సాక్షి, హైదరాబాద్: బీజేపీకి వచ్చే నాలుగు ఓట్ల కోసం ప్రధాని మోదీ దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. నోరుపెద్దగా ఉందని ఏదిపడితే అది మాట్లాడటం ప్రధాని స్థాయికి తగదని హితవు పలికారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌పై మోదీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ చాలా మాట్లాడారు. కానీ హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పలేకపోయారు. మెట్రో రైలు ఘనత తనదే అన్నట్లు మాట్లాడారు. ఎంఐఎం స్టీరింగ్‌తో ప్రభుత్వం నడుస్తోందని మోదీ ఆరోపించడమేంటి.. ఎంఐఎం మా మిత్రపక్షమని బహిరంగంగానే చెబుతున్నాం’ అని అన్నారు.
‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడింది, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అతి కష్టంగా ఒక్క సీటు గెలిచింది. 2014లో సికింద్రాబాద్‌లో బీజేపీ గెలిచింది. బీసీ నేత అయిన దత్తాత్రేయ ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించడంతో పాటు ఈసారి టికెట్ కూడా నిరాకరించారు’ అని విమర్శించారు. ఈ విషయాలపై మోదీ ఎందుకు మాట్లాడలేదు. అబద్ధాలు మాట్లాడటం ప్రధాని స్థాయికి తగునా అని ప్రశ్నిం చారు. ఉద్యోగాల గురించి మోదీ మాట్లాడుతున్నారు.. ఆయన ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పగలరా అని నిలదీశారు. తెలంగాణలో 75 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. మా రాష్ట్రం లో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.
వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే..
తెలంగాణలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని, కేంద్రంలో బీజేపీకి 150కి మించి సీట్లు రావని, ఇక కాంగ్రెస్ 70 సీట్లు కూడా దాటదన్నారు. కేంద్రంలో ఏర్పాటు అయ్యేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలు, ఎన్నికలు రాగానే బీజేపీకి హిందూత్వ గుర్తుకు వస్తుంది, బీజేపీ నేతలు ఇంట్లో పూజలు కూడా సరిగా చేయరు కానీ, బయట మతం గురించి మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. మోదీ సహా బీజేపీ నేతలు పుల్వామా దాడిని రాజకీయం చేశారన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదంటున్న మోదీ.. మంత్రులను పొగిడిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ అవినీతిలో పుట్టిన పార్టీ అని, రాహుల్ గాంధీ కూడా అవినీతి గురించి మాట్లాడటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అడ్రస్ లేకుండా పోతాయని తలసాని చెప్పారు.
టీఆర్‌ఎస్‌లోకి బీఎన్ రెడ్డి
తెలుగుదేశం ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఇప్పటిదాకా బీఎన్ రెడ్డి తెలుగుదేశం అధికార ప్రతినిధిగా, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment