
ఔకే రెడ్డి, జోగు రామన్న, బాల్క సుమన్, రేఖానాయక్, కోనేరు కొనప్ప, నడిపెల్లి దివాకర్‌రావు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు దాటిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని కొలువు దీర్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సన్నద్ధమయ్యారు. శాసనసభలో కీలకమైన ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎంకు చెందిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలతో గురువారం ఆయన లాంఛనంగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి మహమూద్ అలీ మాత్రమే ప్రస్తుతం కేబినెట్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 18న మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే వెల్లడించారు.
మంత్రి వర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మంది సభ్యులు ఉండేందుకు వీలున్న పరిస్థితుల్లో విస్తరణలో ఎందరికి అవకాశం దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. పరిమిత సంఖ్యలోనే మంత్రులను నియమించి, మరికొం దరికి పార్లమెంటరీ కార్యదర్శి పదవులు కట్టబెడతారని, కొత్తగా ఏర్పాటైన ప్రతీ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్ స్థాయి హోదా దక్కనుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు, మరో ఇద్దరికి పార్లమెంటరీ కా ర్యదర్శి లేదా ఇతర కేబినెట్ హోదాలో ఓ పదవి రావచ్చు. ఆ పదవులు సైతం 18వ తేదీనే లభిస్తాయా..ఇంకొంత కాలం వేచిచూడాలా అనేది సస్పెన్స్.
ఐకే రెడ్డికి మంత్రి పదవా.. స్పీకర్ హోదానా?
2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచి, టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకొని నాలుగేళ్లకుపైగా వివాదరహిత కేబినెట్ మంత్రిగా సేవలందించిన సీనియర్ నేత అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డికి మరోసారి ఉన్నత పదవి దక్కడం ఖాయమని తేలిపోయింది. కీలకమైన మంత్రి పదవి ఆశిస్తున్న ఐకే రెడ్డికి స్పీకర్ పదవిని కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఉన్నత విద్యావంతుడు, న్యాయశాఖ మంత్రిగా, ఎంపీగా, జెడ్పీ చైర్మన్‌గా పలు కీలక పదవులు నిర్వహించిన ఐకే రెడ్డి స్పీకర్‌గా న్యాయం చేస్తారని ఆయన భావిస్తున్నారు. అయితే స్పీకర్ పదవి నిర్వహించిన వారు తరువాత ఎన్నికల్లో ‘ఓటమి’ పాలవుతారనే సెంటిమెంట్ ప్రచారంలో ఉండడంతో ఐకే రెడ్డి ఆ పదవికి అంగీకరిస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ స్పీకర్‌గా కొనసాగేందుకు ఐకే రెడ్డి ఒప్పుకోకపోయినా.. ఐకే రెడ్డితో ముఖ్యమంత్రికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా రాష్ట్రంలో కీలకమైన మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరో అవకాశంకోసం రామన్న..
ఆదిలాబాద్ చరిత్రలో వరుసగా మూడుసార్లు గెలిచిన జోగు రామన్న గత కేబినెట్‌లో పూర్తికాలం మంత్రిగా పనిచేశారు. మంత్రిగా తొలుత కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా..తరువాత ముఖ్య మంత్రి నుంచి మంచి మార్కులు సంపాదించా రు. ఉమ్మడి జిల్లాలో బలమైన మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన ఏకైక బీసీ ఎమ్మెల్యే ఆ యనే కావడం కలిసివచ్చే అంశం. ఉత్తర తెలం గాణ నుంచి ఇదే సామాజిక వర్గానికి చెందిన ఎ మ్మెల్యేకు మంత్రివర్గంలో అవకాశం లభిస్తే రామన్నకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. నిజా మాబాద్, కరీంనగర్ నుంచి ఈ వర్గం ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవిని ఆశిస్తుండడం గమనార్హం.
తూర్పు జిల్లా నుంచి సుమన్!
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న యువ నాయకుడు బాల్క సుమన్ ఎంపీగా కొనసాగుతూనే అనూహ్య పరిస్థితుల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆయనను గెలిపిస్తే ఉన్నతస్థానం కల్పిస్తానని మందమర్రి ఎన్నికల ప్రచార సభలోనే కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తూర్పు ఆదిలాబాద్ పరిధిలోని మంచిర్యాల జిల్లా నుంచి సుమన్‌కు కేబినెట్‌లో అవకాశం లభించే అవకాశం ఉంది. అయితే పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ఈశ్వర్ సామాజిక వర్గానికే చెందిన సుమన్‌కు కూడా ఒకే లోక్‌సభ పరిధిలో మంత్రి పదవి ఇస్తారా? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
ఈశ్వర్‌కు స్పీకర్ హోదా ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సుమన్‌కు మంత్రి పదవి లభిస్తుందా..? లేక కేబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్, విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవుల్లో మరేదైనా ఉంటుందా అని టీఆర్‌ఎస్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఏదేమైనా సుమన్‌కు కేబినెట్ హోదా మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఈ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సైతం నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా..ఉత్తర తెలంగాణలో ఆయన సామాజిక వర్గం నుంచి గట్టి పోటీ నెలకొనడంతో ఇబ్బందిగా మారింది. కుమురంభీం జిల్లా నుంచి సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈసారి ‘కమ్మ’ కోటాపై కన్నేశారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర్ రావు ఓడిపోగా, సీనియర్ ఎమ్మెల్యేగా తనకు ఆ సామాజికవర్గం కోటాలో అవకాశం ఇవ్వాలని లాబీయింగ్ చేస్తున్నారు.
ఎస్టీ, మహిళా కోటాపై రేఖానాయక్ ఆశలు
నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించిన ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన రేఖానాయక్ తనకీసారి కేబినెట్ హోదా ఖాయమనే ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలోనే టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు ముగ్గురు కాగా, ఎస్టీ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే రేఖానాయక్. గతంలోనే మహిళ లేకుండా కేబినెట్ కొనసాగించారనే అపప్రద ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి మహిళా మంత్రి తప్పనిసరి అని స్పష్టమైంది. ఎస్టీ వర్గం నుంచి గతంలో మంత్రిగా ఉన్న చందూలాల్ ఈసారి అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. ఈ నేపథ్యంలో రేఖానాయక్‌కు అవకాశం ఇస్తే ఎస్టీతోపాటు మహిళా కోటాలో మంత్రి పదవి భర్తీ చేసినట్లవుతుంది.
కొసమెరుపు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే మంత్రిపదవులు దక్కుతాయి. సీనియర్లు ఆశిస్తున్నా.. డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఒకటి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌కు మరోటి మంత్రి పదవి ఇచ్చి, మరో రెండు పదవులు పార్లమెంటరీ సెక్రెటరీ లేదా ఇతర కేబినెట్ హోదాలో మాత్రమే దక్కే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment