reddy hostel
-
ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
హైదరాబాద్ : పేద రెడ్ల అభివృద్ధి కోసం ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. రాజా బహద్దూర్ స్ఫూర్తిని కొనసాగించే విధంగా రెడ్డి హాస్టల్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో ఆదివారం సెంటినరీ పైలాన్‌ను ఆవిష్కరించారు. రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్.. రెడ్డి హాస్టల్‌కు 15 ఎకరాల స్థలం, రూ.10 కోట్లను మంజూరు చేశారని చెప్పారు. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి ఓవర్సీస్ ఫండ్ కూడా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజా బహద్దూర్ స్ఫూర్తితో అట్టడుగున ఉన్న రెడ్డి కులస్తులను ఆదుకోవాలని సూచించారు. బుద్వేల్‌లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మంచి విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎడ్ల రఘుపతిరెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి, సొసైటీ కార్యదర్శి కుందవరం వెంకటరెడ్డి, ఉపా«ధ్యక్షుడు పాపారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, డాక్టర్ వసుంధరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అత్యున్నత విద్యావేదికగా రెడ్డి హాస్టల్
⇒ ఐఎస్బీ తరహాలో ఎడ్యుకేషనల్ టవర్స్ నిర్మించండి: ముఖ్యమంత్రి కేసీఆర్ ⇒ క్యాంపస్ రిక్రూట్మెంట్ల కోసం అన్ని కంపెనీలు ఇక్కడికే రావాలి సాక్షి, హైదరాబాద్ ‘‘రెడ్డి హాస్టల్ ప్రాంగణంలో ఐఎస్బీ తరహాలో ఎడ్యుకేషనల్ టవర్స్ నిర్మించాలి. అవి అత్యున్నత విద్యా ప్రమాణాలకు నాంది కావాలి. క్యాంపస్ రిక్రూట్మెంట్ల కోసం అన్ని సంస్థలూ ఇక్కడికే వచ్చేలా చేయాలన్నది నా కోరిక..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి 149వ జయంతి, రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో పదెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న రెడ్డి హాస్టల్ కాంప్లెక్స్ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి పదెకరాల భూమి, రూ.10 కోట్ల నిధులివ్వడం పెద్ద పనేమీ కాదని, అది రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు. నిజాం హయాంలో కొత్వాల్ హోదాలో వెంకట్రామిరెడ్డి సేవాభావం, ముందుచూపుతో ఏర్పాటు చేసిన విద్యాసంస్థలకు ఏమిచ్చినా తక్కువేనని అన్నారు. ఈ విద్యాసంస్థల నుంచి ప్రధాన మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు వెలుగులోకి వచ్చారని, తెలంగాణ విద్యార్థులకెందరికో ఈ విద్యాసంస్థలు ఉపయోగపడ్డాయని చెప్పారు. ‘‘రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి, రావి నారాయణరెడ్డి, ధర్మారెడ్డి, కేవీ రంగారెడ్డి, భాగ్యరెడ్డి వర్మ లాంటి ఎందరో తెలంగాణ వైతాళికుల చరిత్ర సమైక్య రాష్ట్రంలో కనిపించకుండా పోయింది. ఇప్పుడు వారందరి స్ఫూర్తిని మననం చేసుకుని వారి చరిత్రను మనసులో నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం..’’అని అన్నారు. తెలంగాణ వారసత్వ సంపద పునరుజ్జీవానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణకు చెందిన చారిత్రక వ్యక్తుల్లో వెంకట్రామిరెడ్డి ఒకరని, కానీ ఆయన చరిత్రను సమైక్య రాష్ట్రంలో గుర్తించలేదన్నారు. సురవరం ప్రతాపరెడ్డి ఆయన చరిత్రను రాసి ఉండకపోతే ఆయన గురించి ఈ మాత్రం కూడా తెలిసేది కాదని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి వ్యక్తులను తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండో వారంలోనే రాష్ట్ర పోలీస్ అకాడమీకి ఆయన పేరు పెట్టాం. ఉన్నత, సంపన్న కుటుంబం నుంచి వచ్చినా ఆయన పేదల కోసం, అవకాశాలు లేని వారి కోసం తపన పడ్డారు. 14 ఏళ్ల పాటు కొత్వాల్‌గా సుస్థిర సేవలందించిన రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి వంటి వారి చరిత్రను పునరుజ్జీవనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ స్ఫూర్తిని మనసులో నింపుకున్న మంచి రోజుగా ఇది మిగిలిపోతుంది’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరో ఐదెకరాల స్థలం విద్యా సంస్థల నిర్మాణానికి మరింత భూమి కావాలన్న రెడ్డి హాస్టల్ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు మరో ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. అలాగే నారాయణగూడలోని రెడ్డి మహిళా వసతి గృహం నిర్మాణం కోసం పక్కనే ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రాంగణంలో 1,500 గజాల భూమిని కూడా ఇస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కల్లా జీవో ఇప్పించాలని వేదికపై ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డిని ఆదేశించారు. రెడ్డి హాస్టల్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి మరో రూ.10 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇదిగో ఉదాహరణ వెంకట్రామిరెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. ‘‘నేను రెడ్డి హాస్టల్‌కు స్థలం చూడాలని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావును పిలిచి చెప్పా. అప్పుడు ఆయన కూడా వెంకట్రామిరెడ్డి గారంటే తనకూ అభిమానమని చెప్పారు. ఎందుకంటే తన సోదరి కూడా రెడ్డి మహిళా కళాశాలలో చదువుకుందని, ఆయన మహిళా విద్యాసంస్థను ఏర్పాటు చేయకపోయి ఉంటే ఆమెకు ఈ చదువు అందేది కాదని చెప్పారు. రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి చేసిన సేవలకు ఇదో ఉదాహరణ’’అని వివరించారు. రెడ్డి హాస్టల్ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎ.జితేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు వర ప్రసాద్‌రెడ్డి, జీవీ కృష్ణారెడ్డి, రెడ్డి సంఘాల నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి హాస్టల్ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో సీఎం పలువురికి సన్మానం చేశారు. వేదికపై పొంగులేటి, కింద చిన్నారెడ్డి రెడ్డి హాస్టల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి సభా సమయానికి కంటే ముందే వచ్చి సభికుల్లో కూర్చున్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి మాత్రం రాగానే వేదికపైకి వెళ్లి సీఎం కేసీఆర్, ఇతర మంత్రులను పలకరించి సభా వేదికపై ముందు వరుసలోనే ఆసీనులయ్యారు. కేసీఆర్ పేరును వెయ్యేళ్లు గుర్తుంచుకుంటారు: నాయిని రెడ్డి హాస్టల్ భవనానికి స్థలం కేటాయించాలని గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని.. కానీ కేసీఆర్‌కు ఒక్కమాట చెప్పడంతో పదెకరాల స్థలం, రూ.10 కోట్ల నిధులను కేటాయించారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి పేరును వందేళ్లు గుర్తుంచుకున్నామని, అలాగే కేసీఆర్ పేరును వెయ్యేళ్లు గుర్తించుకుంటామని అన్నారు. ఇలాంటి సీఎంను తామెప్పుడూ చూడలేదన్నారు. ‘‘ఈ మధ్య రెడ్ల గురించి ఎవరో ఏదో మాట్లాడరని బాధపడుతున్నారు. కానీ రెడ్ల వెనక సీఎం ఉన్నడు. ఎవరూ బాధపడాల్సిన పనిలేదు. అన్ని కులాలు, మతాలవారి సంక్షేమం కోసం సీఎం కృషి చేస్తున్నారు’’అని చెప్పారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా విద్యా, వ్యాపార, క్రీడా రంగంలో దూసుకుపోతోందన్నారు. శంషాబాద్ విమానాశ్రయం ఉండడంతో ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. కానీ 111 జీవో కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ జీవోను సడలించాలని విన్నవించారు. -
మరో 5 ఎకరాలు ఇస్తాం: సీఎం
రెడ్డి హాస్టల్ శంకుస్థాపన సభలో కేసీఆర్ ప్రకటన సాక్షి, బుద్వేల్: దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా రెడ్డి హాస్టల్‌ను తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో రెడ్డి హాస్టల్ నిర్మాణ సముదాయానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రెడ్డి హాస్టల్‌కు ఇప్పటికే కేటాయించిన 10 ఎకరాలకు తోడుగా మరో 5 ఎకరాలు కేటాయిస్తామని హామీయిచ్చారు. నారాయణగూడలో బాలికల హాస్టల్‌కు అదనంగా 1500 గజాలు ఇస్తామన్నారు. బుద్వేల్‌లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భారీ ఎడ్యుకేషన్ టవర్ నిర్మించి క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగేలా చూడాలని కోరారు. సమైక్య రాష్ట్రంలో మహనీయుల పేర్లు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాయమైన పేర్లన్నింటినీ పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ రెండో వారంలోనే పోలీస్ అకాడమీకి రాజ బహద్దుర్ వెంకట రామారెడ్డి పేరు పెట్టామని తెలిపారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి జయశంకర్ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేంద్రరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రేపు రెడ్డి హాస్టల్‌కు సీఎం శంకుస్థాపన
స్థలాన్ని పరిశీలించిన మంత్రులు నాయిని, పట్నం హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతంలో రెడ్డి హాస్టల్ నిర్మాణానికి ఈ నెల 22న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. 10 ఎకరాల స్థలంలో చేపట్టే హాస్టల్ భవన నిర్మాణానికి సీఎం ఇటీవల 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, చింతల రామచంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ఆదివారం ఆ స్థలాన్ని పరిశీలించారు. 30 శాతం ఇతర కులాల విద్యార్థులకు హాస్టల్లో వసతి కల్పిస్తామని మంత్రులు తెలిపారు. కేసీఆర్ రాక నేపథ్యంలో సీఎం సెక్యూరిటీ సిబ్బంది బుద్వేల్ స్థలాన్ని పరిశీలించారు. బాంబ్, డాగ్ స్క్వాడ్, కూంబింగ్ టీంలు పరిసరాలను జల్లెడ పట్టాయి. శంకుస్థాపన స్థలం వద్ద ప్రత్యేకంగా మూడు క్యాంపులను ఏర్పాటు చేశారు. శతాబ్ది ఉత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ నారాయణగూడలోని రెడ్డి బాలికల హాస్టల్లో హాస్టల్ శతాబ్ది ఉత్సవాల ఆహ్వానపత్రిక, బ్రోచర్‌ను ఆదివారం ఇక్కడ రాజాబహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎడ్ల రఘుపతిరెడ్డి ఆవిష్కరించారు. జయంతి వేడుకలను సీఎం ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. వెంకటరామారెడ్డి స్వగ్రామం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయంపేటను దత్తతకు తీసుకుని రూ.2.30 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. రెడ్డి హాస్టల్ ఘనచరిత్ర ఇది మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి, రావి నారా యణరెడ్డి, జస్టిస్ సీతారాంరెడ్డి, యూజీసీ చైర్మ న్గా పనిచేసిన జి.రామిరెడ్డి చదువుకునే రోజుల్లో ఈ హాస్టల్లో వసతి పొం దారు. వీరితోపాటు అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రముఖ విద్యావేత్తలు ఈ హాస్టల్లో ఉండి తమ కెరీర్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకున్నారు. -
వెంకట్రాంరెడ్డికి సమున్నత గౌరవం
సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఘనంగా రెడ్డి హాస్టల్ శతాబ్ది వేడుకలు స్మారక నిర్మాణం కోసం బుద్వేల్‌లో స్థలం కేటాయింపు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో విద్యా వ్యాప్తికి కృషిచేసిన తెలంగాణ వైతాళికుడు రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డిని ఘనంగా స్మరించు కోవడానికి, భావితరాలకు ఆయన గొప్పతనం తెలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వెంకట్రాంరెడ్డి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో సమున్నతంగా ప్రతిష్టించేందుకు అనువైన స్థలాన్ని గుర్తించా ల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. వెంకట్రాంరెడ్డి స్మారక నిర్మాణం కోసం రాజేం ద్రనగర్ మండలం బుద్వేల్‌లో 10 ఎకరాల స్థలం కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంకట్రాంరెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ రఘుపతిరెడ్డికి సీఎం శనివారం ప్రగతిభవన్ లో అందించారు. కార్యక్రమంలో ఎంపీ జితేం దర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వెంకట్రాంరెడ్డి స్థాపించిన రెడ్డి హాస్టల్ వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించను న్నట్లు ప్రకటించారు. త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని వెల్ల డించారు. సాంస్కృతిక శాఖకు కార్యక్రమాల నిర్వహణ బాధ్యత అప్పగిస్తామన్నారు. వెంక ట్రాంరెడ్డి తెలంగాణలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని, దాదాపు 14 విద్యాసంస్థలు నెలకొల్పారని కొనియాడారు. ఆయన స్థాపించిన విద్యా సంస్థల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు లాంటి వారెం దరో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. బాలికల విద్యను ప్రోత్సహించ డానికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. ఆయన చేసిన కృషి సమైక్య పాలనలో విస్మరణకు గురైందన్నారు. రెడ్డి హాస్టల్ సమీ పంలోని నారాయణగూడ చౌరస్తాకు కొత్వాల్ వెంకట్రాంరెడ్డి పేరు పెట్టుకున్నా ఆ పేరు ప్రచారంలోకి రాకుండా చేశారన్నారు. తెలం గాణ వైతాళికులకు గుర్తింపు, గౌరవం దక్కి తీరాలని సీఎం ఆకాంక్షించారు. వెంకట్రాంరెడ్డి స్మారకం నిర్మించడంతో పాటు అదే ప్రాంగ ణంలో కల్యాణ మండపం నిర్మించాలని, అందులో రెడ్డి కులానికి చెందిన పేదలకు ఉచి తంగా వివాహాలు జరపాలని సీఎం సూచించా రు. స్మారకం, కల్యాణ మండపం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంకట్రాంరెడ్డి స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం రాయపేటలో త్వరలో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని రఘుపతిరెడ్డి, జితేందర్‌రెడ్డి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. -
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు...
రెడ్డిజన సంఘం వజ్రోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ వెల్లడి రెడ్డి హాస్టల్ విస్తరణకు స్థలంతో పాటు రూ. 10 కోట్లు హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై త్వరలోనే తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయలేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి, రాజ బహదూర్ వెంకట్రామిరెడ్డిలతో పాటు రావి నారాయణరెడ్డి, రఘుపతిరెడ్డి లాంటి ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారన్నారు. అలాంటి మహనీయుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పాతబస్తీ అలియాబాద్‌లో రెడ్డి జన సంఘం వజ్రోత్సవ వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డితో కలసి స్మారక స్తూపాన్ని, సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ 75 ఏళ్లుగా రెడ్డి జన సంఘం ప్రజా సేవలో నిమగ్నమవడం అభినందనీయమన్నారు. ఇలాంటి చారిత్రక కార్యక్రమానికి హాజరుకావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి 98 ఏళ్ల క్రితమే రెడ్డి హాస్టల్ స్థాపించి ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. నగరంలో 1933లోనే మహిళా కళాశాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ చారిత్రక పరంపర కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెడ్డి హాస్టల్లో అన్ని కులాలకు సంబంధించిన వారు విద్యనభ్యసించడం అభినందనీయమని సీఎం అన్నారు. రెడ్డి హాస్టల్ విస్తరణ కోసం 5 నుంచి 10 ఎకరాల స్థలం కావాలని నిర్వాహకులు తనను అడిగారని... విస్తరణ అవసరాన్ని గుర్తించి నగర శివార్లలో వారం పది రోజుల్లో స్థలాన్ని సేకరిస్తామన్నారు. ప్రభుత్వం తరఫున రూ. 10 కోట్ల నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. అనంతరం హోం మంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి మాట్లాడుతూ రెడ్డి జన సంఘం సేవా కార్యక్రమాలను తాను స్వయానా చూశానన్నారు. 50 ఏళ్ల క్రితం తాను చందూలాల్ బేలాలో నివాసం ఉండేవాడినని, సంఘ సేవా కార్యక్రమాలలో కూడా పలుమార్లు పాల్గొన్నానన్నారు. అనంతరం జస్టిస్ సుభాషణ్ రెడ్డి మాట్లాడుతూ 75 ఏళ్ల క్రితం సంఘం ఏర్పాటు చేసి ఆర్థిక వనరులు సృష్టించుకొని సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు విభాగం మాజీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్ రెడ్డి సభాధ్యక్షత వహించగా.. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి, రెడ్డి జన సంఘం అధ్యక్షుడు బి.మాధవరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు బి.శ్యాంసుందర్ రెడ్డి, కార్యదర్శి ఎస్.శివారెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎస్.మధుసూదన్ రెడ్డి, ఉప కార్యదర్శులు బొక్క రాంచంద్రారెడ్డి, మామిడి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి పి.బోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.