Telangana Beverages Corporation
-
తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: పండుగ ముందర మద్యం ప్రియులకు చేదు వార్త. తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్(TSBCL)కు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(యూబీ)ప్రకటించింది. దీంతో ఆ సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చే కింగ్‌ఫిషర్(King Fisher), హెనికిన్ బీర్ల సరఫరా ఆగిపోనుంది. తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్ నుంచి తమకు రూ.900 కోట్లు బకాయి ఉందని, పైగా 2019 నుంచి ధరలను సవరించకపోవడంతోనే యూబీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు సెబీకి లేఖ ద్వారా తెలిపింది.కాగా, రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడయే బీర్ బ్రాండ్ కింగ్‌షిషరే. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ యూబీ సంస్థకు ప్రతి 45 రోజులకోసారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా, నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లపై 35 శాతం రేట్లు పెంచాలని బేవరేజ్ కార్పొరేషన్‌ను యునైటెడ్ బ్రూవరీస్ కోరింది. యునైటెడ్ బేవరేజస్ ప్రతిపాదనలపై గతంలోనే కమిటీని ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ జడ్జిలతో వేసిన కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. యునైటెడ్ బేవరేజస్ ప్రతిపాదనలతో మందు బాబులపై ఆర్థిక భారం పెరగనుంది. మద్యం ప్రియులపై భారం పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: ఫ్యూచర్ సిటీ.. పోలీసుల పోటీ! -
బుస్సుమన్న బీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రతి 650 ఎంఎల్ సీసాపై కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.20 చొప్పున పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలో సింహ భాగాన్ని బ్రూవరీల యాజమాన్యాలకే ఇవ్వనున్నారు. ఈ ఉత్తర్వులు వెలువడేందుకు ముందే టీఎస్‌బీసీఏ డిపోల నుంచి స్టాక్ తీసుకున్న మద్యం వ్యాపారులు పాత ధరకే బీర్లు విక్రయించాలని, కొత్త ధరకు విక్రయిస్తే ఎమ్మార్పీ ఉల్లంఘన కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా బీర్ల ధరలు పెంచలేదని, బీరు ఉత్పత్తిలో ఉపయోగించే మాల్ట్, ఫ్లేవర్స్, ఇతర ముడి పదార్థాల రేట్లు భారీగా పెరిగిపోవటంతో నష్టపోతు న్నామని, కనీసం ఈసారైనా సీసా బేసిక్ ధరపై 20 శాతం అదనంగా పెంచాలని బ్రూవరీలు డిమాండ్ చేస్తున్నాయి. కంపెనీ యాజమాన్యాల డిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలు పెంచింది. మొత్తం 186 రకాల బ్రాండ్లు సాధారణంగా ఏడాది కాలానికి బీర్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. గతేడాది కుదుర్చుకున్న ఒప్పందం ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియ కసరత్తు చేపట్టింది. టెండర్ల ఖరారుతోపాటు బీర్ల బేసిక్ ధర నిర్ణయించేందుకు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ వేసింది. జనవరి మాసంలో టెండర్లు ఆహ్వానించగా.. మొత్తం 186 రకాల బ్రాండ్లను సరఫరా చేయడానికి కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. వీటిలో 66 బ్రాండ్లు ఇప్పటికే వినియోగంలో ఉండగా.. కొత్తగా 120 బ్రాండ్లకు టెండర్లు దాఖలయ్యాయి. కంపెనీల యాజమాన్యంతో సంప్రదింపులు జరిపిన జస్టిస్ గోపాల్‌రెడ్డి కమిటీ.. బేసిక్ ధరపై 10 శాతం అదనంగా పెంచాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ఇక్కడే ఉత్పత్తి అంతర్జాతీయ బ్రాండ్లు అంటే విదేశాల్లోనే తయారు చేసిన మద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయించాలన్న నిబంధన ఏమీ లేదు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం పేటెంట్ పొందిన బీరు తయారీ ఫార్ములాతో స్థానికంగా అందుబాటులో ఉన్న బ్రూవరీల్లో వారి బ్రాండ్ బీరును ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 బ్రూవరీలతో (బీర్ల తయారీ పరిశ్రమలు) పలు అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందం చేసుకొని బీర్లు ఉత్పత్తి చేశాయి. ఈ సారి టెండర్లలో సోన్ డిస్టిలరీస్, బ్రూవరీస్ మధ్యప్రదేశ్, ఎస్ఎన్జే డిస్టిలరీస్ నెల్లూరు, ఎస్పీఆర్ డిస్టిలరీస్ మైసూర్, ప్రివిలేజ్ ఇండస్ట్రీస్ పుణే, హరియాణా బ్రూవరీస్, సోన బ్రూవరేజెస్ ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. అలాగే రాష్ట్రీయ మార్కెట్లో పెద్ద వాటాదారుగా ఉన్న యూబీ (యునైటెడ్ బ్రూవరేజెస్) మైసూర్, ఔరంగాబాద్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి ఈసారి కొత్తగా టెండర్లు దాఖలయ్యాయి. -
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు కస్టమ్స్ నోటీసులు
సర్వీస్ ట్యాక్స్ బకాయిలపై వివరణ ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మద్యం వ్యాపారంపై సర్వీస్ ట్యాక్స్ బకాయిలు చెల్లించాల్సిందిగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగం నోటీసులు జారీ చేసింది. 2010-11 నుంచి 2013-14 వరకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లు, రిటైల్ షాపులకు అమ్మకాలు, బాట్లింగ్ తదితర సేవలకు గాను కేంద్రానికి సుమారు రూ. వెయ్యి కోట్ల వరకు పన్ను చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ పన్నుకు సంబంధించిన పూర్తి వివరాలు, చెల్లింపులకు సంబంధించి గతంలో జరిగిన లావాదేవీలు తమకు అందజేయాలని కస్టమ్స్ హైదరాబాద్ శాఖ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు నోటీసులిచ్చింది. ఈ నెల 4న కస్టమ్స్ కమిషనర్ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ విభజన తర్వాతే: ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రభు త్వంతో చర్చలు జరిపారు. కార్పొరేషన్ చేసే వ్యాపారం, ఏయే రంగాల్లో సేవలు అందిస్తున్నారు, వసూలు చేసే పన్నుల వివరాలపై వివరణివ్వాలని నిర్ణయించారు. అలాగే విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజన పూర్తి కాలేదని, అప్పటి వరకు గతంలో జరిగిన వ్యాపారంపై విధించే సర్వీస్ ట్యాక్స్‌లో తెలంగాణ వాటా ఎంతో తెలియదని కమిషనర్‌కు తెలియజేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన టీఎస్‌బీసీఎల్‌కు సర్వీస్ ట్యాక్స్ పాత బకాయిలకు సంబంధం లేదని కూడా వివరించాలని భావిస్తున్నారు. ఈ విషయమై టీఎస్‌బీసీఎల్ జీఎం సంతోష్ రెడ్డి వివరణ కోరగా, టీఎస్‌బీసీఎల్ చేస్తున్న వ్యాపారాల వివరాల కోసం ప్రాథమిక విచారణ హాజరుకు మాత్రమే సమన్లు జారీ చేశారన్నారు. టీఎస్బీఎసీఎల్ చేస్తున్న వ్యాపారంలో ఏయే సేవలకు పన్ను చెల్లించాలో, పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందో లేదో తేలిన తరువాతే బకాయిల అంశం ఉత్పన్నమవుతుందన్నారు. -
‘ఐటీ’పై తీర్పును సవరించండి
* ‘టీఎస్ బీసీఎల్’ అంశంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ * మా నుంచి బకాయిలు వసూలు చేసుకోవచ్చని తీర్పులో పేర్కొన్నారు * పొరపాటుగా పేర్కొంటే ఐటీశాఖ రూ.1,274 కోట్లు తీసేసుకుంది * ఆ వ్యాజ్యంలో మేం ప్రతివాది కాదు.. మా వాదనలూ వినలేదని వెల్లడి * నోటీసులివ్వకుండానే నిధులు తీసుకున్న వైనంపై కోర్టు ధిక్కార పిటిషన్ * కౌంటర్లు దాఖలు చేయాలని ఐటీశాఖకు ధర్మాసనం ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) ఆస్తుల జప్తుకోసం ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఇచ్చిన నోటీసులను కొట్టివేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సవరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రతివాది కాదని, అయినా ప్రభుత్వం నుంచి ఐటీశాఖ బకాయిలు వసూలు చేసుకోవచ్చంటూ ఆ తీర్పులో పేర్కొన్నారని తెలిపింది. ధర్మాసనం పొరపాటుగా పేర్కొన్న ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఐటీశాఖ రిజర్వుబ్యాంకులోని తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి రూ.1,274.21 కోట్లను బకాయిల కింద తీసేసుకుందని, కనీస సమాచారం కూడా ఇవ్వలేదని హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును సవరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదాయపన్ను శాఖను ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం.. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. బకాయిల కింద టీఎస్‌బీసీఎల్ ఆస్తుల జప్తు కోసం ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఇచ్చిన నోటీసులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. దానిపై మే 1న తీర్పునిచ్చిన ధర్మాసనం.. ఐటీ శాఖ నోటీసులను కొట్టివేసిందనితెలిపారు. ఆ వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతివాది కాదని, తమ వాదనలను కూడా వినలేదని.. అయినా తెలంగాణ ప్రభుత్వం నుంచి బకాయిలను వసూలు చేసుకోవచ్చునని తీర్పులో పేర్కొన్నదని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని, దానిని సవరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బకాయిలను వసూలు చేసుకోవచ్చనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే ఆర్బీఐలోని తెలంగాణ ఖాతా నుంచి రూ.1,274 కోట్లను ఐటీ శాఖ తీసేసుకుందని ఏజీ కోర్టుకు విన్నవించారు. అసలు ఐటీ శాఖ పన్ను మదించే నాటికి టీఎస్‌బీసీఎల్ లేనేలేదని... ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) ఆస్తులు, అప్పుల విభజన కూడా పూర్తి కాలేదని తెలిపారు. అయినా తెలంగాణ వంతు బకాయిలు రూ.1,274 కోట్లంటూ ఐటీ శాఖ ఎలా నిర్ణయానికి వచ్చిందో అర్థం కాకుండా ఉందని పేర్కొన్నారు. అది చిన్న మొత్తం కాదు.. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బకాయిలు వసూలు చేసే ముందు నోటీసులు జారీచేశారా. లేదా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వలేదని ఏజీ చెప్పగా, ఇచ్చామని ఐటీ శాఖ తరఫు న్యాయవాది జె.వి.ప్రసాద్ చెప్పారు. దీంతో.. ‘‘మీరు తీసుకున్నది చిన్న మొత్తం కాదు. రూ.1,200 కోట్లు. ఇంత మొత్తం తీసేసుకున్న తరువాత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో? జీతాలు చెల్లించే పరిస్థితి ఉందో, లేదో? మీది (ఐటీశాఖ) కేంద్ర ప్రభుత్వం. వీరిది రాష్ట్ర ప్రభుత్వం. ఇద్దరూ అన్నదమ్ములు. ఇలా తగవుపడుతుంటే ఎలా? ఈ వివాదానికి ఓ సామరస్యపూర్వక పరిష్కారం చూడాల్సిన అవసరముంది. మీ (ఐటీశాఖ) చర్యల ద్వారా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో ఆలోచించారా.. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే. అందులో సందేహం లేదు. అయినా తీర్పులో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అని ఉంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రమే ఎందుకు బకాయిలు వసూలు చేసినట్లు..?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వీటన్నింటినీ సమాధానమిస్తామని, రెండు వారాల గడువు ఇవ్వాలని జె.వి.ప్రసాద్ కోరగా.. విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ధిక్కార పిటిషన్ కూడా.. నోటీసులివ్వకుండానే రిజర్వుబ్యాంకు నుంచి ఐటీశాఖ నిధులు తీసేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 226 ప్రకారం నోటీసు జారీ చేశాకే బకాయిల వసూలు ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఐటీ శాఖ వ్యవహరించిందని అందులో కోర్టుకు నివేదించింది. దీనిపైనా కౌంటర్ దాఖలు చేయాలని ఐటీ శాఖను ధర్మాసనం ఆదేశించింది.