సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్ 14న శాసనసభలో ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 14న అసెంబ్లీ సమావేశాల తొలిరోజున శాసనసభలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం సభను వాయిదా వేస్తారు. తిరిగి సోమవారం 16న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు వారం రోజులపాటు కొనసాగి సెప్టెంబర్ 21న ముగిసే అవకాశం ఉంది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందడం ఆలస్యమయ్యే పక్షంలో మరో రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.
ఉగాండా పర్యటనకు స్పీకర్
శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఉగాండా రాజధాని కంపాలాలో జరిగే కామన్వెల్త్ దేశాల 64వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సుకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెళ్లనున్నారు. 53 కామన్వెల్త్ దేశాల పార్లమెంటరీ స్పీకర్లు పాల్గొనే ఈ సదస్సు సెప్టెంబర్ 21 నుంచి 29 వరకు జరగనుంది. సదస్సులో భాగంగా 25, 26 తేదీల్లో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల సమావేశంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. స్పీకర్ పర్యటనకు సంబంధించిన షెడ్యూలు ఖరారైనా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు ఇంకా కొలిక్కిరావడం లేదు. సెప్టెంబర్ 23వ తేదీలోగా అసెంబ్లీ సమావేశాలు పూర్తికాని పక్షంలో స్పీకర్ ఉగాండా పర్యటన రద్దయ్యే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment