రేపు రెడ్డి హాస్టల్‌కు సీఎం శంకుస్థాపన
స్థలాన్ని పరిశీలించిన మంత్రులు నాయిని, పట్నం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతంలో రెడ్డి హాస్టల్ నిర్మాణానికి ఈ నెల 22న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. 10 ఎకరాల స్థలంలో చేపట్టే హాస్టల్ భవన నిర్మాణానికి సీఎం ఇటీవల 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, చింతల రామచంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ఆదివారం ఆ స్థలాన్ని పరిశీలించారు. 30 శాతం ఇతర కులాల విద్యార్థులకు హాస్టల్‌లో వసతి కల్పిస్తామని మంత్రులు తెలిపారు. కేసీఆర్ రాక నేపథ్యంలో సీఎం సెక్యూరిటీ సిబ్బంది బుద్వేల్ స్థలాన్ని పరిశీలించారు. బాంబ్, డాగ్ స్క్వాడ్, కూంబింగ్ టీంలు పరిసరాలను జల్లెడ పట్టాయి. శంకుస్థాపన స్థలం వద్ద ప్రత్యేకంగా మూడు క్యాంపులను ఏర్పాటు చేశారు.
శతాబ్ది ఉత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ
నారాయణగూడలోని రెడ్డి బాలికల హాస్టల్‌లో హాస్టల్ శతాబ్ది ఉత్సవాల ఆహ్వానపత్రిక, బ్రోచర్‌ను ఆదివారం ఇక్కడ రాజాబహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎడ్ల రఘుపతిరెడ్డి ఆవిష్కరించారు. జయంతి వేడుకలను సీఎం ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. వెంకటరామారెడ్డి స్వగ్రామం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయంపేటను దత్తతకు తీసుకుని రూ.2.30 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
రెడ్డి హాస్టల్ ఘనచరిత్ర ఇది
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి, రావి నారా యణరెడ్డి, జస్టిస్ సీతారాంరెడ్డి, యూజీసీ చైర్మ న్‌గా పనిచేసిన జి.రామిరెడ్డి చదువుకునే రోజుల్లో ఈ హాస్టల్‌లో వసతి పొం దారు. వీరితోపాటు అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రముఖ విద్యావేత్తలు ఈ హాస్టల్‌లో ఉండి తమ కెరీర్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకున్నారు.