సాక్షి, యాదాద్రి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించారు.
కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్మిర్మాణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ. 235 కోట్లతో చేపట్టిన ఆలయ పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రోడ్ల నిర్మాణం, భూసేకరణ కోసం 109 కోట్లు, టెంపుల్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు 103 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఈ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. వచ్చే ఫిబ్రవరిలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. 3 వేల మంది రుత్వికులు, 3 వేల మంది వేద పారాయణదారులు, 3 వేల మంది సహాయకులు యాగంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో యాగం తేదీలను కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. అంతకుముందు యాదాద్రిలో కేసీఆర్‌కు మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, ఫైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, కలెక్టర్ అనితా రాంచంద్రన్ తదితరులు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment