సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో నెల రోజుల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జులై 15వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం మంత్రులు తలసాని, పద్మారావు సమీక్ష నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
జులై 29వ తేదిన మహంకాళి అమ్మవారి బోనాలు, 30న రంగం జరగనుంది. రూ. కోటి వ్యయంతో 3.80 కిలోల బంగారంతో అమ్మవారికి బోనం తయారు చేయిస్తామని తలసాని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా జంటనగరాల్లోని 145 ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment