ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు...
రెడ్డిజన సంఘం వజ్రోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ వెల్లడి
రెడ్డి హాస్టల్ విస్తరణకు స్థలంతో పాటు రూ. 10 కోట్లు
హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై త్వరలోనే తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయలేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి, రాజ బహదూర్ వెంకట్రామిరెడ్డిలతో పాటు రావి నారాయణరెడ్డి, రఘుపతిరెడ్డి లాంటి ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారన్నారు. అలాంటి మహనీయుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పాతబస్తీ అలియాబాద్‌లో రెడ్డి జన సంఘం వజ్రోత్సవ వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డితో కలసి స్మారక స్తూపాన్ని, సావనీర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ 75 ఏళ్లుగా రెడ్డి జన సంఘం ప్రజా సేవలో నిమగ్నమవడం అభినందనీయమన్నారు. ఇలాంటి చారిత్రక కార్యక్రమానికి హాజరుకావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి 98 ఏళ్ల క్రితమే రెడ్డి హాస్టల్ స్థాపించి ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. నగరంలో 1933లోనే మహిళా కళాశాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ చారిత్రక పరంపర కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెడ్డి హాస్టల్‌లో అన్ని కులాలకు సంబంధించిన వారు విద్యనభ్యసించడం అభినందనీయమని సీఎం అన్నారు. రెడ్డి హాస్టల్ విస్తరణ కోసం 5 నుంచి 10 ఎకరాల స్థలం కావాలని నిర్వాహకులు తనను అడిగారని... విస్తరణ అవసరాన్ని గుర్తించి నగర శివార్లలో వారం పది రోజుల్లో స్థలాన్ని సేకరిస్తామన్నారు.
ప్రభుత్వం తరఫున రూ. 10 కోట్ల నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. అనంతరం హోం మంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి మాట్లాడుతూ రెడ్డి జన సంఘం సేవా కార్యక్రమాలను తాను స్వయానా చూశానన్నారు. 50 ఏళ్ల క్రితం తాను చందూలాల్ బేలాలో నివాసం ఉండేవాడినని, సంఘ సేవా కార్యక్రమాలలో కూడా పలుమార్లు పాల్గొన్నానన్నారు. అనంతరం జస్టిస్ సుభాషణ్ రెడ్డి మాట్లాడుతూ 75 ఏళ్ల క్రితం సంఘం ఏర్పాటు చేసి ఆర్థిక వనరులు సృష్టించుకొని సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు విభాగం మాజీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్ రెడ్డి సభాధ్యక్షత వహించగా.. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి, రెడ్డి జన సంఘం అధ్యక్షుడు బి.మాధవరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు బి.శ్యాంసుందర్ రెడ్డి, కార్యదర్శి ఎస్.శివారెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎస్.మధుసూదన్ రెడ్డి, ఉప కార్యదర్శులు బొక్క రాంచంద్రారెడ్డి, మామిడి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి పి.బోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.