అత్యున్నత విద్యావేదికగా రెడ్డి హాస్టల్
⇒ ఐఎస్‌బీ తరహాలో ఎడ్యుకేషనల్ టవర్స్ నిర్మించండి: ముఖ్యమంత్రి కేసీఆర్
⇒ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల కోసం అన్ని కంపెనీలు ఇక్కడికే రావాలి
సాక్షి, హైదరాబాద్
‘‘రెడ్డి హాస్టల్ ప్రాంగణంలో ఐఎస్‌బీ తరహాలో ఎడ్యుకేషనల్ టవర్స్ నిర్మించాలి. అవి అత్యున్నత విద్యా ప్రమాణాలకు నాంది కావాలి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల కోసం అన్ని సంస్థలూ ఇక్కడికే వచ్చేలా చేయాలన్నది నా కోరిక..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి 149వ జయంతి, రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో పదెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న రెడ్డి హాస్టల్ కాంప్లెక్స్ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి పదెకరాల భూమి, రూ.10 కోట్ల నిధులివ్వడం పెద్ద పనేమీ కాదని, అది రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు. నిజాం హయాంలో కొత్వాల్ హోదాలో వెంకట్రామిరెడ్డి సేవాభావం, ముందుచూపుతో ఏర్పాటు చేసిన విద్యాసంస్థలకు ఏమిచ్చినా తక్కువేనని అన్నారు.
ఈ విద్యాసంస్థల నుంచి ప్రధాన మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు వెలుగులోకి వచ్చారని, తెలంగాణ విద్యార్థులకెందరికో ఈ విద్యాసంస్థలు ఉపయోగపడ్డాయని చెప్పారు. ‘‘రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి, రావి నారాయణరెడ్డి, ధర్మారెడ్డి, కేవీ రంగారెడ్డి, భాగ్యరెడ్డి వర్మ లాంటి ఎందరో తెలంగాణ వైతాళికుల చరిత్ర సమైక్య రాష్ట్రంలో కనిపించకుండా పోయింది. ఇప్పుడు వారందరి స్ఫూర్తిని మననం చేసుకుని వారి చరిత్రను మనసులో నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం..’’అని అన్నారు. తెలంగాణ వారసత్వ సంపద పునరుజ్జీవానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణకు చెందిన చారిత్రక వ్యక్తుల్లో వెంకట్రామిరెడ్డి ఒకరని, కానీ ఆయన చరిత్రను సమైక్య రాష్ట్రంలో గుర్తించలేదన్నారు. సురవరం ప్రతాపరెడ్డి ఆయన చరిత్రను రాసి ఉండకపోతే ఆయన గురించి ఈ మాత్రం కూడా తెలిసేది కాదని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి వ్యక్తులను తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండో వారంలోనే రాష్ట్ర పోలీస్ అకాడమీకి ఆయన పేరు పెట్టాం. ఉన్నత, సంపన్న కుటుంబం నుంచి వచ్చినా ఆయన పేదల కోసం, అవకాశాలు లేని వారి కోసం తపన పడ్డారు. 14 ఏళ్ల పాటు కొత్వాల్‌గా సుస్థిర సేవలందించిన రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి వంటి వారి చరిత్రను పునరుజ్జీవనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ స్ఫూర్తిని మనసులో నింపుకున్న మంచి రోజుగా ఇది మిగిలిపోతుంది’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మరో ఐదెకరాల స్థలం
విద్యా సంస్థల నిర్మాణానికి మరింత భూమి కావాలన్న రెడ్డి హాస్టల్ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు మరో ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. అలాగే నారాయణగూడలోని రెడ్డి మహిళా వసతి గృహం నిర్మాణం కోసం పక్కనే ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రాంగణంలో 1,500 గజాల భూమిని కూడా ఇస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కల్లా జీవో ఇప్పించాలని వేదికపై ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డిని ఆదేశించారు. రెడ్డి హాస్టల్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి మరో రూ.10 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఇదిగో ఉదాహరణ
వెంకట్రామిరెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. ‘‘నేను రెడ్డి హాస్టల్‌కు స్థలం చూడాలని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావును పిలిచి చెప్పా. అప్పుడు ఆయన కూడా వెంకట్రామిరెడ్డి గారంటే తనకూ అభిమానమని చెప్పారు. ఎందుకంటే తన సోదరి కూడా రెడ్డి మహిళా కళాశాలలో చదువుకుందని, ఆయన మహిళా విద్యాసంస్థను ఏర్పాటు చేయకపోయి ఉంటే ఆమెకు ఈ చదువు అందేది కాదని చెప్పారు. రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి చేసిన సేవలకు ఇదో ఉదాహరణ’’అని వివరించారు. రెడ్డి హాస్టల్ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎ.జితేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు వర ప్రసాద్‌రెడ్డి, జీవీ కృష్ణారెడ్డి, రెడ్డి సంఘాల నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి హాస్టల్ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో సీఎం పలువురికి సన్మానం చేశారు.
వేదికపై పొంగులేటి, కింద చిన్నారెడ్డి
రెడ్డి హాస్టల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి సభా సమయానికి కంటే ముందే వచ్చి సభికుల్లో కూర్చున్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి మాత్రం రాగానే వేదికపైకి వెళ్లి సీఎం కేసీఆర్, ఇతర మంత్రులను పలకరించి సభా వేదికపై ముందు వరుసలోనే ఆసీనులయ్యారు.
కేసీఆర్ పేరును వెయ్యేళ్లు గుర్తుంచుకుంటారు: నాయిని
రెడ్డి హాస్టల్ భవనానికి స్థలం కేటాయించాలని గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని.. కానీ కేసీఆర్‌కు ఒక్కమాట చెప్పడంతో పదెకరాల స్థలం, రూ.10 కోట్ల నిధులను కేటాయించారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి పేరును వందేళ్లు గుర్తుంచుకున్నామని, అలాగే కేసీఆర్ పేరును వెయ్యేళ్లు గుర్తించుకుంటామని అన్నారు. ఇలాంటి సీఎంను తామెప్పుడూ చూడలేదన్నారు. ‘‘ఈ మధ్య రెడ్ల గురించి ఎవరో ఏదో మాట్లాడరని బాధపడుతున్నారు. కానీ రెడ్ల వెనక సీఎం ఉన్నడు. ఎవరూ బాధపడాల్సిన పనిలేదు. అన్ని కులాలు, మతాలవారి సంక్షేమం కోసం సీఎం కృషి చేస్తున్నారు’’అని చెప్పారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా విద్యా, వ్యాపార, క్రీడా రంగంలో దూసుకుపోతోందన్నారు. శంషాబాద్ విమానాశ్రయం ఉండడంతో ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. కానీ 111 జీవో కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ జీవోను సడలించాలని విన్నవించారు.