రాస్తే రామాయణం.. చెప్తే భారతం: లక్ష్మణ్
రాస్తే రామాయణం.. చెప్తే భారతం: లక్ష్మణ్
Published Sun, Jul 23 2017 2:16 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి ఇస్తున్న హామీలు రాస్తే రామాయణం, చెప్తే భారతంలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవ చేశారు. వరంగల్‌లో జరుగుతున్న పార్టీ కార్యవర్గ సమావేశం రెండో రోజు ఆయన మాట్లాడుతూ..భారత ప్రధాని నరేంద్రమోదీని యావత్ ప్రపంచం మరో వివేకానందుడిగా కీర్తిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 106 సంక్షేమ పథకాలపై దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దేశ భవిష్యత్తు కోసం సర్జికల్ స్ర్టైక్స్, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ప్రధాని పై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వాపోయారు.
మంత్రులు, అధికారులపై ఎన్నో అవినీతి ఆరోపణలు వస్తున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. హరితహారంలో నాటే మొక్కల కన్నా ఇచ్చే ఫోజులే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. దళితులపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, సిరిసిల్ల ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే.. భారీ జన సమీకరణతో బీజేపీ నిర్వహింస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Advertisement