదిలేదన్నారు. జూన్‌ 2న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న లంబాడా అధికారుల విధులను అడ్డుకుంటామన్నారు. మహారాష్ట్రలో బీసీలుగా ఉన్న లంబాడీలు మధ్యప్రదేశ్‌లో ఓసీ కేటగిరీలో ఉన్నట్లు చెప్పారు. అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీలుగా, రాజస్థాన్‌ ఓసీలుగా చలామణి అవుతున్నారని, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎస్టీలుగా ఉన్నట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement