మరో 5 ఎకరాలు ఇస్తాం: సీఎం
రెడ్డి హాస్టల్ శంకుస్థాపన సభలో కేసీఆర్ ప్రకటన
సాక్షి, బుద్వేల్: దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా రెడ్డి హాస్టల్‌ను తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో రెడ్డి హాస్టల్ నిర్మాణ సముదాయానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రెడ్డి హాస్టల్‌కు ఇప్పటికే కేటాయించిన 10 ఎకరాలకు తోడుగా మరో 5 ఎకరాలు కేటాయిస్తామని హామీయిచ్చారు. నారాయణగూడలో బాలికల హాస్టల్‌కు అదనంగా 1500 గజాలు ఇస్తామన్నారు. బుద్వేల్‌లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భారీ ఎడ్యుకేషన్ టవర్ నిర్మించి క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు జరిగేలా చూడాలని కోరారు.
సమైక్య రాష్ట్రంలో మహనీయుల పేర్లు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాయమైన పేర్లన్నింటినీ పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ రెండో వారంలోనే పోలీస్ అకాడమీకి రాజ బహద్దుర్ వెంకట రామారెడ్డి పేరు పెట్టామని తెలిపారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి జయశంకర్ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేంద్రరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.