సర్వీస్ ట్యాక్స్ బకాయిలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మద్యం వ్యాపారంపై సర్వీస్ ట్యాక్స్ బకాయిలు చెల్లించాల్సిందిగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగం నోటీసులు జారీ చేసింది. 2010-11 నుంచి 2013-14 వరకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లు, రిటైల్ షాపులకు అమ్మకాలు, బాట్లింగ్ తదితర సేవలకు గాను కేంద్రానికి సుమారు రూ. వెయ్యి కోట్ల వరకు పన్ను చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ పన్నుకు సంబంధించిన పూర్తి వివరాలు, చెల్లింపులకు సంబంధించి గతంలో జరిగిన లావాదేవీలు తమకు అందజేయాలని కస్టమ్స్ హైదరాబాద్ శాఖ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు నోటీసులిచ్చింది. ఈ నెల 4న కస్టమ్స్ కమిషనర్ ముందు హాజరవ్వాలని ఆదేశించింది.
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ విభజన తర్వాతే: ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రభు త్వంతో చర్చలు జరిపారు. కార్పొరేషన్ చేసే వ్యాపారం, ఏయే రంగాల్లో సేవలు అందిస్తున్నారు, వసూలు చేసే పన్నుల వివరాలపై వివరణివ్వాలని నిర్ణయించారు. అలాగే విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజన పూర్తి కాలేదని, అప్పటి వరకు గతంలో జరిగిన వ్యాపారంపై విధించే సర్వీస్ ట్యాక్స్‌లో తెలంగాణ వాటా ఎంతో తెలియదని కమిషనర్‌కు తెలియజేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన టీఎస్‌బీసీఎల్‌కు సర్వీస్ ట్యాక్స్ పాత బకాయిలకు సంబంధం లేదని కూడా వివరించాలని భావిస్తున్నారు. ఈ విషయమై టీఎస్‌బీసీఎల్ జీఎం సంతోష్ రెడ్డి వివరణ కోరగా, టీఎస్‌బీసీఎల్ చేస్తున్న వ్యాపారాల వివరాల కోసం ప్రాథమిక విచారణ హాజరుకు మాత్రమే సమన్లు జారీ చేశారన్నారు. టీఎస్‌బీఎసీఎల్ చేస్తున్న వ్యాపారంలో ఏయే సేవలకు పన్ను చెల్లించాలో, పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందో లేదో తేలిన తరువాతే బకాయిల అంశం ఉత్పన్నమవుతుందన్నారు.
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు కస్టమ్స్ నోటీసులు
Published Sun, Aug 2 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM
Advertisement
Advertisement